సోనియా చెబితేనే సీఎంగా కొనసాగా: కిరణ్ | I continued in CM post according to Sonia Gandhi instructions, Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

సోనియా చెబితేనే సీఎంగా కొనసాగా: కిరణ్

Published Thu, Feb 20 2014 1:41 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సోనియా చెబితేనే సీఎంగా కొనసాగా: కిరణ్ - Sakshi

సోనియా చెబితేనే సీఎంగా కొనసాగా: కిరణ్

  •   రాజీనామా చేసి ఉంటే 4 నెలల క్రితమే తెలంగాణ వచ్చేసేది
  •   కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందం వల్లనే రాష్ట్ర విభజన
  •   అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నందుకు నిరసన గా రాజీనామా చేస్తున్నా
  •   ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కూ రాజీనామా
  •   ఎక్కడైనా తెలంగాణ ప్రజలను బాధిస్తే క్షమాపణ చెబుతున్నా..
  •   సీఎం మీడియా సమావేశానికి పలువురు అమాత్యులు దూరం.. 8 మంది మంత్రులు, 14 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీల హాజరు
  •   విభజన తీరుపై కాంగ్రెస్ పార్టీని, సోనియాను పల్లెత్తు మాటనని కిరణ్ 
  •  
     సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసిననాడే రాజీనామా చేయాలనుకున్నా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వద్దని ఆదేశించడంతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాల్సి వచ్చిందని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆరోజే రాజీనామా చేసి ఉంటే నాలుగు నెలల క్రితమే తెలంగాణ వచ్చేసేదన్నారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగుజాతిని నిలువునా చీల్చారని, ఇరుప్రాంతాల ప్రజలను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందంతో తెలుగుజాతి నష్టపోయిందని పేర్కొన్నారు. పద్ధతులు, నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా చేసిన ఈ విభజనకు నిరసనగా సీఎం పదవికి, ఎమ్మెల్యే స్థానానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. 8 మంది మంత్రులు, 14 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
     
     సాదాసీదాగా రాజీనామా ప్రకటన
     పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారని ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో సీఎం ఎలాంటి హడావుడి లేకుండా సాదాసీదాగా రాజీనామా ప్రకటన ముగించారు. వాస్తవానికి మంగళవారమే రాజీనామా చేద్దామనుకున్న కిరణ్.. తనతో కలసివచ్చే మంత్రులు ఎవరూ లేకపోవడంతో పాటు రాజ్యసభలో ఏమవుతుందో చూశాక రాజీనామా చేద్దామని కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో సమీకరించేందుకు సీఎంఓ నుంచే ప్రయత్నాలు చేశారు. ప్రత్యేకంగా ఫోన్లు చేసి బుధవారం ఉదయూన్నే క్యాంపు కార్యాలయానికి రావలసిందిగా సమాచారమిచ్చారు. పదిన్నర గంటల వరకు నలుగురు మంత్రులు ఐదుగురు ఎమ్మెల్యేలు మినహా పెద్దగా ఎవరూ రాలేదు. దీంతో మరోసారి మిగతావారికి ఫోన్లు చేశారు. శైలజానాథ్, పితాని సత్యనారాయణ, పార్థసారథి, కాసుకృష్ణారెడ్డి ముందు వచ్చినా కొంత ఆలస్యంగా గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మహీధర్‌రెడ్డి, టీజీ వెంకటేశ్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడికి చేరుకున్నారు. తరువాత సీఎం మీడియాతో మాట్లాడారు. ‘‘విభజనతో తెలుగుజాతికి తీవ్ర నష్టం కలిగించారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దీనికి కారణం. ఎంపీలు, మంత్రులు అందరూ వ్యతిరేకించినా నిబంధనల్ని ఉల్లంఘించి అడ ్డగోలుగా రాష్ట్రాన్ని చీల్చారు. తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టారు. పార్లమెంటులో జరిగిన ఘటనలు ముఖ్యంగా సీమాంధ్ర ఎంపీలను కొట్టించడం చూస్తే సిగ్గుతో తలదించుకోవాలి’’ అని సీఎం ధ్వజమెత్తారు. పార్లమెంటు నుంచి టీవీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి దొంగల మాదిరిగా బిల్లును ఆమోదించుకోవడంపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఆమోదించడం ఫెడరల్ వ్యవస్థకు ఏమేరకు మంచిదో తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం, బీజేపీ చీకటి ఒప్పందంతో తెలుగుజాతి హృదయాలను తీవ్రంగా గాయపరిచాయని దుమ్మెత్తిపోశారు. విభజనకు నిరసనగా రాజీనామా చేస్తున్నానే తప్ప తెలంగాణను అడ్డుకొనేందుకు కాదని చెప్పారు. ఎక్కడైనా తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచి ఉంటే క్షమాపణలు చెబుతున్నానన్నారు. ‘‘కొందరు ఎంపీలు, మంత్రులు వెల్‌లోకి వెళ్తేనే మనసు గాయపడిందని ప్రధాని అన్నారు. మరి తెలుగుజాతిని నిలువునా చీలుస్తుంటే ఆ ప్రజల కన్నీటి ఘోష మీకు కనిపించడం లేదా?’’ అని మన్మోహన్‌ను ప్రశ్నించారు. 50 ఏళ్ల పోరాటంతో తెలుగురాష్ట్రం ఏర్పడిందని, 58 ఏళ్లు కలసి ఉన్నాక ఇప్పుడు విభజించడం సమంజసమేనా? అని నిలదీశారు. తనకు అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సీఎం పదవి ఇచ్చిన సోనియాగాంధీకి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. చివరకు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీపై ఒక్క విమర్శ కూడా చేయకుండానే భేటీని ముగించారు. కొత్త పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై స్పష్టత ఇవ్వకుండా సమాధానాలు దాటవేశారు. మీడియా ప్రశ్నలు గుప్పిస్తున్నా ఒకటిరెండు ప్రశ్నలకు మాత్రమే క్లుప్తంగా స్పందించారు.
     
     తెలంగాణ ప్యాకేజీపై సోనియూకు నివేదిక ఇచ్చా
     రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణకు ప్యాకేజీని ప్రకటిద్దామని సోనియా మూడేళ్ల క్రితమే భావించినా సీఎం పదవి కాపాడుకోవడానికే మీరు వద్దన్నారట కదా? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘నేను 2010 నవంబర్ 25న సీఎంగా బాధ్యతలు చేపట్టా. శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 30న నివేదిక ఇచ్చింది. ఆ తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మూడురోజుల ముందు సోనియా నాతో చర్చించారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుందామా? అని అడిగిన మాట నిజం. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల బడ్జెట్ సమావేశాలున్నందున మార్చి 28 వరకు ఆగాలని చెప్పాను. ఈలోగా తెలంగాణ ప్యాకేజీలో ఏమేమి ఉండాలో నివేదిక కోరితే దాన్నీ ఇచ్చాను. ఆ తరువాత 50 సార్లు కలిసినా సోనియా నిర్ణయం తీసుకోలేదు. సమైక్యంగా ఉంచుతానని మాత్రం ఆమె నాతో చెప్పలేదు’’ అని కిరణ్‌కుమార్‌రెడ్డి వివరించారు. రాజీనామాతో విభజన ఆగిపోతుందా? అని ప్రశ్నిస్తే రాజీనామా నష్ట నివారణకు కాదని, కేవలం నిరసనగా మాత్రమేనని చెప్పారు.
     
     కిరణ్‌కు మరో మార్గం లేదు...
     ‘‘ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పా టు చేయాలనే నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానిని కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఇక (రాజీనామా చేయటం మినహా) ఆయనకు ఉన్న మార్గం ఏముంది?’’ 
     - సుశీల్‌కుమార్‌షిండే, కేంద్ర హోంమంత్రి 
     
     రాజీనామా దురదృష్టకరం
     రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి నడిపించారు. ఆయన రాజీనామా చేయాల్సి రావటం దురదృష్టకరం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన వైదొలగటం చాలా విచారకరం.
     - పల్లంరాజు, కేంద్రమంత్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement