దినేష్ రెడ్డి పిటీషన్ పై రేపు హైకోర్టులో విచారణ
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో ఆదివారం విచారణ కు రానుంది. ఏడాది కాలం పాటు తన పదవీ కాలన్నీ పొడగించాలని కోరుతూ శనివారం ఆయన హౌస్ మోషన్ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేశారు. దీనిని హైకోర్టు రేపు ఉదయం 11గం.లకు విచారించనుంది. పదవీ విరమరణ వయస్సుతో సంబంధం లేకుండా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు సేవ చేయొచ్చని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడగించాలని ఆయన ఆ పిటిషన్లో కోరారు.
తనను మరో ఏడాదిపాటు డీజీపీగా కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దినేష్‌రెడ్డి విన్నపాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే డీజీపీగా ఆయన రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేశారని, ఇక ఆయనను డీజీపీ కొనసాగించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ..దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని శుక్రవారమే క్యాట్ తేల్చిచెప్పింది. క్యాట్ అలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే... ప్రభుత్వం ఆయన పదవీ విరమణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 1953 సెప్టెంబర్ 18న జన్మించిన దినేష్‌రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి అందులో పేర్కొన్నారు.