( ఫైల్ ఫోటో )
అన్నమయ్య: కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్తామన్న బీజేపీ హామీ మేరకు ఆయన చేరికకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశారు. తండ్రి అమర్‌నాథ్ రెడ్డి మరణంతో తొలిసారిగా 1989 ఎన్నికల్లో వయల్‌పాడు(వాల్మీకిపురం) నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లోనూ ఇదే స్థానం నుంచి నెగ్గారు. వైఎస్సార్‌కు సన్నిహితుడిగా పేరున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. 2009లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. వైఎస్సార్ ప్రభుత్వంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గానూ ఆయన పని చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయ పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్‌కి 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు(2010 నుంచి 2014 వరకు). ఈయన హయాంలోనే మీ సేవా, రాజీవ్ యువకిరణాలు, ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్, బంగారు తల్లి, మన బియ్యం, అమ్మ హస్తం, చిత్తూరు జల పథకం లాంటివి వచ్చాయి.
విభజన బిల్లుకు వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసి.. ఆపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు కొనసాగారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని రద్దు చేస్తూ.. 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారాయన. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో ఉండి.. మౌనంగా ఉండిపోయారు.
మరో రెండు రోజుల్లో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని, ఆపై బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే దీనిపై కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచిగానీ.. ఆయన అనుచరుల నుంచిగానీ, అటు బీజేపీ నుంచిగానీ స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment