లగడపాటి ‘పచ్చ’వాదన
- లీకుల వెనకున్న ప్యాకేజీ ఏంటి?
- విశ్వసనీయత కోల్పోయా రంటున్న ఆయన వర్గం నేతలు
సాక్షి, విజయవాడ : సర్వేలు చేస్తూ ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్న లగడపాటి తన విశ్వసనీయతను కోల్పోయారని ఆయన వర్గం నేతలే ఆరోపిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకూ ఎన్నడూ పోలింగ్ ముందు తన సర్వేలను వెల్లడించలేదు. పోలింగ్ అయిపోయిన తర్వాత తన సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వచ్చారు. అయితే దీనికి భిన్నంగా చంద్రబాబు ఏజెంటులా...ఆయన ప్రదర్శించిన అత్యుత్సాహం పలు విమర్శలకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ విడిపోదంటూ చెబుతూ వచ్చిన ఆయన రాజీనామా చేయడం కోసం ఆడిన డ్రామాలతో విజయవాడ ప్రజల్లో చులకనయ్యారు. ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నా...కిరణ్‌కుమార్‌రెడ్డితో జై సమైక్యాంద్ర పార్టీ పెట్టించడం వెనుక కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. సీమాంధ్రలో ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం ఉండగా ఆయన మీడియా ముందుకు వచ్చి తెలంగాణాలో టీఆర్‌ఎస్, ఆంధ్రాలో తెలుగుదేశం - బీజెపీ కూటమి గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు.
ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం ఉన్నా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే మోడీ, పవన్ కళ్యాణ్‌లతో ప్రచారం చేయించినా తన పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈ విధమైన మైండ్‌గేమ్‌కు తెరలేపినట్లుగా సమాచారం. అయితే కొంతకాలంగా ఆయన చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగిన ఆయన ఒకదశలో ఏలూరు తెలుగుదేశం సీటుకు పోటీపడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా వెళ్లినా... తెలుగుదేశంకు అనుకూల వైఖరినే అవలంభిస్తూ వస్తున్నారు. బీజెపీ - తెలుగుదేశం పార్టీ కూటమిని చూసి మైనారిటీలు, క్రైస్తవులు భయబ్రాంతులకు లోనౌతూ ఆ కూటమిని ఓడించాలని కంకణం కట్టుకుంటే ఈ కూటమి గెలుస్తుందని చెప్పడానికి రాజగోపాల్ ప్రాతిపదిక ఏంటని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారు.
290 సీట్లు సమైక్యవాదులే గెలుస్తారంటూ ఢంకా భజాయించి చెబుతూ వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఈ రోజున రాష్ట్ర విభజనకు సహకరించిన తెలుగుదేశం, బీజేపీ కూటమికి అనుకూలంగా ఎలా వ్యాఖ్యలు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాలో అతి తక్కువ సీట్లు గెలుచుకునే ఈ కూటమి ఏ ప్రాతిపదికతో ఇక్కడ గెలుస్తుందో చెప్పాలని వారు నిలదీస్తున్నారు.