Nallari Kiran Kumar Reddy Likely To Join BJP! - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను వీడతానని ఏనాడూ అనుకోలేదు.. బీజేపీలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి

Published Fri, Apr 7 2023 9:04 AM | Last Updated on Fri, Apr 7 2023 5:11 PM

Nallari Kiran Kumar Reddy Join BJP Updates - Sakshi

ఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో శుక్రవారం కీలక నేతల సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో పాటు పలువురు జాతీయ నేతలు, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ తదితరులు.. కిరణ్‌కుమార్‌రెడ్డిని అధికారికంగా బీజేపీలోకి ఆహ్వానించారు. కొద్దిరోజుల క్రితమే ఆయన కాంగ్రెస్‌కు అధికారికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

కాంగ్రెస్‌ను వీడతానని ఏనాడూ అనుకోలేదు: కిరణ్‌కుమార్‌రెడ్డి
బీజేపీలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధిష్టానం తీరుపై అసంతృప్తి వెల్లగక్కారాయన.  1952 నుంచి మా కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంది.  కానీ, కాంగ్రెస్‌ను వీడతానని ఏనాడూ అనుకోలేదు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ తప్పుడు నిర్ణయం వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తోంది. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు పవర్‌ మాత్రమే కావాలి.

క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో.. హైకమాండ్‌ తెలుసుకోలేకపోతోంది. ఎవర్నీ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటుంది. చేసిన తప్పేంటన్నది కూడా కాంగ్రెస్‌ తెలుసుకోవడం లేదు. ఓటముల నుంచి కాంగ్రెస్‌ గుణపాఠం నేర్చుకోవడం లేదు. కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్స్‌ లేకుండా పోయారన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. అందుకే కాంగ్రెస్‌ను వీడినట్లు ప్రకటించారాయన. ఇక మోదీ, అమిత్‌ షా డైరెక్షన్‌ బాగుందని కితాబిచ్చారు. అందుకే బీజేపీలోకి చేరాను అని కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. 

బీజేపీలో చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేస్తా.  బిజెపి నాయకుల శ్రమతో పార్టీ ఎంతో ఎదిగింది. అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలతో పార్టీ పెరిగింది అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు కిరణ్‌ కుమార్‌రెడ్డి చేరికను స్వాగతించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి.. ఏపీలో ఇక బీజేపీ బ్యాటింగ్‌ జోరందుకుంటుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌పై వ్యాఖ్యలు సరికావు:గిడుగు రుద్రరాజు
బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్‌ నేత కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. నచ్చిన పార్టీలోకి నాయకులు వెళ్ళవచ్చు.. కానీ వెళ్లేప్పుడు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో అధికారాన్ని ఎంజాయ్ చేశారని.. ఇప్పుడు పార్టీపై బురదజల్లే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియాగాంధీలపై వ్యాఖ్యలు చెయ్యడం సరికాదన్నారు. ఏపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొననప్పుడే ఆయనను తమ పార్టీ నుంచి తొలగించామని తెలిపారు. సీబీఐ, ఈడీ కేసులకు బయపడి బీజేపీలో చేరారా ? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్‌కు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీలో చేరారని నిలదీశారు. ఎందుకు ఆ పార్టీకి ఆకర్షితులయ్యారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  మూడున్నర సంవత్సరాలు ముఖ్య మంత్రిగా పదవి అనుభవించి ఇప్పుడు ఏ ప్రయోజనాల ఆశించి ఆ పార్టీ లో చేరారో చెప్పాలన్నారు.

గతంలో ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. వైఎస్సార్‌ హయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గానూ ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు(2010 నుంచి 2014 వరకు).  విభజన బిల్లుకు వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసి.. ఆపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు కొనసాగారు. 

ఆ సమయంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని రద్దు చేస్తూ.. 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారాయన. చివరకు సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీకి బై బై చెబుతూ.. బీజేపీకిలోకి చేరిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement