ఇక 72 గంటలే
-
నేటి నుంచి 3 రోజులే కీలకం
-
ఏ నిమిషానికి ఏమి జరుగునో..
-
కిరణ్ నోటీసుపై ఉభయసభల్లోనూ దుమారం
-
నోటీసు లోగుట్టేమిటి? ప్రతిష్టంభన వ్యూహాత్మకమా?
-
లేక బిల్లును సాఫీగా తిప్పి పంపే వ్యూహమా?
-
కాంగ్రెస్, టీడీపీ నేతల్లోనూ అనుమానాలు
-
స్పీకర్ నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ
-
చరిత్రలోనే తొలిసారిగా వెల్‌లోకి మంత్రులు
-
పది నిమిషాలైనా సాగకుండానే అసెంబ్లీ వాయిదా
-
నోటీసును తిరస్కరించాలంటూ మండలి
-
చైర్మన్‌కు టీ మంత్రులు, ఎమ్మెల్సీల వినతిపత్రం
-
కిరణ్‌పై హక్కుల నోటీసిచ్చిన ఎమ్మెల్సీ దిలీప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుకు సంబంధించి అసెంబ్లీ వేదికగా రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతూ ఉత్కంఠను పెంచుతున్నాయి. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి పొడిగించిన గడువు కూడా మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో విభజన బిల్లు పరిస్థితి ఏమవుతుంది? బిల్లును తిప్పి పంపుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ 77వ నిబంధన కింద ముఖ్యమంత్రి కిరణ్ ఇచ్చిన నోటీసు తీవ్ర దుమారం రేపుతున్న దృష్ట్యా దానిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? అదే నిబంధన కింద అంతకుముందే వైఎస్సార్‌సీపీ తదితరులిచ్చిన నోటీసులపై ఆయన వైఖరి ఎలా ఉండనుంది? పార్టీలకు అతీతంగా రాజకీయ వర్గాల్లో అంతటా ఇలాంటి పలు సందేహాలపైనే ఎడతెగని చర్చ జరుగుతోంది. మరోవైపు కిరణ్ నోటీసును తూర్పారబడుతూ అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణకు చెందిన మంత్రులు సోమవారం వెల్‌లోకి దూసుకెళ్లి మరీ సభా కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకున్నారు. మిగతా మూడు రోజులూ ఇదే పునరావృతమైతే పరిస్థితేమిటి? అసలు బిల్లుపై చర్చ ముగింపు దిశగా సాగుతూ, దాన్ని కేంద్రానికి పంపే గడువు సమీపిస్తున్న తరుణంలో ఉన్నట్టుండి తెరపైకొచ్చిన ‘నోటీసు’ల నాటకాలు, తత్ఫలితంగా నెలకొన్న ఈ ప్రతిష్టంభన యాదృచ్ఛికమేనా, లేక వ్యూహాత్మకమా? బిల్లును సాఫీగా కేంద్రానికి తిప్పి పంపించే ఎత్తుగడలో భాగమా? రాష్ట్ర ప్రజలందరి దృష్టీ ఇప్పుడు ఈ అంశాలపైనే కేంద్రీకృతమై ఉంది. మొత్తానికి రానున్న 72 గంటలు కీలకంగా మారనున్నాయి. ఈ మూడు రోజుల్లో అసెంబ్లీ వేదికగా రాజకీయం ఎలా రంగులు మారుతుందో...! క్షణానికో మలుపు తిరుగుతున్న పరిణామాలు చివరికెలా పరిణమిస్తాయో...!!
విభజన బిల్లును తిప్పి పంపించాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన నోటీసు సోమవారం ఉభయసభల్లో ప్రకంపనలు సృష్టించింది. నోటీసును స్పీకర్ తిరస్కరించాలంటూ తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు.. పరిగణలో తీసుకోవాలంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్లతో రెండు సభలూ దద్దరిల్లాయి. తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా పోటాపోటీ నినాదాలకు అసెంబ్లీ వేదికైంది. అంతేగాక చట్టసభల్లో ఏనాడూ లేనివిధంగా మంత్రులే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేసిన దృశ్యం సభలో ఆవిష్కృతమైంది. తెలంగాణ మంత్రులు సీఎం కిరణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. స్పీకర్ పోడియాన్ని చుట్టముట్టజూశారు. కిరణ్‌కు అనుకూలంగా సీమాంధ్రకు చెందిన ఒక మంత్రి వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు! మండలిలో కూడా రగడే కొనసాగింది. బిల్లును తిప్పిపంపాలంటూ మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసును తిరస్కరించాలంటూ చైర్మన్ చక్రపాణికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్సీలు విడిగా వినతి పత్రాలిచ్చారు. అంతేగాక కిరణ్, రామచంద్రయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిలపై ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ చైర్మన్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసిచ్చారు!
పదేపదే వాయిదా
సోమవారం ఉదయం తొమ్మిదింటికి సభ ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీ, తెలంగాణ కాంగ్రెస్, టీ టీడీపీ సభ్యులు పోడియం దగ్గరకు వచ్చి పోటాపోటీగా సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తదితరులు పోడియంలోకి దూసుకెళ్లారు. సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పోస్టర్లు పట్టుకుని వెల్‌లో నిలబడి నినాదాలు చేశారు. దాంతో సభను స్పీకర్ అరగంట పాటు వాయిదా వేశారు. 11.15 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే తెలంగాణ మంత్రులు గీతారె డ్డి, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ప్రసాద్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి వెల్‌లోకి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం పోడియాన్ని చుట్టుముట్టారు. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, తెలంగాణ టీడీపీ సభ్యులు కూడా పార్టీలకు అతీతంగా వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఇది మర్యాద కాదని, మంత్రులు వెళ్లి కూర్చోవాలని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, జానారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తమ స్థానాల్లోంచి లేచి నిరసన వ్యక్తం చేశారు. దాంతో సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మధ్యాహ్నం 1.25కు సభ ప్రారంభమవగానే పది మంది తెలంగాణ మంత్రులతోపాటు, సీమాంధ్ర మంత్రి పార్థసారథి కూడా వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆయనతో పాటు కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. మరికొందరు తమ స్థానాల్లోనే పోస్టర్లు పట్టుకుని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సీమాంధ్ర టీడీపీ సభ్యులు కూడా ప్లకార్డులు పట్టుకుని వెల్‌లో నినాదాలు చేశారు. పదేపదే విజ్ఞప్తి చేసినా లాభం లేకపోవడంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు.