అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి.. అని ఒక పాట ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే అయినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి అయిన షర్మిలను ఏపీ రాజకీయాలలోకి తీసుకు వచ్చి ఆయనను ఇబ్బంది పెట్టాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఆదరించే వర్గాలలో కొంత చీలిక తీసుకురావాలని చంద్రబాబు ఆలోచించారు. తదనుగుణంగా ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని రాజకీయ కార్యకలాపాలలో ఉన్న షర్మిలను అక్కడ నుంచి ఏపీకి తీసుకురావడంలో పరోక్షంగా ఒక పాత్ర పోషించారు.
చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమెను ఏపీ రాజకీయాలలోకే వెళ్లాలని పట్టుబట్టారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ వద్ద దీనిపై పంచాయతీ కూడా జరిగింది. ఆమె ఏపీ రాజకీయాలలోకి వెళ్లేలా ఒప్పందం కుదిరిన తర్వాతే ఆమె పార్టీ వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నారు. తదుపరి షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె కూడా చంద్రబాబు తరపునే పనిచేస్తూ అన్నను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కూడా తన ఉపన్యాసాలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శిస్తూ చెల్లెలుకు న్యాయం చేయడం లేదని అనేవారు. షర్మిల పట్ల, అలాగే విజయమ్మ పట్ల తనకు సానుభూతి ఉందన్నట్లు మాట్లాడేవారు.
షర్మిల రాజకీయాలలోకి వస్తూనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా తన వెనుక ఎవరు ఉంది ప్రపంచానికి పరోక్షంగా చెప్పేశారు. రాధాకృష్ణ అంటే చంద్రబాబు సొంత మనిషి కింద లెక్క. చంద్రబాబు తరపున ఆయా లావాదేవీలు నిర్వహిస్తుంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో రాధాకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారని ఎక్కువ మంది నమ్ముతారు. అలాంటి వ్యక్తి చేసిన రాయబారం ఫలించి ఆమె కొంతకాలం తెలంగాణలో పార్టీ నడిపి, ఆ తర్వాత ఏపీ రాజకీయాలలోకి వచ్చారు. అంతవరకు తాను తెలంగాణ బిడ్డనని, ఈ మట్టిని వదలిపెట్టనని షర్మిల చేసిన శపధాలన్నీ గాలిలో కలిసిపోయాయి.
షర్మిల క్రైస్తవ మతం ఆచరిస్తారు కనుక, ఆ ఓట్లను ఆమె కొంతవరకు చీల్చగలిగితే అది తమకు లాభిస్తుందని చంద్రబాబు, రాధాకృష్ణ అంచనా వేసుకున్నారు. ఆమె కూడా వారికి యధో శక్తి రాజకీయంగా ఉపయోగపడుతూ, తన అన్నను విమర్శిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో గతంలో మాట్లాడినదానికి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు చేస్తున్న తీరు కూడా ఇంకో నిదర్శనంగా కనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఆమె చంద్రబాబును సైతం కొంతమేర విమర్శించవలసి వస్తోంది. వాటిని ఎడిట్ చేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శించిన మేర తమ మీడియాలో ప్రచారం చేశాయి. కాలం గడిచే కొద్ది చంద్రబాబుకు తత్వం బోధపడినట్లుగా ఉంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. వారిలో కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ వద్దకు రాకుండా కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారా అని చంద్రబాబు మదనపడుతున్నారు. దీనివల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అన్న ఆలోచనకు వచ్చారు. బహుశా షర్మిల వల్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు వచ్చే ఓట్లలో ఏమైనా గండి పడుతుందా అని సర్వేలు చేయించుకుని ఉండాలి. ఆ సర్వేలలో షర్మిల వల్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు ఎలాంటి నష్టం ఉండదని తేలి ఉండవచ్చు. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు ఉపయుక్తంగా ఉంటుందన్న సమాచారం వచ్చి ఉండవచ్చు. దాంతో అంతవరకు షర్మిలను భుజాన వేసుకుని సానుభూతి వచనాలు పలికిన చంద్రబాబు మళ్లీ పెద్ద కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ పాత డైలాగులు చెప్పడం ఆరంభించారు.
2014లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తదుపరి 2018లో తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలను కలిపి విమర్శించేవారు. 2024 నాటికి అదే మోదీతో, బీజేపీతో ఆత్మగౌరవం వదలుకుని మరీ పొత్తు పెట్టుకున్నారు. డబుల్ స్టాండర్స్ కు పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడు ఇలా యూ టర్న్‌లు తీసుకోవడం కొత్తకాదు. ప్రస్తుతం కూడా అలాగే షర్మిల విషయంలో కూడా యు టర్న్ తీసుకుని మాట్లాడడం ఆరంభించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే షర్మిల వచ్చారని ఆయన చెబుతున్నారు. పెద్ద కాంగ్రెస్, వైకాపా పిల్ల కాంగ్రెస్ అని పాతపల్లవిని కొత్తగా ఎత్తుకున్నారు. ఈ రెండు కలిసి డ్రామాను రక్తి కట్టిస్తున్నాయని ఆయన అన్నారు.
అక్కడితో ఆగకుండా రాజకీయాలకు దూరంగా ఇంటిలోనే ఉంటున్న విజయమ్మ పేరు ప్రస్తావించి.. మొన్నటివరకు కుమారుడికి ఆంధ్ర, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చారని చెప్పిన విజయమ్మ ఇప్పుడేమో కుమార్తెను ఏపీలో యుద్దానికి పంపారని అన్నారు. పిల్లలకే న్యాయం చేయలేని తల్లి ఐదు కోట్ల మందికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. షర్మిలకు అన్యాయం జరిగితే ఇంటిలోనే పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. దీనిని బట్టి ఏమి తెలుస్తుంది! తన రాజకీయ అవసరాల కోసం తన ప్రత్యర్ది పార్టీ అధినేత ఇళ్లలో ఉన్న ఆడవారిపై కూడా అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి చంద్రబాబు వెనుకాడరనే కదా! తన భార్యను ఎవరో ఏదో అన్నారంటూ అసెంబ్లీలో రచ్చ చేసి, బయటకు వచ్చి ఏడుపు లంఖించుకున్న ఆయన, విజయమ్మపై విమర్శలు చేయవలసిన అవసరం ఏముంది. అంటే ఏదో రకంగా రెచ్చగొడితే ఆమె కూడా కామెంట్ చేస్తే, ఈ విషయంపై చర్చ కొనసాగించాలన్న దురుద్దేశంతోనా అనే సందేహం వస్తుంది.
ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానిఫెస్టోల గురించి సవాల్ చేస్తూ ప్రజా సమస్యల గురించి అధికంగా ప్రస్తావిస్తూ, యాత్ర సాగిస్తుంటే, చంద్రబాబు మాత్రం ఇలా వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. దీని అంతటికి ఒక కారణం కనిపిస్తుంది. వలంటీర్లు తదితర అంశాలలో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు వాటిని జనం మర్చిపోవాలన్న లక్ష్యంతో పనికి రాని ఉపన్యాసాలు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే? షర్మిల వల్ల తనకు రాజకీయంగా కలిసి వస్తుందని ఆయన ఆశించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు మద్దతు ఇచ్చే వర్గాలలో ఎలాంటి విభజన రాకపోగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎంతో కొంత చీలుతుందని ఆయనకు అర్దం అయినట్లుగా కనిపిస్తుంది.
తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీచేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఓడించలేమన్న భయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్రాప్‌లో వేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తులోకి వెళ్లారు.కానీ దీనివల్ల మైనార్టీ వర్గాలలో తనపై వ్యతిరేకత ఏర్పడిందని చంద్రబాబు అర్ధం చేసుకుని ముస్లింలకు తన పాలనలో రక్షణ ఉందని చెప్పడం ఆరంభించారు. షర్మిల వల్ల చీలే ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలపై ఆదారపడకుండా, తన ప్రభుత్వ పనితీరు, స్కీముల వల్ల ప్రజలకు జరిగిన మేలు మొదలైన విషయాలను చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. బీజేపీ,జనసేనలతో నేరుగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్, సీపీఐ వంటి పక్షాలతో అవగాహన పెట్టుకున్నారన్నది ఎక్కువ భావన. అయినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఓడించలేకపోతున్నామన్న ఆందోళన చంద్రబాబులో ఏర్పడింది. అందులో భాగంగానే షర్మిలపై చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తాయి. కొన్నాళ్ల క్రితం కూటమి సభ జరిగినప్పుడు మోదీ ఇలాగే అన్నా, చెల్లెళ్లు ఒకటేనని అన్నప్పుడు చంద్రబాబు సీరియస్‌గా తీసుకోలేదు. కానీ టీడీపీ ఓట్లకే గండిపడుతోందని సర్వేలు తెలపడంతో ఆయనలో మరింత కంగారు ఏర్పడింది.
నిజానికి షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు ఇప్పటికి 99 శాతం నియోజకవర్గాలలో ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. 99 శాతం సీట్లలో డిపాజిట్లు కూడా దక్కించుకోవడం కూడా కష్టమేనని చెబుతున్నారు. అయినా ఆమెను అడ్డుపెట్టుకుని తను లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తే, ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి భవిష్యత్తే అయోమయంలో పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. తత్ఫలితంగా చంద్రబాబు కొత్త స్వరం ఆలపిస్తున్నారు. అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి అనే చందంగానే చంద్రబాబు పరిస్థితి ఏర్పడింది!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment