Jai Samaikya andhra party
-
లగడపాటి ‘పచ్చ’వాదన
లీకుల వెనకున్న ప్యాకేజీ ఏంటి? విశ్వసనీయత కోల్పోయా రంటున్న ఆయన వర్గం నేతలు సాక్షి, విజయవాడ : సర్వేలు చేస్తూ ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్న లగడపాటి తన విశ్వసనీయతను కోల్పోయారని ఆయన వర్గం నేతలే ఆరోపిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకూ ఎన్నడూ పోలింగ్ ముందు తన సర్వేలను వెల్లడించలేదు. పోలింగ్ అయిపోయిన తర్వాత తన సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వచ్చారు. అయితే దీనికి భిన్నంగా చంద్రబాబు ఏజెంటులా...ఆయన ప్రదర్శించిన అత్యుత్సాహం పలు విమర్శలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ విడిపోదంటూ చెబుతూ వచ్చిన ఆయన రాజీనామా చేయడం కోసం ఆడిన డ్రామాలతో విజయవాడ ప్రజల్లో చులకనయ్యారు. ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నా...కిరణ్‌కుమార్‌రెడ్డితో జై సమైక్యాంద్ర పార్టీ పెట్టించడం వెనుక కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. సీమాంధ్రలో ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం ఉండగా ఆయన మీడియా ముందుకు వచ్చి తెలంగాణాలో టీఆర్ఎస్, ఆంధ్రాలో తెలుగుదేశం - బీజెపీ కూటమి గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు. ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం ఉన్నా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే మోడీ, పవన్ కళ్యాణ్‌లతో ప్రచారం చేయించినా తన పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈ విధమైన మైండ్‌గేమ్‌కు తెరలేపినట్లుగా సమాచారం. అయితే కొంతకాలంగా ఆయన చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగిన ఆయన ఒకదశలో ఏలూరు తెలుగుదేశం సీటుకు పోటీపడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా వెళ్లినా... తెలుగుదేశంకు అనుకూల వైఖరినే అవలంభిస్తూ వస్తున్నారు. బీజెపీ - తెలుగుదేశం పార్టీ కూటమిని చూసి మైనారిటీలు, క్రైస్తవులు భయబ్రాంతులకు లోనౌతూ ఆ కూటమిని ఓడించాలని కంకణం కట్టుకుంటే ఈ కూటమి గెలుస్తుందని చెప్పడానికి రాజగోపాల్ ప్రాతిపదిక ఏంటని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారు. 290 సీట్లు సమైక్యవాదులే గెలుస్తారంటూ ఢంకా భజాయించి చెబుతూ వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఈ రోజున రాష్ట్ర విభజనకు సహకరించిన తెలుగుదేశం, బీజేపీ కూటమికి అనుకూలంగా ఎలా వ్యాఖ్యలు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాలో అతి తక్కువ సీట్లు గెలుచుకునే ఈ కూటమి ఏ ప్రాతిపదికతో ఇక్కడ గెలుస్తుందో చెప్పాలని వారు నిలదీస్తున్నారు. -
19న కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 19న పీలేరులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు చేరుకుంటారు. అక్కడినుంచి కలికిరికి వచ్చి రాత్రికి అక్కడ బస చేస్తారు. శనివారం ఉదయం పీలేరు చేరుకుని ఆ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం రోడ్‌షోలో పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 20, 21 తేదీల్లో కూడా కిరణ్ రోడ్ షోల్లో పాల్గొంటారని తెలిపాయి. -
రాజంపేట లోక్‌సభకు కిరణ్ పోటీ!
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ తరఫున రాజంపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఒకటిరెండు రోజుల్లో పార్టీ ప్రెసిడెన్సియల్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లా పీలేరు శాసనసభా స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీలేరులో వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో కిరణ్ అక్కడినుంచి పోటీచేయడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. -
జేఎస్పీ తెలంగాణ అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) తెలంగాణలో మూడు లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరిరోజు కావడంతో ఆ పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రెసిడెన్షియల్ బ్యూరో మంగళవారం సమావేశమై పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు శ్రీహరిరావుతో కలసి అధికార ప్రతినిధి నూతన్‌నాయుడు జాబితా ప్రకటించారు. లోక్‌సభ స్థానాలకు.. కల్పగూర్ శ్రీనివాసులు (సికింద్రాబాద్), గూడూరు జనార్దన్‌రెడ్డి (భువనగిరి), చెరుకూరు నాగార్జునరావు (ఖమ్మం)ను నిర్ణయించారు. అసెంబ్లీ స్థానాల కు.. మహమ్మద్ వజాహత్ అలీ(నర్సాపూర్), కోదాటి సుహాసిని (పటాన్చెరు), పిట్ల శ్రీనిరాజు(మల్కాజిగిరి), గున్నం నరేంద్రరెడ్డి (ఎల్బీ నగర్), సయ్యద్ ఒమర్ (రాజేంద్రనగర్), కె. రాణి (ముషీరాబాద్), ఇ.రాజు (ఖైరతాబాద్), సుదర్శనం వెంకటేశ్వర్లు (జూబ్లీహిల్స్), చెర్లపల్లి నీతాగౌడ్ (సనత్‌నగర్), మహమ్మద్ అయూబ్‌ఖాన్ (చార్మినార్), నర్సింగోరు నర్సింహాచారి (ఆలేరు), కణితి కృష్ణ (పినపాక), ముక్తిరాజు (ఇల్లెందు), షేక్ పాషా (ఖమ్మం), అప్పల లింగమూర్తి (పాలేరు), మల్లు శివరాం (మధిర), వాసం రామకృష్ణదొర (వైరా), తమ్మల రాజేష్‌కుమార్ (సత్తుపల్లి), నార్ల సత్యనారాయణ (కొత్తగూడెం), పాయం పోతయ్య దొర (అశ్వారావుపేట), కురుసం సుబ్బారావు (భద్రాచలం)ను ప్రకటించారు. -
సీమాంధ్రలో జై తెలంగాణ అని అనగలవా?
చంద్రబాబుకు కిరణ్ సూటి ప్రశ్న సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలంగాణ సభల్లో జై తెలంగాణ అన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సీమాంధ్రలో కూడా జై తెలంగాణ అనే దమ్ము, ధైర్యం ఉందా అని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో సమైక్యాంధ్ర గురించి తాను ఐదున్నర గంటలు మాట్లాడితే చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. టీడీపీకి ఓటేస్తే రాష్ట్ర విభజనకు ఓటు వేసినట్లే అన్నారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లాలో పలు చోట్ల ఎన్నికల సభల్లో మాట్లాడుతూ విభజన కు అనుకూలంగా తొలి లేఖ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబే అన్నారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో కిరణ్‌ను టంగుటూరి ప్రకాశం పంతులు మనుమడు గోపాలకృష్ణ కలిశారు. -
ఇదీ బెట్టింగే...
గుసగుసలు: క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కాదు, బెట్టింగుల జోరు రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి? ముఖ్యమైన నేతల్లో ఎవరికెంత మెజారిటీ వస్తుంది..? వంటి అంశాలపై బెట్టింగులకు దిగుతుంటారు. తెలంగాణలో ఒకరకంగా, సీమాంధ్రలో మరోరకంగా పార్టీల జయాపజయాలపై బెట్టింగులు జోరందుకున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఆవరణలోనే ఇద్దరు నేతలు సై అంటే సై అంటూ పరస్పరం బెట్టింగుకు దిగారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ, ‘సమైక్య’ చాంపియన్‌గా ప్రచారం పొందేందుకు చివరి వరకు విఫలయ్నతం చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి, విభజన నిర్ణయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ పేరిట సొంత కుంపటి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వస్తాయా? జై సమైక్యాంధ్ర పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయా? అనే దానిపై ఇద్దరు నేతలూ మాటా మాటా పెంచుకుని లక్షల్లోనే బెట్టింగ్‌కు దిగారు. ఇదంతా గమనిస్తూ పక్కనే ఉన్న మరో ఇద్దరు నేతలు క్రికెట్ బెట్టింగుల కంటే ఇదేదో ఆసక్తికరంగా ఉందే! అంటూ వ్యాఖ్యానించారు. -
తాటాకు చప్పుళ్లకు భయపడం..: కిరణ్
