12 అర్ధరాత్రి నుంచి సమ్మె : ఏపీ ఎన్జీవోల ప్రకటన
సీఎస్‌కు సమ్మె నోటీసు: సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు సమరశంఖం పూరించారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. సమ్మెలో దాదాపు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, మునిసిపల్ ఉద్యోగులు, విద్యుత్ సిబ్బంది, ఆర్‌టీసీ కార్మికులు పాల్గొననున్నారు. ఈ మేరకు వివిధ శాఖలు, విభాగాలకు చెందిన దాదాపు 70 సంఘాల పక్షాన ఏపీఎన్‌జీవోలు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి సమ్మె నోటీసు ఇచ్చారు.
అనంతరం ఏపీఎన్‌జీవో నేతలు సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించటం స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట అని.. కేవలం 10 - 11 ఎంపీ స్థానాల కోసం రాష్ట్రాన్ని విభజించటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ఉద్యోగుల శ్రేయస్సు కోసం రాష్ట్రాన్ని విభజించవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని సీఎస్‌ను కోరామన్నారు.
విభజనను జీర్ణించుకోలేకపోతున్నారు...
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎంతకైనా తెగించి ఉద్యమించటానికి సిద్ధమని ప్రకటించారు. తమచేత ఉద్యోగాలు చేయిస్తారో, ఉద్యమాలు చేయిస్తారో.. కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, నేతలు చంద్రశేఖరరెడ్డి, వీరేంద్రబాబు, వెంకటేశ్వరరెడ్డి, గంగిరెడ్డి, లూక్, సత్యనారాయణ, శోభ, రత్నకుమారి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు యోగేశ్వరరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ విభజనను సీమాంధ్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎక్కడో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిక్షా కార్మికుడు సైతం హైదరాబాద్ తమది కాదన్న మాటకు బాధపడుతూ స్వచ్ఛందంగా ఆందోళనకు దిగుతున్నారని పేర్కొన్నారు.
సీమాంధ్ర ఎంపీలంతా రాజీనామా చేయాలి...
సీమాంధ్ర ఎంపీలు అందరూ లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలకు, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తే.. పార్లమెంటులో రాజకీయ శూన్యత ఏర్పడి విభజన ఆగిపోతుందని విశ్వసిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. ఎంపీలను వారి పార్టీలకు రాజీనామాలు చేయమని తాము అడగటం లేదని, పదవులను మాత్రమే త్యజించాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం చిన్న ఉద్యమం చేయటానికి కూడా పార్టీలు, నాయకులు ముందుకురాకపోవటం సీమాంధ్ర ప్రజల దురదృష్టమని విచారం వ్యక్తంచేశారు. ఈ నెల 12వ తేదీలోగా సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాలకు, మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలంతా పదవులు త్యజిస్తే.. సమ్మె విషయంలో పునరాలోచన ఉంటుందని సంఘాల నాయకులు చెప్పారు.
భావి తరాల భవిత కోసమే...
తమ ఉద్యోగాలు పోతాయనే భయంతో తాము ఉద్యమం చేయటం లేదని.. రాష్ట్ర విభజనను అడ్డుకోవటానికి ఏమీ చేయలేకపోయారని భవిష్యత్ తరం తమను నిందించకూడదనే ఈ ఆందోళనకు దిగుతున్నామని పేర్కొన్నారు. విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లలో ఆస్తులను అమ్ముకుని హైదరాబాద్‌లో చిన్న గూడు కొనుక్కున్న ఉద్యోగులను హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మని అంటే ఎక్కడికి వెళతారని వారు ప్రశ్నించారు. రాజధాని అంటే.. ఆస్తులు, పెట్టబడులు, లక్షలాది ఉద్యోగాలతో పాటు బంధాలు, ప్రేమలు, అభిమానాలు, అనుబంధాల సమ్మిళితమని పేర్కొన్నారు. సమ్మె వల్ల తమకు ఒక నెల జీతమే పోతుందని, విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని చెప్పారు. విభజన నష్టంతో పోలిస్తే.. ఉద్యోగులకు జరిగే నష్టం ఎక్కువేమీ కాదన్నారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంటుందని, విభజన వల్ల జరిగే కష్టం, నష్టంతో పోలిస్తే సమ్మె వల్ల కలిగే ఇబ్బంది పెద్దదేమీ కాదని చెప్పారు.
జాతీయ పార్టీల నేతలనూ కలుస్తాం...: రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను కలవటంతో పాటు 12వ తేదీ తర్వాత ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీల నేతలనూ కలిసి ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఏకాభిప్రాయం ఉన్న చోట్ల చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అభ్యంతరం లేదని.. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వ పెద్దలనూ నిలదీస్తామన్నారు. రాజకీయ అంశాలపైన ఉద్యోగులు సమ్మె చేయవచ్చా? అని విలేకరులు అడిగినప్పుడు.. ‘‘సాధారణ పరిస్థితుల్లో అయితే చేయకూడదు. విభజన అంశం.. రాజకీయ, సామాజిక కోణాల్లో చూడాలి. సమాజం మీద, ఉద్యోగుల మీద నేరుగా ప్రభావించే సమయాల్లో నిరసన వ్యక్తం చేయటానికి సమ్మె చేయచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవటానికి, సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనల్లో భాగం పంచుకోవటానికి ఉద్యోగులుగా మా వంతు బాధ్యతను నిర్వర్తించటం మా కర్తవ్యంగా భావిస్తున్నాం’’ అని వారు వివరించారు.
విభజనను ఆపి అభిప్రాయాలు సేకరించాలి
ఉద్యోగులకు ఇబ్బంది ఉండదని, వారి సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశామని కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సీడబ్ల్యూసీలో నిర్ణయాన్ని నిలిపివేసి ఇరు ప్రాంతాల ప్రజలు, ఉద్యోగుల నుంచి హైలెవల్ కమిటీ అభిప్రాయాలు సేకరించాలని డిమాండ్ చేశారు.
సమ్మెలో 3.5 లక్షల మంది ఉద్యోగులు...
ఈ నెల 12వ తేదీ (సోమవారం) అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెలో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారని సంఘాల నేతలు తెలిపారు. ఉపాధ్యాయులు, మునిసిపల్ ఉద్యోగులు, విద్యుత్ శాఖ సిబ్బంది, ఆర్‌టీసీ కార్మికులు సమ్మెలో ఉంటారని చెప్పారు. ఈమేరకు ఆయా సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 4న విజయవాడలో జరిగిన సమావేశంలో దాదాపు 70 సంఘాలు సమ్మెలో పాల్గొంటామని తెలిపాయని, అన్ని సంఘాల తరఫున తామే (ఏపీఎన్‌జీవో) సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు.