‘అసెంబ్లీ’ని అడ్డుకోవడం అసాధ్యం | Impossible to stop assembly resolution on state bifurcation | Sakshi
Sakshi News home page

‘అసెంబ్లీ’ని అడ్డుకోవడం అసాధ్యం

Published Thu, Nov 21 2013 2:15 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

‘అసెంబ్లీ’ని అడ్డుకోవడం అసాధ్యం - Sakshi

‘అసెంబ్లీ’ని అడ్డుకోవడం అసాధ్యం

  • ప్రొరోగ్ చేసినా సమావేశాలకు అడ్డంకేమీ కాదు
  •   రాష్ట్రపతి ఆదేశిస్తే వెంటనే సమావేశపరచాల్సిందే
  •   ఆ మేరకు నేరుగా గవర్నరే నోటిఫికేషన్ ఇవ్వొచ్చు
  •   స్పీకర్‌గా పని చేసిన కిరణ్‌కు ఇవన్నీ తెలుసు
  •   అయినా నాదెండ్లే లక్ష్యంగా ఉద్దేశపూర్వక లీకులు?
  •   {పొరోగ్ చేయడం లేదంటూ ముమ్మర ప్రచారం
  •   ‘సమైక్య’ ముసుగును కాపాడుకోవడమే లక్ష్యం
  •   మంగళవారమే ఫైల్‌ను ప్రభుత్వానికి పంపిన నాదెండ్ల
  •   అవిశ్వాసం’ వార్తలపై నాదెండ్ల వర్గం కన్నెర్ర
  •   స్పీకర్ ప్రతిష్టనే దిగజార్చే కుట్రంటూ ధ్వజం
  •   తీవ్రంగా తప్పుబడుతున్న మంత్రులు, నేతలు
  •   అవిశ్వాసం పెడితే స్పీకర్‌కు అండగా ఉంటాం: అనిల్
  • సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నిర్వహణను జాప్యం చేయడం ద్వారా తెలంగాణ బిల్లుపై కేంద్రం అభిప్రాయం కోరడాన్ని ఆలస్యం చేయడం సాధ్యమేనా? అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తే తిరిగి సమావేశపరచడానికి చాలా సమయం పడుతుందా? తెలంగాణ బిల్లుపై అభిప్రాయం కావాలని దేశ అత్యున్నత హోదాలో రాష్ట్రపతే కోరినా అసెంబ్లీని సమావేశపరచకుండా సాగదీయడానికి వీలవుతుందా? అంటే ఇవేవీ సాధ్యం కానే కావంటున్నారు నిపుణులు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ స్పీకర్ కార్యాలయానికి సీఎం కార్యాలయం పంపిన లేఖను ఉత్తుత్తి డ్రామాగా అభివర్ణిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలను జాప్యం చేయించడం ద్వారా తెలంగాణ బిల్లుపై సభ అభిప్రాయాన్ని వాయిదా వేయించి, తద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామన్న రీతిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజాగా చేసిన లీకులు ప్రస్తుతం రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయంగా మారాయి. స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను లక్ష్యంగా చేసుకునే ఈ లీకులు బయటకు వచ్చాయన్నది స్పష్టంగా అర్థమవుతూనే ఉందని కాంగ్రెస్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి! 
     
    అసెంబ్లీని నిరవధిక వాయిదా (ప్రొరోగ్) చేయకపోవడం ద్వారా విభజన బిల్లుకు నాదెండ్ల సహకరిస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగించడమే దీని వెనక కిరణ్ ఉద్దేశంగా కనబడుతోంది. విభజన వ్యవహారంలో అసెంబ్లీని వివాదంలోకి లాగిన కిరణ్, తాజాగా స్పీకర్ స్థానాన్ని కూడా వదలకపోవడంపై కాంగ్రెస్‌లోనే పెద్దపెట్టున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర విభజనపై అధిష్టానానికి సహకరిస్తూనే బయటకు సమైక్యవాదిగా ముద్రపడే వ్యూహంలో భాగంగానే ఈ కొత్త ప్రచారానికి కిరణ్ తెర తీసినట్టుచెబుతున్నారు. తనకు దురుద్దేశాలను ఆపాదించేలా ఉద్దేశపూర్వకంగానే కిరణ్ శిబిరం ఇలా లీకులిస్తోందని నాదెండ్ల భావిస్తున్నారని సమాచారం. దాన్ని తిప్పికొట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సంబంధిత ఫైలును స్పీకర్ ఆగమేఘాలపై ప్రభుత్వానికి పంపేశారు. సభను ప్రొరోగ్ చేయాలంటూ మంగళవారమే ఫైలును ప్రభుత్వానికి పంపినట్టు అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి.
     
    విస్తుపోతున్న కాంగీయులు: వాస్తవానికి అసెంబ్లీ ప్రొరోగ్ అయినా, కాకపోయినా సభను సమావేశపరచడానికి ఎలాంటి ఆటంకమూ ఉండదని అధికారులు చెబుతున్నారు. అందులోనూ స్వయానా రాష్ట్రపతి నుంచే ఆదేశాలు వస్తే, రాష్ట్ర కేబినెట్‌కు సిఫారసు ఉన్నా, లేకున్నా గవర్నరే నేరుగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేయవచ్చని పేర్కొంటున్నారు. అంతేకాదు.. అసెంబ్లీ సమావే శమై బిల్లుపై తన అభిప్రాయం చెప్పినా, చెప్పకపోయినా రాష్ట్రపతి నిర్ణీత గడువు వరకు ఎదురు చూసి, శాసనసభ అభిప్రాయం చెప్పినట్టుగానే భావిస్తూ విభజన బిల్లును కేంద్రానికి పంపవచ్చు. ఆయనకు ఆ అధికారం కూడా ఉంది. అనంతరం అసెంబ్లీ అభిప్రాయంతో సంబంధం లేకుండానే కేంద్రం పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకోవచ్చు. స్పీకర్‌గా పని చేసిన కిరణ్‌కు ఈ విషయాలన్నీ తెలిసి కూడా ప్రొరోగ్ వివాదాన్ని రేపిన తీరుపై కాంగ్రెస్ నేతలే విస్తుపోతున్నారు.
     
     ప్రభుత్వం సిఫార్సు చేస్తేనే ప్రొరోగ్: ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జూన్ పదో తేదీతో ముగిశాయి. సమావేశాలు ముగిసిన వారం, పది రోజుల్లో ప్రభుత్వ సూచన మేరకు స్పీకర్ ప్రొరోగ్ ఉత్తర్వులు ఇస్తారు. ఆ మేరకు ప్రభుత్వం గవర్నర్‌కు నివేదిస్తుంది. ప్రభుత్వ సిఫార్సు మేరకు అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడుతున్నట్టుగా గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇవీ నిబంధనలు. అసెంబ్లీ ప్రొరోగ్ అయినట్టు గవర్నర్ ప్రకటించాక సభను తిరిగి సమావేశపరచాలంటే మామూలుగా అయితే కేబినెట్ సూచన మేరకు మళ్లీ గవర్నరే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రొరోగ్ కాకుండా ఉంటే ప్రభుత్వ సిఫార్సు మేరకు ఏ సమయంలోనైనా అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ నేరుగా ప్రారంభించవచ్చు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం అసెంబ్లీని ప్రొరోగ్ చేయలేదంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అసెంబ్లీ ప్రొరోగ్ కావాలంటే ప్రభుత్వ సిఫార్సు తప్పనిసరి. స్పీకర్ తనంతట తాను నేరుగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయినా కిరణ్ మాత్రం ‘స్పీకర్ ప్రొరోగ్ చేయడం లే’దంటూ నింద తనపైనే పడేలా లీకులివ్వడంపై నాదెండ్ల తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వెలిబుచ్చినట్టు తెలుస్తోంది.
     
     ఇన్ని నెలలూ ఏం చేశారు: ప్రొరోగ్ చేయాలంటూ స్పీకర్ కార్యాలయానికి ప్రభుత్వం నుంచి 15 రోజుల క్రితం మాత్రమే లేఖ వచ్చిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. అది వచ్చిన రెండో రోజు నుంచీ రచ్చబండ తదితర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్పీకర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారని, సోమవారమే హైదరాబాద్‌కు వచ్చారని పేర్కొంటున్నాయి. ఈ లోగానే, అసెంబ్లీని ప్రొరోగ్ చేయకుండా స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కిరణ్ లీకులిచ్చారని నాదెండ్ల వర్గీయులు మండిపడుతున్నారు. ‘‘చూస్తుంటే నాదెండ్లపై కిరణ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. ప్రొరోగ్‌కు నిర్ణయం తీసుకోవాల్సింది నిజానికి ప్రభుత్వమే. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడి ఐదు నెలలు కావస్తున్నాయి. మరింతకాలం సీఎం ఎందుకు నోరు మెదపలేదు?’’ అని ప్రశ్నిస్తున్నారు.
     
     ముదురుపాకానికి విభేదాలు
     తాజా వివాదంతో స్పీకర్ మనోహర్, సీఎం కిరణ్‌ల మధ్య విభేదాలు మరింత ముదిరి పాకాన పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. కిరణ్ స్పీకర్‌గా, మనోహర్ డిప్యూటీ స్పీకర్‌గా ఉండగా కూడా ఇద్దరి మధ్యా ఉప్పు నిప్పుగానే ఉండేదని నేతలు గుర్తు చేస్తున్నారు. మనోహర్ స్పీకర్ అయ్యాక సీఎం కిరణ్‌తో ఆయనకు దూరం మరింత పెరిగింది. అసెంబ్లీకి సంబంధించిన పలు అంశాల్లో అవి బయటపడుతూనే వస్తున్నాయి. ఇక అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం అంశం వాటిని మరింతగా పెంచింది. బిల్లును సభలో అడ్డుకోవడం ద్వారా విభజనను నిలువరిస్తామని కిరణ్ పలుమార్లు చెబుతూ సమైక్యవాదాన్ని వినిపించే ప్రయత్నం చేయగా స్పీకర్ దాన్ని పరోక్షంగా ఖండించారు. ‘విభజన బిల్లుపై అసెంబ్లీ పాత్రేమీ ఉండబోదు. బిల్లుపై అభిప్రాయాలు సేకరించి పంపడమే తప్ప ఓటింగ్ వంటి ప్రక్రియలకు తావే లేదు’ అని స్పష్టం చేశారు. దాంతో నాదెండ్ల-కిరణ్ విభేదాలు తారస్థాయికి చేరాయి. సభా నాయకుడినైన తనతో సంబంధం లేకుండానే బిల్లుపై చర్చ అంశాన్ని స్పీకర్ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి నెలకొందని గ్రహించిన కిరణ్, ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రొరోగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి వివాదం రేపారని మనోహర్ సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇది స్పీకర్‌ను బెదిరించి లొంగదీసుకోవాలన్న దుర్బుద్ధితో చేసినదేనంటూ మండిపడుతున్నారు. ‘‘స్పీకర్ పంపిన ప్రొరోగ్ ఫైలును ప్రభుత్వం గవర్నర్‌కు పంపుతుంది. కానీ ఆయన ప్రొరోగ్ చేయకుండా ఆలస్యం చేస్తే ఏం చేయగలుగుతుంది? స్పీకర్‌గా ఉన్నందున మనోహర్‌పై బురదజల్లాలని చూస్తున్నారు. కానీ గవర్నర్‌ను ఏమనగలరు?’’ అని మనోహర్ అనుయాయులు ప్రశ్నిస్తున్నారు. ‘అయినా ప్రొరోగ్ ఫైల్‌ను స్పీకర్ ఆమోదించి పంపలేదంటూ కిరణ్ లీకులివ్వడం ఒకరకంగా బెదిరించడమే. అయినా కిరణ్ ఎన్ని వందల ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం లేదు’’ అంటూ వారు మండిపడుతున్నారు.
     
     అవిశ్వాసం పెట్టినా ఆగదు 
     స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టేం దుకు కిరణ్ వర్గీయులు ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా మనోహర్‌వర్గం మండిపడుతోంది. ఇది పూర్తిగా స్పీకర్ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చే కుట్రేనని ఆరోపిస్తోంది. అసలు అవిశ్వాసానికి ప్రాతిపదిక ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ‘‘నిజంగా అవిశ్వాసం పెట్టినా మహా అయితే సభాధ్యక్ష స్థానంలో స్పీకర్ ఉండరంతే. సభను విధిగా సమావేశ పరచాల్సి ఆ బాధ్యతలను వస్తే డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క చేపడతారు. ఆయన కాకపోతే ప్యానెల్ స్పీకర్ల ద్వారానైనా సభను ముందుకు నడిపించే అవకాశముంటుంది’’ అని గుర్తు చేస్తున్నారు. ‘అంతిమంగా సభ అభిప్రాయం వచ్చినా రాకున్నా రాష్ట్రపతి ముసాయిదా విభజన బిల్లును ఆమోదించి కేంద్రానికి తిరిగి పంపించే ఆస్కారముంది. అలాంటప్పుడు అసెంబ్లీలో ఏదో చేస్తేస్తామని కిరణ్ చెప్పడం కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడమే’ అని విమర్శిస్తున్నారు.
     
     విభజనను సుగమం చేసే ఎత్తుగడ?
     అసెంబ్లీని ప్రొరోగ్ చేయలేదంటూ స్పీకర్‌ను తప్పుబట్టేలా కిరణ్ వర్గీయులు చేస్తున్న ప్రచారం వెనక నాదెండ్లను అప్రతిష్టపాలు చేయడంతో పాటు విభజన వ్యవహారాన్ని సాఫీగా ముందుకు తీసుకుపోయే ఎత్తుగడ కూడా దాగుందని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయా ప్రాంతాల నేతలు వినిపించే వాదనలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి అవకాశం ఎవరికీ దక్కకుండా గందరగోళ పరిస్థితులు సృష్టించి, తద్వారా అసలు బిల్లుపై అభిప్రాయ సమావేశమే జరగకుండా నేరుగా రాష్ట్రపతి పార్లమెంట్‌కు సిఫార్సు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. కిరణ్ రాజీనామా చేసినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
     
     గవర్నర్‌కు అధికారముంది
     ప్రొరోగ్ అయిన అసెంబ్లీని తిరిగి సమావేశపరచాలని గవర్నర్ తనంతట తానుగా కూడా స్పీకర్‌ను కోరవచ్చు. ఆయనకు ఎవరూ సిఫార్సు చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో గవర్నర్‌కు రాజ్యాంగం పలు అధికారాలను కల్పించింది. అసెంబ్లీని సమావేశపరిచే విషయంలో ఆయన తన విచక్షణాధికారాల ఆధారంగా ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు
     - ఎల్.రవిచందర్, సీనియర్ న్యాయవాది
     
     మంత్రివర్గం పాత్రేమీ ఉండదు
     అసెంబ్లీ ప్రొరోగ్ అయి ఉన్నప్పుడు తెలంగాణ బిల్లుపై చర్చ కోసం సభను సమావేశపరచాలని గవర్నర్‌ను కోరే విశిష్ట, ప్రత్యేక అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయి. ఆ మేరకు గవర్నర్ నేరుగా నోటిఫికేషన్ జారీ చేయొచ్చు. అందుకోసం మంత్రిమండలిలో చర్చించాల్సిన అవసరం లేదు. మంత్రిమండలికి ఏ పాత్రా ఉండదు. పైగా ఆ సమావేశాల్లో కేవలం ఎజెండాలోని విషయంపై చర్చకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. పైగా కావాలనుకుంటే అసెంబ్లీ తీర్మానం లేకుండానే బిల్లును పార్లమెంట్‌కు రాష్ట్రపతి పంపవచ్చు. ఈ విషయంలో అధికరణ 3 ఎంతో స్పష్టతనిచ్చింది.
     - పి.గంగయ్యనాయుడు, సీనియర్ న్యాయవాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement