దినేష్‌రెడ్డిని కొనసాగించాలని ఆదేశించలేం: క్యాట్
సాక్షి, హైదరాబాద్: తనను మరో ఏడాదిపాటు డీజీపీగా కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దినేష్‌రెడ్డి విన్నపాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తోసిపుచ్చింది. ఇప్పటికే డీజీపీగా ఆయన రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేశారని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని తేల్చిచెప్పింది. అయితే దినేష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారణకు స్వీకరించిన క్యాట్... దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
దినేష్‌రెడ్డి పదవీ విరమణకు నోటిఫికేషన్
దినేష్‌రెడ్డిని డీజీపీగా కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని క్యాట్ స్పష్టం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే... ప్రభుత్వం ఆయన పదవీ విరమణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 1953 సెప్టెంబర్ 18న జన్మించిన దినేష్‌రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి అందులో పేర్కొన్నారు.