రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఒక ఆసక్తికర విషయం చెప్పారు. గతంలో మార్గదర్శి ఫైనాన్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జి ఒక వ్యాఖ్య చేశారట. ఈనాడు మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ఇస్తోందని, అందుకే తమపై కక్ష వహిస్తున్నారని అంటున్నారు.. మీరేమో ప్రభుత్వంపై వ్యతిరేకతతో రాస్తారు. వారు మీ తప్పులు కనుగొని ఎత్తి చూపుతారు. ఇందులో తప్పేముందని అన్నారట. మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి సుప్రీంకోర్టులో రామోజీరావుపై పోరాడుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రామోజీ మార్గదర్శి చిట్‌ఫండ్ కేసుల్లో ఇరుకునపడ్డారు. ఏపీ సీఐడీ వారు లేవనెత్తుతున్న అనేక ప్రశ్నలకు వారు సూటీగా సమాధానం చెబుతున్నట్లు అనిపించదు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం తమపై దాడి చేస్తోందని వాపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరిపైన అయినా కారణం ఉన్నా, లేకపోయినా, దాడి చేసే హక్కు ఒక్క ఈనాడు మీడియాకు, దాని అధినేత రామోజీరావుకే ఉందని అనుకోవాలి. ఉండవల్లి అంటున్నట్లు ఈ దేశంలో రామోజీ ఎన్ని చట్టాలను అతిక్రమించినా ఆయనను నిలదీసే పరిస్థితి లేదని, ఆయా రాజకీయ పార్టీలు, వ్యవస్థలను అలా మేనేజ్ చేయగలుగుతున్నారని చెప్పుకోవాలి.
ఉదాహరణకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు ఏపీకి తరలివెళ్లే చివరి రోజున గౌరవ హైకోర్టు వారితో ఎలా తన కేసును కొట్టివేయించుకోగలుగుతారని ఆయన ప్రశ్నిస్తుంటారు. కనీసం పిటిషనర్ అయిన తనకు కూడా తెలియకుండా చేయగలిగారని ఆయన వివరిస్తుంంటారు. ఆ తర్వాత ఎప్పటికో సమాచారం తెలిసి ఉండవల్లి సుప్రీంకోర్టుకు వెళ్లవలసి వచ్చింది. మార్గదర్ళి చిట్ కేసులలో కూడా రామోజీ కోర్టులలో ఎన్ని పిటిషన్‌లు వేస్తున్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లు వెచ్చించగలుగుతున్నారు. నిజంగా తానేమీ తప్పు చేయకపోతే చిట్ రిజిస్ట్రార్ అధికారులు కాని సీఐడీ అధికారులు కాని అడిగిన రికార్డులను ఎందుకు చూపించలేదు.
చదవండి: తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా.. రామోజీ ఎందుకిలా?
సుమారు 800 మంది కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేయడంలోని మతలబు ఏమిటి? ఇవన్ని నగదు డిపాజిట్లా? కాదా? చట్టబద్దమైన డిపాజిట్లే అయితే వారి పేర్లు బయటపెట్టవద్దని ఎందుకు కోరుతున్నారు? దీనికి ఆయన ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఒక్కదానిలోనే సోదాలు చేయలేదు కదా. అన్ని చిట్ ఫండ్ సంస్థలపై సోదాలు చేసి కొన్నిటిపై కేసులు పెట్టిన విషయం మరిచిపోకూడదు.
రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చెందిన చిట్ సంస్థలపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టులు కూడా చేశారే. మార్గదర్శి సంస్థలో చిట్ గ్రూప్‌లు నిలిపివేస్తూ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై సంస్థ వారు కోర్టుకు వెళితే చిట్ గ్రూపులను నిలిపివేయడానికి ముందు వారికి నోటీసు ఇవ్వాలని ఆదేశం మేరకే ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసినట్లుంది. దానిని ప్రచార ప్రకటన రూపంలో ఇవ్వడం ఈనాడుకు అభ్యంతరం కావచ్చు. అదే వేరే కంపెనీలపై ఇలాంటి వాటిని ప్రభుత్వం ఇస్తే ఈనాడు తీసుకోకుండా ఉంటుందా? చట్ట ఉల్లంఘనలు వివరిస్తూ ప్రభుత్వ అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు. దానిని ప్రజాధనంతో దాడి చేస్తారా అని ఈనాడు ప్రశ్నించింది. మరి నిత్యం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పై అసత్యాలు వండి వార్చుతూ దాడి చేస్తున్న ఈనాడును ఏమనాలి.
పాఠకులకు విలువైన వార్తలు ఇవ్వవలసిన పత్రిక స్థలాన్ని తన వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఈనాడు మీడియా ఎలా వాడుతోంది. పేజీలకు పేజీలు రాసి ప్రజలపై దాడి చేస్తోంది ఈనాడు కాదా? అదంతా లెక్క వేస్తే ఎన్ని వందల కోట్ల వ్యయం అవుతుంది? ఇలా జర్నలిజాన్ని, వ్యాపారాన్ని కలగలిపి చేయడం విలువలతో కూడిన విషయమే అవుతుందా? ఉండవల్లి మరో ప్రశ్న వేశారు. టివి 9 రవిప్రకాష్‌పై కేసులు వచ్చినప్పుడు, ఆయనను జైలులో పెట్టినప్పుడు రామోజీపై కేసులు పెట్టకూడదని ఎలా అంటారని ఆయన అడిగారు. రవి ప్రకాష్ కేసులలో రాజకీయ పార్టీలు ఏవీ ఆయనకు మద్దతు ఇవ్వలేదని అన్నారు.
రవిప్రకాష్‌కు ఒక న్యాయం, రామోజీకి ఒక న్యాయం ఉంటుందా? అని ఆయన అంటున్నారు. ఏపీ ప్రభుత్వం మార్గదర్శి చందాదారులకు నిర్దిష్ట సమాచారాన్ని ఇస్తూ ఆ ప్రకటన చేసింది. దానికి ఖండనగా ఈనాడు మీడియా పెద్ద ఎత్తున ఒక పేజీ నిండా వార్తల రూపంలో ప్రచురించింది. అందులో తాము చట్టాన్ని ఉల్లంఘించలేదన్న బుకాయింపు తప్ప స్పష్టత ఎంత మేర ఉందన్నది సందేహం. చిట్ దారుల డబ్బును ప్రత్యేక ఖాతాలలో ఉంచుతున్నారా? లేదా? అన్నదానికి జవాబు దొరికినట్లు లేదు. తమకు చట్టాలు వర్తించవని రామోజీ భావిస్తే ఏమి చేయాలి. తమపై దాడి అంటూ ఈనాడు రాసిన కథనంలో ప్రభుత్వంపై ఎలా అబద్దపు దాడి చేశారో చూడండి.
గోదావరి వరదలతో రాష్ట్రం అల్లకల్లోలమైందట. గోదావరికి వరద వచ్చిన మాట నిజం. పలు గ్రామాలు నీటి ముంపునకు గురైన సంగతి వాస్తవం. కాని అంతవరకు రాయకుండా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయిందని, అయినా మార్గదర్శిపై దాడి చేశారని రాస్తోంది. అంటే రాష్ట్రంలో వారు అనుకున్నవి తప్ప ఇంకేమీ పనులు ప్రభుత్వాలు చేయరాదన్నమాట. నిజంగానే గోదావరి వరదలతో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయితే ఆ వార్తను బానర్‌గా ఇవ్వకుండా డేటా చౌర్యం అంటూ మరో తప్పుడు వార్తను ఈనాడు ఎలా ఇచ్చింది. ఆ పక్కనే మార్గదర్శి రిజాయిండర్ వార్తను ఎందుకు ఇచ్చారు? ఆ తర్వాత ప్రభుత్వాన్ని దూషించడానికి కొన్ని కథనాలు ఇచ్చారు.
వాటిలో వరద బాధితులకు సహయం అందడం లేదంటూ మరో కథనం అల్లారు. నిజానికి ప్రభుత్వం డెబ్బైవేల మందికి పైగా పునరావాస శిబిరాలకు తరలించింది. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వార్త ఇవ్వవచ్చు. కాని దానిని చిలవలు, పలవలు చేసి ప్రభుత్వంపై విషం చిమ్మిన విషయాన్ని ప్రజలు గమనించరా? పడవలలో కూడా వెళ్లి వలంటీర్లు ఇతర సిబ్బంది సేవలు అందిస్తున్న విషయాన్ని వీరు గుర్తించరా? ఇలా ఒకటి కాదు.. ఎక్కడెక్కడి చెత్త, చెదారాన్ని అంతటిని పోగు చేసుకు వచ్చి ఏపీ ప్రజలపైన రద్దుతున్న ఈనాడును ఏమనాలి.
మరి తెలంగాణలో ఎందుకు నోరు మెదపడం లేదు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేరెత్తడానికే గజగజలాడుతున్నారే. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎంత బరితెగించి దాడి చేస్తూ వస్తున్నారు. కేవలం తెలుగుదేశం అధికారం కోల్పోయిందని, తమ ఎదుట కూర్చునే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారన్న దుగ్దతో పాటు తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయంతోనే కదా ఇలా చేస్తున్నారు. ఎక్కడ అక్రమాలు జరిగినా దానిపై చర్య తీసుకోవడమే కదా ప్రభుత్వ బాధ్యత.
ప్రభుత్వం ఇతరుల అక్రమాలపై చర్య తీసుకోకపోతే ఇంకేముంది .. ప్రభుత్వం కుమ్మక్కైపోయిందని రాసే ఈనాడు మీడియా తమ గ్రూప్ సంస్థలోని మార్గదర్శి అక్రమాలపై వార్తలు ఇస్తే మాత్రం దాడి అని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా రామోజీ స్వయంకృతాపరాధం మాత్రమే కాదు. అహంకార పూరితంగా, తాను అన్నిటికి అతీతుడను అన్న భ్రమలో ఉండి చట్టాలను ఉల్లంఘించారు. ఒకప్పుడు రామోజీకి మద్దతుగా ప్రజలలో ఒకరకమైన భావం ఉండేది.
కాని ఇప్పుడు అదే రామోజీ పై ప్రజలలో సానుభూతి లేకపోగా ఆయన ఏమి చేసినా చర్య తీసుకునే మగాడే లేడా అన్న ప్రశ్న ప్రజలలో తరచుగా వినిపిస్తోంది. వారందరికి జగన్ రూపంలో ఒక మగాడు కనిపిస్తున్నాడు. ఉండవల్లి కే కాదు.. చాలా మందికి ఇప్పుడు ఒక జవాబు దొరికింది కదా. వైఎస్సార్‌పై పగబట్టి వార్తలు రాసినా 2009లో ఆయనను రామోజీ ఓడించలేకపోయారు. ఇప్పుడు కూడా రామోజీ ఎంత విషం చిమ్మినా 2024లో కూడా అదే తరహాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డి తిరిగి గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారు. పలు సర్వేలు కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment