ఏపీలో తెలంగాణ ఉద్యోగుల హవా!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడం తెలంగాణకు చెందిన ఉద్యోగులకు వరంగా, ఏపీ ఉద్యోగులకు శాపంగా మారింది. పదవీ విరమణ చేసిన, త్వరలో చేయనున్న తెలంగాణ ఉద్యోగులు ఏపీకి ఆప్షన్లు ఇస్తున్నారు. ఈ ఆప్షన్ల ఆధారంగా కమలనాథన్ కమిటీ వారిని ఏపీకి పంపిణీ చేస్తోంది. ఆ విధంగా ఏపీ ప్రభుత్వ శాఖల్లోకి వస్తున్న తెలంగాణ ఉద్యోగుల కారణంగా ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగుల పదోన్నతులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఏపీ సమాచార శాఖకు ఆప్షన్ల ద్వారా తెలంగాణకు చెందిన నలుగురు ఉద్యోగులు వచ్చారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఏపీకి ఉద్యోగులకు నష్టం కలుగుతోంది. తెలంగాణ నుంచి ఆప్షన్లు ద్వారా ఏపీకి వచ్చిన వారు సీనియర్లు కావడంతో వారికే పదోన్నతులు దక్కుతున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన అధికారులకు సమాచార శాఖలో కీలక పదవులు అప్పగిస్తూ పదోన్నతులకు రంగం సిద్ధం చేస్తున్నారు. సంబంధింత ఫైలు సర్క్యులేషన్‌లో ఉంది.