ఇదేమన్నా నీ జాగీరా.. కేసీఆర్‌పై కిరణ్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాకే.. తెలంగాణ వారు తెలంగాణలోనేనా? ఉద్యోగులకు ఆప్షన్లుండవా? ఇదేమన్నా నీ జాగీరా.. తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవ్వరూ లేరిక్కడ. ఉద్యోగుల ఇష్టానికి భిన్నంగా ఎవ్వర్నీ పంపలేరు. అసలు పార్లమెంటులో పాసయ్యిందేమిటి.. మీరు మాట్లాడుతుందేమిటి? ఏమన్నా అర్థం ఉందా?’ అంటూ జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు తాము అండగా ఉంటామన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ, మీడియా కమిటీ చైర్మన్ ఎన్.తులసిరెడ్డిలతో కలసి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్రమంత్రి చిరంజీవిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘డిజైన్ మార్చకుంటే పోలవరాన్ని నిర్మించనీయమని కేసీఆర్ అంటున్నారు. ఆపేదానికి ఆయనెవరు? ఏ హక్కుతో, ఏ సామర్థ్యంతో ఆ మాటంటున్నారో చెప్పాలి..’ అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌తో జతకట్టబోం: కిరణ్
ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రతినిధులు విశాఖపట్నం, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలను విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో జత కట్టబోమని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో సోమవారం ముస్లింలు, న్యాయవాదులు, వైద్యులు, ఉత్తరాంధ్ర జర్నలిస్టులు, అర్చకుల జేఏసీ ప్రతినిధులతో తెలుగు జాతి ఆత్మగౌరవ సభ నిర్వహించారు. పలు జేఏసీల ప్రతినిధులు, విద్యార్థులు ఆయనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కాంగ్రెస్‌తో కలుస్తారా? అని ప్రశ్నించడంతో ఆ పార్టీతో కలిసేది లేదన్నారు. రాష్ట్ర విభజన జరిగిపోరుున తర్వాత సమైక్యాంధ్ర కోసం పోరాట ఫలితం ఉంటుందా..? అని అడిగితే విభజనకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులకు తీర్పులు అనుకూలంగా వస్తాయన్న ఆశాభావం ఉందన్నారు. -
ఐటీ నిపుణులకు రక్షణ కల్పిస్తాం: కిరణ్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో విధులు నిర్వర్తించే ఐటీ రంగ నిపుణులకు జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) పరంగా పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంత నాయకుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. శనివారం మాదాపూర్‌లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఐటీ రంగ నిపుణులు, ఉద్యోగులతో కిరణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల్లో పనిచేసే సీమాంధ్ర ప్రాంత ఐటీ ఉద్యోగులు రోజూ సహచర తెలంగాణ ఉద్యోగుల నుంచి ఎదుర్కొంటున్న వేధింపులను, వాటి వల్ల ఏర్పడే ఇబ్బందులను ఏకరువు పెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఐటీ సంస్థల్లో వచ్చిన మార్పులను, ఉపాధి అవకాశాలకు దూరమవుతోన్న తీరును సీమాంధ్ర ఐటీ ఉద్యోగ సంఘ జేఏసీ కన్వీనర్, కో-కన్వీనర్లు ఉమామహేశ్వరరావు, శ్రావణ్‌కుమార్‌లు కిరణ్‌కు వివరించారు. టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులు అన్ని కంపెనీల సీఈవోలకు ఫోన్లు చేసి తెలంగాణ ప్రాంతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని, ఈ పరిస్థితుల నుంచి సీమాంధ్ర ఐటీ ఉద్యోగులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడానికి అన్ని పార్టీలూ దోహదపడాలని కోరారు. వీరి ఇక్కట్లను పూర్తిగా విన్న మాజీ సీఎం.. తాను ప్రారంభించిన పార్టీ ద్వారా ఈ తరహా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టంచేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ అధికారంలోకి వస్తే సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామన్నారు. -
పిరికిపంద బాబుకు.. పాలన ఎందుకు?
* అసెంబ్లీలో చంద్రబాబు పెదవి విప్పే ధైర్యం చేయలేదు * జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభలో కిరణ్ ధ్వజం * తెలుగుతల్లిని బతికించేందుకే కొత్త పార్టీ * పెద్దమ్మ, చిన్నమ్మలు కలసి రాష్ట్రాన్ని విభజించారు.. జైరాం పిచ్చి మేధావి * కాంగ్రెస్‌కు కేసీఆర్ పంగనామాలు సాక్షి, రాజమండ్రి: ‘‘శాసనసభ 45 రోజుల పాటు జరిగినా విభజనపై పెదవి విప్పే ధైర్యం చేయలేని పిరికిపంద చంద్రబాబుకి అధికారం అప్పగిస్తారా?’’ అని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక మూల రాష్ట్రం ముక్కలైపోతోందని జనం మొత్తుకుంటుంటే.. చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్‌గా మారుస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని ధ్వజమెత్తారు. జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభ బుధవారం రాజమండ్రి జెమినీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగింది. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కిరణ్ మూడు రంగులతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. బాబు విభజనకు మద్దతుగా లేఖ ఇస్తే పెద్దమ్మ సోనియా గాంధీ, చిన్నమ్మ సుష్మాస్వరాజ్ రాష్ట్రాన్ని ముక్కలు చేశారని విమర్శించారు. పిచ్చి మేధావి జైరాం తాను కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచానన్నారని.. కానీ ఆయనే పిచ్చి మాట లతో రాష్ట్రాన్ని విభజించారని ఆక్షేపించారు. బిల్లు చెల్లదని సుప్రీం చెప్తుందనే ఆశ... చంద్రగిరిలో 1977లో అభ్యర్థులు ఎవరూ లేక చంద్రబాబుకు కాంగ్రెస్ టిక్కెట్టు ఇచ్చి మంత్రిని చేస్తే.. అదే కాంగ్రెస్‌ను మోసం చేసి మామ ఎన్టీఆర్ పంచన చేరారని.. ముఖ్యమంత్రి పదవి కోసం అదే మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. పార్టీలో ఉన్న కరడు కట్టిన కాంగ్రెస్‌వాదులను కాదని, కిరాయి నాయకులున్నారని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే కేసీఆర్ కాంగ్రెస్‌కు పంగనామాలు పెట్టారని విమర్శించారు. తలుపులు మూసి, మీడియా వైర్లు కట్‌చేసి పార్లమెంటులో జరిగే దుశ్చర్య బయట ప్రపంచం చూడకుండా విభజన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అసెంబ్లీ తిప్పి పంపిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. తెలుగుతల్లిని కాంగ్రెస్, బీజేపీలు కలిసి హత్య చేసి సంతోషిస్తున్నాయని, సుప్రీంకోర్టును ఆశ్రయించి బతికించేందుకే ఈ పార్టీని పెట్టామని కిరణ్ చెప్పారు. తమ పార్టీ తరఫున బుల్లెట్ల లాంటి యువకులకు టిక్కెట్లు ఇస్తామని, తెలంగాణలోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలబెడతామన్నారు. తొలి కార్యవర్గం భేటీ... సభకు ముందు జరిగిన పార్టీ తొలి కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పరీక్షలు, సాధారణ ఎన్నికలు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందన్న విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని, ఉత్తరాంధ్రలో కిరణ్ విసృ్తతంగా పర్యటించాలని తీర్మానించారు. ఎంపీలు హర్షకుమార్, సబ్బం హరి, లగడపాటి రాజ్‌గోపాల్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు శ్రీహరి, మాజీ ఎంపీ విశ్వనాథం, ఎమ్మెల్సీలు బలశాలి ఇందిర, రెడ్డప్పరెడ్డి, ఎమ్మెల్యేలు నీరజారెడ్డి, కొర్ల భారతి, రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, సినీనటుడు నరసింహరాజు, విద్యార్థి నాయకుడు కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు. డుమ్మా కొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్నమొన్నటి వరకు కిరణ్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన సభకు ముఖం చాటేశారు. భారీగా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తరలి వస్తారని పెట్టుకున్న ఆశలు కాస్తా అడియాసలే అయ్యాయి. చివరకు ఆవిర్భావ సభకు వేదికైన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు. పేలవంగా సభ, పెదవి విరిచిన జనం కిరణ్ సభకు వచ్చిన కొద్దోగొప్పో జనం కూడా చప్పగా, పేలవంగా సాగిన సభను చూసి నిస్పృహ చెందారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన జనం తీవ్ర అసహనానికి గురయ్యారు. మాజీ ముఖ్యమంత్రి దాదాపు 35 నిముషాల పాటు చేసిన ప్రసంగం జనాన్ని మెప్పించలేక పోయింది. ఉండవల్లి, హర్షకుమార్, పితానిలు తమ ప్రసంగాల్లో కిరణ్ నామజపం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా ఎలా ఉంచుతామన్న సందేశాన్ని సంపూర్ణంగా ఇవ్వలేకపోయారు. తమది ఉద్యమ పార్టీ అని చెప్పుకొన్న నేతలు జనంలో అణుమాత్రం ఉద్యమస్ఫూర్తిని కలిగించలేక పోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘మాటల్లో కత్తులు.. మనసులో భక్తిప్రపత్తులు’ అంటే ఇదేనేమో. కాంగ్రెస్‌పై ‘కన్నెర్ర’జేస్తూ కొత్త పార్టీకి పురుడు పోసిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ మాట అచ్చంగా సరిపోతుంది. రాష్ట్ర విభజనకు పెద్దమ్మ (సోనియా గాంధీ), చిన్నమ్మ (సుష్మా స్వరాజ్) కారణమని ‘జై సమైక్యాంధ్ర’ ఆవిర్భావ సభలో కిరణ్ నిప్పులు చెరిగారు. అయితే.. ఆయన అలా వీరావేశం ప్రదర్శిస్తూ మాట్లాడినంత సేపూ.. ఆ ప్రసంగాన్ని రాసుకు తెచ్చుకున్న కాగితాల అడుగున చిరునవ్వులు చిందిస్తున్న సోనియా బొమ్మ వేదిక దిగువనున్న వారికి దర్శనమివ్వడం విశేషం.