ఐటీ నిపుణులకు రక్షణ కల్పిస్తాం: కిరణ్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో విధులు నిర్వర్తించే ఐటీ రంగ నిపుణులకు జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) పరంగా పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంత నాయకుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. శనివారం మాదాపూర్‌లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఐటీ రంగ నిపుణులు, ఉద్యోగులతో కిరణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల్లో పనిచేసే సీమాంధ్ర ప్రాంత ఐటీ ఉద్యోగులు రోజూ సహచర తెలంగాణ ఉద్యోగుల నుంచి ఎదుర్కొంటున్న వేధింపులను, వాటి వల్ల ఏర్పడే ఇబ్బందులను ఏకరువు పెట్టారు.
రాష్ట్ర విభజన తర్వాత ఐటీ సంస్థల్లో వచ్చిన మార్పులను, ఉపాధి అవకాశాలకు దూరమవుతోన్న తీరును సీమాంధ్ర ఐటీ ఉద్యోగ సంఘ జేఏసీ కన్వీనర్, కో-కన్వీనర్‌లు ఉమామహేశ్వరరావు, శ్రావణ్‌కుమార్‌లు కిరణ్‌కు వివరించారు. టీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులు అన్ని కంపెనీల సీఈవోలకు ఫోన్లు చేసి తెలంగాణ ప్రాంతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని, ఈ పరిస్థితుల నుంచి సీమాంధ్ర ఐటీ ఉద్యోగులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడానికి అన్ని పార్టీలూ దోహదపడాలని కోరారు. వీరి ఇక్కట్లను పూర్తిగా విన్న మాజీ సీఎం.. తాను ప్రారంభించిన పార్టీ ద్వారా ఈ తరహా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టంచేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ అధికారంలోకి వస్తే సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామన్నారు.