సీఎం నోటీస్ తిర్కసరించాలని మాజీ స్పీకర్ లేఖ
హైదరాబాద్ : శాసనసభాపతి నాదెండ్ల మనోహర్కు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లేఖ రాశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసును అనుమతించరాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. విభజన బిల్లును తిప్పి పంపాలంటూ కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులు శాసనసభ నిబంధన 77 కింద స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు నోటీసులివ్వడం తెలిసిందే.
తిరస్కార నోటీసు విషయంలో రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ నిబంధనలు లోతుగా పరిశీలించి వ్యవహరించాలని దీనిపై సురేష్ రెడ్డి....స్పీకర్ నాదెండ్లకు లేఖ సూచించారు. గతంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో తాను అలాగే వ్యవహించానని ఆయన గుర్తు చేశారు. మరోవైపు బిల్లు సభలో చర్చకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి తనకందిన మొత్తం నోటీసులపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
77, 78 నిబంధనల కింద ఇప్పటిదాకా వచ్చిన అన్ని నోటీసులపై ఏం చేయాలన్న దానిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలని స్పీకర్ నాదెండ్ల భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి నేడు ఆయన శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
కాగా సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దాంతో సమైక్య తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. మరోవైపు సీఎం ఇచ్చిన నోటీసు తిరస్కరించాలని, ఓటింగ్ నిర్వహించరాదని తెలంగాణ ప్రాంత సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ దద్దరిల్లింది. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సమావేశాలను అరగంటపాటు వాయిదా వేశారు.