థర్డ్ అంపైర్ చెబితే వినాల్సిందే
ఉపాధ్యాయ గర్జనలో మంత్రి శ్రీధర్‌బాబు
ముఖ్యమంత్రి లక్ష్యంగా పరోక్ష విమర్శలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనమేనని రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. ‘‘యుద్ధం అయిపోయింది. మేం గెలిచాం. అంతిమ తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. అయితే ఇంకా చివరి బంతి ఉందని అంటున్నారు. అంటే నో బాల్ వేస్తే పది పరుగులు గుంజవచ్చనే యత్నంలో ఉన్నారు. కానీ మ్యాచ్ అయిపోయింది. థర్డ్ అంపైర్‌పై నమ్మకం ఉంచాలి. ఆయన చెప్పినప్పుడు మైదానం వీడివెళ్లాలి. క్రీ డాస్ఫూర్తి ఉన్నవాళ్లు చేయాల్సిందిదే.
ఆ క్రీడాస్ఫూర్తి ఉంది కాబట్టే మంత్రులమైనా, ఎమ్మెల్యేలమైనా ఓపిగ్గా ఉన్నాం. నేను చెప్పినా, సీఎం చెప్పినా, ఎవరేం చెప్పినా సీడబ్ల్యూసీ చేసిన తీర్మానమే శిలాశాసనం. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తథ్యం..’’ అని చెప్పారు. బుధవారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ పీఆర్టీయూ నిర్వహించిన ‘ఉపాధ్యాయ గర్జన’లో శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్ నేత కె.కేశవరావు, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
ఇతర పార్టీల నేతలతో పాటు కొందరు సొంతపార్టీ నేతలు కూడా సీఎంపై ధ్వజమెత్తారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘కొందరు పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారు. 1955లో నెహ్రూ ఏమన్నారు? తెలంగాణ ప్రజలు ఎప్పుడు విడిపోవాలని కోరుకుంటే అప్పుడు తెలంగాణ ఇవ్వాల్సిందేనని అన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోయిన సంగతి గుర్తుతెచ్చుకోవాలి. 60 శాతం తమిళులే ఉన్నారని, తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని ఆనాడు అయ్యదేవర కాళేశ్వరరావు చెప్పారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది కూడా అందుకే. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్నవారు చరిత్ర చూడాలి.
హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డవారే అభివృద్ధి చెందారు తప్ప వారు హైదరాబాద్‌కు చేసిందేమీ లేదు. నీళ్లు, ఉద్యోగాలంటూ.. హైదరాబాద్ విషయంలో రెచ్చగొట్టి వైషమ్యాలు సృష్టించవద్దు. నీటి సమస్య వస్తుందంటున్నవాళ్లు ఇన్నేళ్లు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడలేదెందుకు? మనవాళ్లు బెంగళూరులో చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతమాత్రాన బెంగళూరు మనది అనడం సమంజసమా? న్యూయార్క్‌లోనూ, వాషింగ్టన్‌లోనూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతమాత్రాన అవి మనవే అంటే ఊరుకుంటారా? ప్రపంచంలోని ఏ రాజ్యాంగంలోనూ అలా లేదు..’ అని అన్నారు. కరీంనగర్ పర్యటన సందర్భంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని సీఎం చెప్పారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు మాటమార్చి వెధవ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
‘ఆయన మాటలు వింటుంటే కడుపులో మండుతోంది. సీఎం పదవి నిలుపుకునేందుకు మూడేళ్లుగా అధిష్టానం మాటకు సరేనని ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఆయన తెలుగు జాతిని విడగొట్టవద్దని అంటున్నారు. అసలు ఆయనకు తెలుగువచ్చా? ఆయన భాష ఎవరికైనా అర్థమవుతుందా? నా ఇంటి వెనకాలే ఉంటారు. ఆయన మాటలు కానీ, బొత్స సత్యనారాయణ మాటలు కానీ నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. మేం ఆంటోనీ కమిటీ వద్దకు వెళ్లినప్పుడు హైదరాబాద్ సంగతేంటని అడిగారు. ఒకటే ఉదాహరణ చెప్పాం. తిరుపతికి వెళ్లినప్పుడు అక్కడ హుండీలో డబ్బులు వేస్తాం. అంతమాత్రాన తిరుపతి మాక్కావాలంటే కుదురుతుందా అని అడిగాం. కమిటీకి బోధపడింది. తెలంగాణ వచ్చితీరుతుంది..’ అని పేర్కొన్నారు.
పట్టుచీరల షోరూములు ఎక్కడికీ వెళ్లవు..!
సమన్యాయం చేస్తామన్నవాళ్లు సీమాంధ్రకు కావాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలని గుత్తా సూచించారు. రాజధాని ఎక్కడ ఉండాలో, ఎలాంటి రక్షణ కావాలో చెప్పాలి తప్ప విభజనను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ‘‘సీమాంధ్ర మంత్రుల భార్యలు ఢిల్లీ వెళ్లి విభజనను అడ్డుకోవాలని చూశారు. తల్లీ మీ పట్టుచీరల షోరూములు ఎక్కడికీ వెళ్లవు. మీ రాజధానిలో కూడా పెద్ద పెద్ద షోరూములు వస్తాయి. సీమాంధ్ర మంత్రులు కూడా రాష్ట్రాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు. మా నోటికాడి బుక్క లాక్కోకండి. అన్నదమ్ముల్లా కలిసి ఉందాం..’’ అని అన్నారు. మేం కలిసి ఉండమంటే యాసిడ్ పోసి బెదిరించి కలిసి ఉండాల్సిందేనన్నట్టుగా వ్యవహరించడం మంచిది కాదని కేశవరావు అన్నారు.
ముఖ్యమంత్రి నీటివివాదాల గురించి మాట్లాడుతున్నారంటూ.. నీటి పారుదల శాఖ మంత్రి వెంటనే దానిపై వివరణ ఇచ్చిన సంగతి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి మాటల్లో కొంచెం కూడా సిగ్గూ లజ్జా లేదని విమర్శించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యే ముఖ్యమంత్రి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని హితవు పలికారు. తెలంగాణ ఏర్పాటుపై ఇంకా ఆలస్యం చేస్తే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. చంద్రబాబు జూలై 30 కంటే ముందు ఒకలా, ఇప్పుడు మరొకలా ఊగిసలాట ధోరణితో ఉన్నారని సీపీఐ నేత చాడ విమర్శించారు. గర్జనసభకు తెలంగాణ పది జిల్లాల నుంచి భారీగా ఉపాధ్యాయులు తరలివచ్చారు. పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకటరెడ్డి, పి.సరోత్తమరెడ్డి, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి ప్రసంగించారు.
థర్డ్ అంపైర్ చెబితే వినాల్సిందే: శ్రీధర్‌బాబు
Published Thu, Oct 3 2013 4:03 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement