టీ నేతలంతా ఒకేతాటిపై..!
టీ నేతలంతా ఒకేతాటిపై..!
Published Mon, Jan 27 2014 2:26 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసుల తిరస్కరణకు డిమాండ్
ఉభయ సభల్లో ఐకమత్యంతో వ్యహరించాలని నిర్ణయం
మంత్రి పొన్నాల నివాసంలో ప్రజా ప్రతినిధుల భేటీ
సాక్షి, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పిపంపేందుకు సభలో తీర్మానం చేసేలా రూల్ 77 కింద స్పీకర్‌కు అందిన నోటీసులను తిరస్కరించాలని పార్టీలకతీతంగా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఉభయ సభల్లోనూ అందరూ ఐకమత్యంతో వ్యవహరించాలని, ఆ నోటీసుల తిరస్కరణకు గట్టిగా పట్టుబట్టాలని నిర్ణరుుంచారు. శాసనసభ నియమావళి 76, 77 కింద ఉభయ సభల్లో సభా నాయకులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఆదివారం మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సమావేశమయ్యూరు.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ప్రసాద్‌కుమార్, ఉత్తమకుమార్‌రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ అనిల్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, భూపాల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు (టీడీపీ), నాగం జనార్దన్‌రెడ్డి (బీజేపీ)లు హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే మంత్రి పొన్నాల ఫోనులో ఇతర తెలంగాణ ప్రాంత నేతలతోనూ చర్చించారు. సోమవారం ఉభయ సభల్లోనూ ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి చర్చలు జరుపుతూ ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నేతలు నిర్ణయించారు.
విభజన బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రి, మండలి సభా నాయకుడు ఇచ్చిన నోటీసులు తమకు ఆమోదయోగ్యం కాదనే విషయం స్పీకర్, మండలి చైర్మన్‌లను మరోసారి కలిసి తెలియజేయాలని మంత్రులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమావేశానంతరం అందుబాటులో ఉన్న మంత్రులందరూ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యూరు. ప్రభుత్వం తరఫున అందజేసిన తీర్మానం నోటీసులను తిరస్కరించాలని కోరారు.
నోటీసులు వ్యతిరేకిస్తున్నాం: మంత్రి పొన్నాల
ముఖ్యమంత్రి అందజేసిన నోటీసులను తాము వ్యతిరేకిస్తున్నట్టు పొన్నాల విలేకరులతో చెప్పారు. మంత్రివర్గ సభ్యులమైన తమను సంప్రదించకుండా ప్రభుత్వ పక్షాన నోటీసులివ్వడం అప్రజాస్వామిక, నిరంకుశ చర్యగా భావిస్తున్నామన్నారు. నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. సోమవారం సభలో తెలంగాణ కోరుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకే వ్యూహంతో ముందుకు సాగుతారని చెప్పారు. ముఖ్యమంత్రి చర్యలకు ప్రజలే న్యాయనిర్ణేతలని, ప్రజాకోర్టులో తగిన బుద్ధి చెబుతారని గండ్ర, పొంగులేటి వ్యాఖ్యానించారు.
Advertisement