తాటాకు చప్పుళ్లకు భయపడం..: కిరణ్
ఇదేమన్నా నీ జాగీరా.. కేసీఆర్‌పై కిరణ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాకే.. తెలంగాణ వారు తెలంగాణలోనేనా? ఉద్యోగులకు ఆప్షన్లుండవా? ఇదేమన్నా నీ జాగీరా.. తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవ్వరూ లేరిక్కడ. ఉద్యోగుల ఇష్టానికి భిన్నంగా ఎవ్వర్నీ పంపలేరు. అసలు పార్లమెంటులో పాసయ్యిందేమిటి.. మీరు మాట్లాడుతుందేమిటి? ఏమన్నా అర్థం ఉందా?’ అంటూ జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు తాము అండగా ఉంటామన్నారు.
హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ, మీడియా కమిటీ చైర్మన్ ఎన్.తులసిరెడ్డిలతో కలసి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేంద్రమంత్రి చిరంజీవిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘డిజైన్ మార్చకుంటే పోలవరాన్ని నిర్మించనీయమని కేసీఆర్ అంటున్నారు. ఆపేదానికి ఆయనెవరు? ఏ హక్కుతో, ఏ సామర్థ్యంతో ఆ మాటంటున్నారో చెప్పాలి..’ అని ప్రశ్నించారు.