‘సూపర్ న్యూమరరీ’కి ఓకే
* రెండు రాష్ట్రాల సీఎస్‌ల అంగీకారం
* 88 విభాగాల్లో 13,070 మంది ఉద్యోగుల పంపిణీ
* ఏపీకి 1,005 మంది తెలంగాణ ఉద్యోగులు
* తెలంగాణకు 394 మంది ఆంధ్రా ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే అవసరాన్ని బట్టి సూపర్ న్యూమరరీ పోస్టుల ఏర్పాటు ప్రక్రియ కూడా కొనసాగించేందుకు 2 రాష్ట్రాల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీలో ఒక రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులెవరైనా అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో అటువంటి ఉద్యోగులను రిలీవ్ చేయకూడదనే నిబంధన ఉంది. అలాగే అభ్యంతరం వ్యక్తం చేయని ఉద్యోగులను రిలీవ్ చేయకుండా నిలువరించకూడదనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఒక రాష్ట్రానికి చెందిన ఉద్యోగి అభ్యం తరం వ్యక్తం చేసి, మరో రాష్ట్రానికి చెందిన ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చే మార్చి వరకు ఇరు రాష్ట్రాల్లో తాత్కాలికంగా సూపర్ న్యూమరరీ పోస్టుల ఏర్పాటునకు రాష్ట్ర పునర్విభజన విభాగం పంపిన ప్రతిపాదనలకు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు అంగీకరించారు. ఇలా ఉండగా ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీ చివరి దశకు చేరుతోంది. కమలనాథన్ కమిటీ ఇప్పటికే 88 విభాగాల్లోని 13,070 ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ నోటిఫికేషన్లు జారీ చేసింది. పక్షం రోజుల్లో మిగతా విభాగాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
13,070 ఉద్యోగుల్లో మార్గదర్శకాలు, స్థానికత, ఆప్షన్లు ఆధారంగా ఏపీకి 6,770 మంది ఉద్యోగులను, తెలంగాణకు 6,300 ఉద్యోగులను పంపిణీ చేశారు. అత్యధికంగా తెలంగాణకు చెందిన ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించారు. 1,005 మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీకి పంపిణీ అయ్యా రు. కేవలం 394 మంది ఏపీ ఉద్యోగులే తెలంగాణకు పంపిణీ అయ్యారు. ఈ ప్రొవిజనల్ పంపిణీపై అభ్యంతరాల్లేని వారు పంపిణీ అయిన రాష్ట్రాలకు వెళ్లి చేరిపోతున్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఉద్యోగులను మాత్రం రిలీవ్ చేయకుండా నిలుపుదల చేస్తున్నారు. అభ్యంతరాలను పరిష్కరించాలంటే ఉద్యోగుల తుది పంపిణీ ప్రక్రియా పూర్తి కావాలి. పలు విభాగాల్లో ఉద్యోగుల తాత్కాలిక పంపిణీకి అవసరమైన సమాచారాన్ని పంపించనందున తక్షణం ఉద్యోగుల సమాచారాన్ని రాష్ట్ర పునర్విభజన విభాగానికి పంపాల్సిందిగా ఏపీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇరు రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీ ఇలా..
స్థానికత ఏపీ తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ 5,635 394
తెలంగాణ 1,005 5,813
నాన్ లోకల్ 130 93
మొత్తం 6,770 6,300