పెన్ డ్రైవ్‌లో ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? ఎందుకివ్వరని మార్గదర్శిని ప్రశ్నించిన హైకోర్టు
సమాధానం చెప్పడానికి తటపటాయించిన మార్గదర్శి న్యాయవాది
తదుపరి విచారణ వరకు గడువు ఇవ్వాలని వినతి.. నవంబర్ 4కు వాయిదా వేసిన ద్విసభ్య ధర్మాసనం
ఆరోజు చందాదారుల వివరాలను పెన్ డ్రైవ్‌లో తేవాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులపై సుప్రీం కోర్టుకు అందజేసిన 69,531 పేజీల వివరాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు ఎల్రక్టానిక్‌ఫార్మాట్‌లో ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే ఉండవల్లి వద్ద పేపర్ ఫార్మాట్‌లో వివరాలున్నాయని, కొన్ని ఇబ్బందుల కారణంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్ (పెన్ డ్రైవ్)లో కోరుతున్నారని హైకోర్టు తెలిపింది. దీనికి సమాధానం చెప్పేందుకు మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తటపటాయించారు.
కొంత గడువు ఇస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్ నుంచి సూచనలు పొంది చెబుతానని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. ఆరోజున అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), మార్గదర్శితో పాటు ఇరు రాష్ట్రాల న్యాయవాదులను ఆదేశించింది. చందాదారుల వివరాలను పెన్ డ్రైవ్‌లో తీసుకురావాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచి్చంది. ఈ తీర్పుపై ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ ఏడాది ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించింది.
లూథ్రా వాదనకు ధర్మాసనం అభ్యంతరం ఈ వ్యవహారంపై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణకు ఉండవల్లి అరుణ్‌కుమార్ వర్చువల్‌గా హాజరయ్యారు. సుప్రీం కోర్టుకు మార్గదర్శి అందజేసిన 69,531 పేజీల చందాదారుల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. పేపర్ ఫార్మాట్‌లో వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ, పరిశీలనకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. కొన్ని అంశాలను ఇప్పటికే పరిశీలించానని, ఆ వివరాలన్నీ డొల్లగానే ఇచ్చారని అన్నారు. ఎల్రక్టానిక్ ఫార్మాట్‌లో ఇస్తే అక్రమాలు తెలియజేస్తానన్నారు. తాను ఎవరి తరఫున వకాలత్ తీసుకోలేదని, సుప్రీం కోర్టు సూచన మేరకు హైకోర్టుకు సాయం మాత్రమే చేస్తున్నా అని చెప్పారు. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చందాదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పేపర్ ఫార్మాట్‌లో ఉన్న వివరాలనే పెన్‌డ్రైవ్‌లో కోరుతున్నారు కదా అని ప్రశ్నించింది. దీంతో గడువిస్తే సంస్థ నుంచి సూచనలు పొంది చెబుతానని లుథ్రా బదులిచ్చారు. కాగా, ఈ కేసులో పిటిషనర్–2 (రామోజీరావు) మృతి చెందారని తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్‌రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని కూడా ధర్మాసనం నమోదు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment