* అసెంబ్లీలో చంద్రబాబు పెదవి విప్పే ధైర్యం చేయలేదు
* జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభలో కిరణ్ ధ్వజం
* తెలుగుతల్లిని బతికించేందుకే కొత్త పార్టీ
* పెద్దమ్మ, చిన్నమ్మలు కలసి రాష్ట్రాన్ని విభజించారు.. జైరాం పిచ్చి మేధావి
* కాంగ్రెస్‌కు కేసీఆర్ పంగనామాలు
సాక్షి, రాజమండ్రి: ‘‘శాసనసభ 45 రోజుల పాటు జరిగినా విభజనపై పెదవి విప్పే ధైర్యం చేయలేని పిరికిపంద చంద్రబాబుకి అధికారం అప్పగిస్తారా?’’ అని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక మూల రాష్ట్రం ముక్కలైపోతోందని జనం మొత్తుకుంటుంటే.. చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్‌గా మారుస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని ధ్వజమెత్తారు. జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభ బుధవారం రాజమండ్రి జెమినీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగింది.
రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కిరణ్ మూడు రంగులతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. బాబు విభజనకు మద్దతుగా లేఖ ఇస్తే పెద్దమ్మ సోనియా గాంధీ, చిన్నమ్మ సుష్మాస్వరాజ్ రాష్ట్రాన్ని ముక్కలు చేశారని విమర్శించారు. పిచ్చి మేధావి జైరాం తాను కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచానన్నారని.. కానీ ఆయనే పిచ్చి మాట లతో రాష్ట్రాన్ని విభజించారని ఆక్షేపించారు.
బిల్లు చెల్లదని సుప్రీం చెప్తుందనే ఆశ...
చంద్రగిరిలో 1977లో అభ్యర్థులు ఎవరూ లేక చంద్రబాబుకు కాంగ్రెస్ టిక్కెట్టు ఇచ్చి మంత్రిని చేస్తే.. అదే కాంగ్రెస్‌ను మోసం చేసి మామ ఎన్‌టీఆర్ పంచన చేరారని.. ముఖ్యమంత్రి పదవి కోసం అదే మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. పార్టీలో ఉన్న కరడు కట్టిన కాంగ్రెస్‌వాదులను కాదని, కిరాయి నాయకులున్నారని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే కేసీఆర్ కాంగ్రెస్‌కు పంగనామాలు పెట్టారని విమర్శించారు.
తలుపులు మూసి, మీడియా వైర్లు కట్‌చేసి పార్లమెంటులో జరిగే దుశ్చర్య బయట ప్రపంచం చూడకుండా విభజన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అసెంబ్లీ తిప్పి పంపిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. తెలుగుతల్లిని కాంగ్రెస్, బీజేపీలు కలిసి హత్య చేసి సంతోషిస్తున్నాయని, సుప్రీంకోర్టును ఆశ్రయించి బతికించేందుకే ఈ పార్టీని పెట్టామని కిరణ్ చెప్పారు. తమ పార్టీ తరఫున బుల్లెట్ల లాంటి యువకులకు టిక్కెట్లు ఇస్తామని, తెలంగాణలోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలబెడతామన్నారు.
తొలి కార్యవర్గం భేటీ...
సభకు ముందు జరిగిన పార్టీ తొలి కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పరీక్షలు, సాధారణ ఎన్నికలు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందన్న విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని, ఉత్తరాంధ్రలో కిరణ్ విసృ్తతంగా పర్యటించాలని తీర్మానించారు. ఎంపీలు హర్షకుమార్, సబ్బం హరి, లగడపాటి రాజ్‌గోపాల్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు శ్రీహరి, మాజీ ఎంపీ విశ్వనాథం, ఎమ్మెల్సీలు బలశాలి ఇందిర, రెడ్డప్పరెడ్డి, ఎమ్మెల్యేలు నీరజారెడ్డి, కొర్ల భారతి, రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, సినీనటుడు నరసింహరాజు, విద్యార్థి నాయకుడు కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
డుమ్మా కొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
నిన్నమొన్నటి వరకు కిరణ్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన సభకు ముఖం చాటేశారు. భారీగా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తరలి వస్తారని పెట్టుకున్న ఆశలు కాస్తా అడియాసలే అయ్యాయి. చివరకు ఆవిర్భావ సభకు వేదికైన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు.
పేలవంగా సభ, పెదవి విరిచిన జనం
కిరణ్ సభకు వచ్చిన కొద్దోగొప్పో జనం కూడా చప్పగా, పేలవంగా సాగిన సభను చూసి నిస్పృహ చెందారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన జనం తీవ్ర అసహనానికి గురయ్యారు. మాజీ ముఖ్యమంత్రి దాదాపు 35 నిముషాల పాటు చేసిన ప్రసంగం జనాన్ని మెప్పించలేక పోయింది. ఉండవల్లి, హర్షకుమార్, పితానిలు తమ ప్రసంగాల్లో కిరణ్ నామజపం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా ఎలా ఉంచుతామన్న సందేశాన్ని సంపూర్ణంగా ఇవ్వలేకపోయారు. తమది ఉద్యమ పార్టీ అని చెప్పుకొన్న నేతలు జనంలో అణుమాత్రం ఉద్యమస్ఫూర్తిని కలిగించలేక పోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘మాటల్లో కత్తులు.. మనసులో భక్తిప్రపత్తులు’ అంటే ఇదేనేమో. కాంగ్రెస్‌పై ‘కన్నెర్ర’జేస్తూ కొత్త పార్టీకి పురుడు పోసిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ మాట అచ్చంగా సరిపోతుంది. రాష్ట్ర విభజనకు పెద్దమ్మ (సోనియా గాంధీ), చిన్నమ్మ (సుష్మా స్వరాజ్) కారణమని ‘జై సమైక్యాంధ్ర’ ఆవిర్భావ సభలో కిరణ్ నిప్పులు చెరిగారు. అయితే.. ఆయన అలా వీరావేశం ప్రదర్శిస్తూ మాట్లాడినంత సేపూ.. ఆ ప్రసంగాన్ని రాసుకు తెచ్చుకున్న కాగితాల అడుగున చిరునవ్వులు చిందిస్తున్న సోనియా బొమ్మ వేదిక దిగువనున్న వారికి దర్శనమివ్వడం విశేషం.