10 బంతుల్లోనే ఖేల్‌ ఖతం.. టీ20 వరల్డ్‌కప్‌-2025లో సంచలనం | Womens Under 19 T20 World Cup 2025: South africa Finishes Match Against Samoa With In 10 Balls | Sakshi
Sakshi News home page

10 బంతుల్లోనే ఖేల్‌ ఖతం.. టీ20 వరల్డ్‌కప్‌-2025లో సంచలనం

Published Tue, Jan 21 2025 8:46 AM | Last Updated on Tue, Jan 21 2025 9:43 AM

Womens Under 19 T20 World Cup 2025: South africa Finishes Match Against Samoa With In 10 Balls

అండర్‌ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌-2025లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికా జట్టు 10 అంటే 10 బంతుల్లోనే మ్యాచ్‌ ముగించేసింది. ఇన్నింగ్స్‌ బ్రేక్‌కు వెళ్లొచ్చేలోగా ఖేల్‌ ఖతమైంది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా సమోవా జట్టుతో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సమోవా 9.1 ఓవర్లలో 16 పరుగులకే కుప్పకూలింది.

సమోవా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. నాలుగు ఒకట్లు (1), రెండు మూడులు (3 పరుగులు) నమోదయ్యాయి. ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 6 పరుగులే సమోవా తరఫున అత్యధిక స్కోర్‌గా ఉంది. సమోవా బ్యాటర్లు చేసిన పరుగులకంటే సఫారీ బౌలర్లు తీసిన వికెట్లే అంకెల్లో టాప్‌గా ఉన్నాయి. ఎన్‌తబిసెంగ్‌ నిని 3, ఫే కొలింగ్, కేలా రేనెకె, శేషిని నాయుడు తలో 2 వికెట్లు తీశారు.

అనంతరం దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఇద్దరే... పలువురు ప్రేక్షకులు బ్రేక్‌కు వెళ్లొచ్చే లోగా 10 బంతుల్లో 17 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. ఓపెనర్లు సిమోన్‌ లారెన్స్‌ (6 నాటౌట్‌), జెమ్మా బోతా (6 నాటౌట్‌) 1.4 ఓవర్లలోనే మ్యాచ్‌నే ముగించారు.  

పెను సంచలనం
నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. న్యూజిలాండ్‌పై నైజీరియా  2 పరుగుల తేడాతో గెలుపొందింది. మహిళల అండర్‌ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్‌ సీనియర్‌ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్‌ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement