ఇదేం స్థానికత? | Telangana employees dissatisfied with centers notification on AP local issue | Sakshi
Sakshi News home page

ఇదేం స్థానికత?

Published Sat, Jun 11 2016 4:19 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Telangana employees dissatisfied with centers notification on AP local issue

- కేంద్ర ఉత్తర్వులపై తెలంగాణ ఉద్యోగ సంఘాల మండిపాటు
- ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ఉద్యోగులకు అక్కడ.. వారి పిల్లలకు ఇక్కడ స్థానికతా?
- ఇది రాజ్యాంగ విరుద్ధం.. తెలంగాణ యువతకు నష్టం
- ఈ ఉత్తర్వులను కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందే
- ఏపీలో స్థానికత పొందితే తెలంగాణలో రద్దు చేయాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌:
ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయే ఉద్యోగులకు ఆ రాష్ట్రంలో స్థానికత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఈ ఉత్తర్వుల వల్ల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఉద్యోగులు అక్కడ స్థానికులు అవుతారని, మరోవైపు వారి పిల్లలు తెలంగాణలో చదివి ఉన్నందున రాష్ట్రపతి ఉత్తర్వుల (371డి) ప్రకారం ఇక్కడి స్థానికులు అవుతారని... ఇది సరికాదని స్పష్టం చేస్తున్నాయి. ఏపీకి వెళ్లే ఉద్యోగులకు అక్కడ స్థానికత కల్పిస్తే తెలంగాణలో వారికి, వారి కుటుంబ సభ్యులకు స్థానికతను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఒక ఉద్యోగికి రెండు రాష్ట్రాల్లో స్థానికత ఉండడం రాజ్యాంగ విరుద్ధమని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని పేర్కొంటున్నాయి.

రాష్ట్ర యువతకు నష్టం..
2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 2 వరకు ఏపీకి వెళ్లే ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌లో స్థానికత కల్పిస్తూ శుక్రవారం (ఈనెల 9వ తేదీతో) కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్రం ఉత్తర్వుల కారణంగా ఏపీకి వెళ్లే ఉద్యోగుల పిల్లలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోనూ స్థానికత కలిగి ఉంటారని, ఇది సమంజసం కాదని పేర్కొం టున్నాయి. దానివల్ల తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాల్లో నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా ఏపీలో స్థిరపడిన తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు వచ్చేస్తే.. ఏపీలో వారి స్థానికతను రద్దు చేయాలని, వారిని, వారి కుటుంబ సభ్యులను తెలంగాణ స్థానికులుగా గుర్తించాలని సూచిస్తున్నాయి. అంతే తప్ప ఒకే ఉద్యోగి, అతని కుటుంబానికి రెండు రాష్ట్రాల్లో స్థానికత ఉండటం రాజ్యాంగ సమ్మతం కాదని చెబుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి కేంద్రానికి లేఖ రాయాలని వివిధ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఏపీలోనూ వేల మంది తెలంగాణ ఉద్యోగులు
తెలంగాణకు చెందిన చాలా మంది ఓపెన్‌ కోటాలో ఏపీలో ఉద్యోగాలు పొంది, స్థిరపడ్డారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అందులో కోరుకున్న వారిని తెలంగాణకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. మరి వారికి తెలంగాణలో స్థానికత కల్పించేందుకు కేంద్రం ఇంతవరకు అంగీకరించలేదని పేర్కొంటున్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఏపీలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో, టీటీడీ వేద పాఠశాలలు, కోరుకొండ సైనిక్‌æస్కూల్‌ వంటి వాటిల్లో చదువుకున్నారని.. వారంతా  ఏపీ స్థానికత కలిగి ఉన్నారని గుర్తుచేస్తున్నారు. వారికి తెలంగాణ స్థానికత ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎవరికైనా ఏదో ఒక రాష్ట్రంలోనే స్థానికత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ విధానాన్ని ఒప్పుకోం
‘‘కేంద్రం తీసుకువచ్చిన ఈ స్థానికత విధానం సరైంది కాదు. తెలంగాణ ప్రజలే కాదు ఏపీ ప్రజలూ దీనిని ఒప్పుకోరు. స్థానికత అనేది ఎవరికైనా ఒక్కచోటే ఉంటుంది. ఈ విషయంలో కేంద్రం పునరాలోచించాలి.’’
– దేవీ ప్రసాద్, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు

కొత్త నిర్వచనమా?
‘‘స్థానికతకు కొత్త నిర్వచనం చెప్పినట్లుంది. దేశంలో ఎక్కడా ఈ విధానం లేదు. ఉండదు కూడా. రాజ్యాంగం, ఏ చట్టం దీనిని ఒప్పుకోదు..’’
– రవీందర్‌రెడ్డి,
టీఎన్జీవో అధ్యక్షుడు

2 రాష్ట్రాల్లో ఎలా ఇస్తారు?
‘‘ఒకే ఉద్యోగి, అతడి కుటుంబాన్ని రెండు రాష్ట్రాల్లో స్థానికులుగా ఎలా గుర్తిస్తారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి.’’
– మమత, సత్యనారాయణ,
టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

అక్కడ ఇస్తే ఇక్కడ రద్దు చేయాలి
‘‘తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లే ఉద్యోగులకు అక్కడ స్థానికత కల్పిస్తే తెలంగాణలో వారి స్థానికతను రద్దు చేయాలి. ఆ దిశగా కేంద్రం చర్యలు చేపట్టి, వివరణ ఉత్తర్వులు ఇవ్వాలి. లేకపోతే తెలంగాణ యువతీయువకులకు ఉద్యోగ అవకాశాల్లో తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.’’    
– మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం నేత
– పీఆర్‌టీయూ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement