బిల్లుపై తేలాకే రాజీనామా | Resigns will be after Telangana Bill | Sakshi
Sakshi News home page

బిల్లుపై తేలాకే రాజీనామా

Published Mon, Feb 17 2014 12:59 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

బిల్లుపై తేలాకే రాజీనామా - Sakshi

బిల్లుపై తేలాకే రాజీనామా

  • సీమాంధ్ర నేతలతో సమాలోచనలు
  •  రాజీనామా, కొత్త పార్టీపై మల్లగుల్లాలు
  •  నేతల భిన్నాభిప్రాయాలు.. నేడు మళ్లీ భేటీ
  •  పార్టీ పెట్టడం ఖాయమంటున్న మంత్రులు
  •  
    సాక్షి, హైదరాబాద్: రాజీనామాపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాజీనామా ఎప్పుడు చేయాలి, చేశాక ఏం చేయాలి, కొత్త పార్టీ పెట్టాలా తదితర అంశాలపై ఆదివారం సాయంత్రం సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన మల్లగుల్లాలు పడ్డారు. ఈ సమావేశంలోనే కిరణ్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించవచ్చని కూడా ఒక దశలో ప్రచారం జరిగింది. అయితే... రాజీనామాతో పాటు, కొత్త పార్టీ పెడితే ఎంతమంది తన వెంట నిలుస్తారన్న అంశంపై అంచనా కోసం ఆయన నిర్వహించిన ఈ భేటీలో నేతల నుంచి ఏకాభిప్రాయం రాలేదు. ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో రాజీనామాపై కిరణ్ ఊగిసలాటలో పడ్డారు. రాజీనామా ఎప్పుడన్నది సోమవారం సాయంత్రానికి ఓ కొలిక్కి రావచ్చని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజీనామా ఎప్పుడైనా ఉండొచ్చని, కొత్త పార్టీ ఏర్పాటు ఖాయమని భేటీ తర్వాత మీడియాతో మంత్రుల మాటతీరును బట్టి స్పష్టమైంది. గతంలో సీఎం నిర్వహించిన సమావేశాలకు సీమాంధ్ర నుంచి సీనియర్ మంత్రులు మినహా ఎమ్మెల్యేలంతా హాజరయ్యేవారు. కానీ ఆదివారం నాటి భేటీలో మాత్రం ఏడుగురు మంత్రులతో పాటు 28 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు మాత్రమే పాల్గొన్నారు. మంత్రులు పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, కాసు కృష్ణారెడ్డి, పార్థసారథి, వట్టి వసంతకుమార్, చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు, సీనియర్ ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో కేవలం ఇద్దరే వచ్చారు! హాజరైన వారిలో ఎక్కువ మంది ఇతర పార్టీల్లో చేరేందుకు నిర్ణయించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలే ఉన్నారు. ముందుగా మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కిరణ్ తెలుసుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఆయన్ను గ్రూపులుగా కలిశారు.
     
     తన వైఖరి చెప్పకుండా...
     
     సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పల్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు ఆదివారం ఉదయం కిరణ్‌ను కలసి చర్చించారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశ పెట్టలేదని బీజేపీతో సహా పలు విపక్షాలు వాదిస్తున్న ఈ సమయంలో రాజీనామా చేస్తే, బిల్లు పెట్టినట్టు మనమే అంగీకరించినట్టవుతుందన్నారు. ప్రస్తుతానికి రాజీనామా చేయకుండా ఉంటేనే బిల్లు పెట్టలేదన్న బీజేపీ వాదనకు బలం చేకూర్చినట్టవుతందన్నారు. ఇదే విషయాన్ని సాయంత్రం ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులకు వివరిస్తూ రాజీనామాపై వారి అభిప్రాయాలడిగారు. ‘మళ్లీ బిల్లు ప్రవేశపెట్టాలంటే పార్లమెంటులో ప్రక్రియ మొదటికి వచ్చినట్టే. బిల్లు పెట్టేందుకు, చర్చకు, ఆమోదానికి సమయం చాలదు. కనుక రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది’ అంటూ వారితో కిరణ్ అభిప్రాయపడ్డారు. తన మనసులో ఏముందో ఎక్కడా చెప్పకుండా ఎమ్మెల్యేల అభిప్రాయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇంకా రాజీనామా చేయకపోవడం వల్ల ప్రజల్లో ఇప్పటికే అనుమానాలు రేకెత్తుతున్నాయని కొందరు ఎమ్మెల్యేలన్నారు. మరికొందరేమో ఇప్పుడు రాజీనామా చేసినా ఫలితముండదని స్పష్టం చేశారు. అధిష్టానంతో కుమ్మక్కై రాజీనామాపై డ్రామాలు నడిపిస్తున్నారంటూ ప్రజల్లో బాగా ప్రచారం జరుగుతోందని ఆయన దృష్టికి తెచ్చారు. రాజీనామా చేయడం, పార్టీ పెట్టడం కన్నా పార్లమెంటులో ఏం జరుగుతుందో 21వ తేదీ దాకా వేచి చూడటం మేలని జేసీ తదితరులన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీలుస్తున్న కాంగ్రెస్‌లో కొనసాగేందుకు నేతలెవరూ ఇష్టపడటం లేదు గనుక కొత్త పార్టీ పెట్టడమే మేలని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సమైక్యంగా ఉన్నా, లేకపోయినా అందుకోసం చివరిదాకా ప్రయత్నించామని చెప్పుకోవచ్చని, అందుకు రాజీనామా చేయడం కూడా ఒక సాధనంగా ఉంటుందని అన్నారు. ఢిల్లీలో ఏపీ ఎన్జీవోల ధర్నాలో పాల్గొనడంపైనా చర్చ సాగింది. రాజీనామా, పార్టీ ఏర్పాటు ప్రకటనలను అక్కడే చేస్తే ఎలా ఉంటుందన్న మంతనాలూ సాగాయి. ఢిల్లీ వెళ్లడం కన్నా ఇక్కడే రాజీనామా ప్రకటన చేసి గవర్నర్‌కు మూకుమ్మడిగా లేఖలివ్వడం మేలని కొందరన్నారు. మరికొందరు అసెంబ్లీ రద్దు వంటి ప్రతిపాదనలు తెచ్చారు. ఢిల్లీలో కేజ్రీవాల్ చేసిన మాదిరిగానే అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేస్తే ఆయనకు వచ్చినంత క్రేజ్ వస్తుందని సూచించారు. కానీ అసెంబ్లీ పదవీకాలం ముగుస్తున్న తరుణంలో రద్దు అంటే అర్థముండదని, పైగా కేబినెట్‌లో చర్చించకుండా అలా సిఫార్సు చేసేందుకు వీల్లేదని కిరణ్ అన్నారు. కొత్త పార్టీ పెట్టే విషయమై రాష్ట్రంలో ఒకట్రెండు చోట్లు పర్యటించి జనం నాడి పసిగడితే మేలని కొందరన్నారు.
     
     నేడు మరోసారి సమావేశం
     విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినట్టా, లేదా అన్నదానిపై సోమవారం స్పష్టత రావచ్చని కిరణ్ అంచనాకు వచ్చారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి బిల్లుపై సభలో చర్చ మొదలయ్యే సమయానికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటుపై ఇదమిత్థంగా ఏకాభిప్రాయం రాకపోవడంతో సోమవారం మరోసారి సీనియర్లతో, సన్నిహిత మంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించారు. కిరణ్ 18, లేదా 19 తేదీల్లో రాజీనామా చేయవచ్చని ఆయన్ను కలిసొచ్చిన కొందరు ఎమ్మెల్యేలు మీడియాకు వివరించారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నందున ఆ పార్టీ తరఫున పోటీచేసే పరిస్థితి లేదని, కొత్త వేదిక అవసరమని వివరించారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనే ఎక్కువమంది సూచించారన్నారు.
     
     బీజేపీతోనూ మంతనాలు
     విభజన తర్వాత  కొత్త పార్టీ పెట్టడం వల్ల ఏం లాభముంటుందని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కిరణ్ వద్ద సందేహం వెలిబుచ్చారు. అయితే బిల్లు పెట్టినట్టు తాము పరిగణించడం లేదంటూ బీజేపీ అడ్డం తిరిగిందని కిరణ్ వారికి గుర్తు చేశారు. బీజేపీతో కొందరు ఎంపీలు మంతనాలు సాగిస్తున్నారన్నారు. ‘బీజేపీ సహకారం కూడా ఉంటుందని భావిస్తున్నాం. విభజన జరిగినా, దాన్ని ఆపేందుకు మనమే ప్రయత్నించామని చెప్పేందుకు ఆస్కారముంది’ అన్నారు. బీజేపీ, టీడీపీలతో కొత్త పార్టీ కలసికట్టుగా పోటీ చేయవచ్చని కూడా కిరణ్ సూచనప్రాయంగా వినిపించారని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement