వహ్వా.. వహ్వా...ఏమి తహతహ!
ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఎల్లెడలా జాతర
నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల హడావుడి
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీ
రూ.100 కోట్ల విలువైన పనుల పందేరం
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే సంకేతాలతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చేపడుతున్న పనులు జాతరను తలపిస్తున్నాయి. ఆలస్యం చేస్తే మంజూరైన నిధులు చేజారిపోతా యనే ముందుచూపుతో హడావుడిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ పనుల వల్ల నేతాశ్రీలు భారీగానే లాభపడు తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
తరుముకొస్తున్న సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడం, సీఎం రాజీనామా అనంతర పరిణామాలతో ఎమ్మెల్యేలు ఎప్పుడో పూర్తిఅయిన పనులకు ప్రారంభోత్సవాలు, కొత్త పనులకు శంకుస్థాపనలతో హోరెత్తిస్తున్నారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే రాజకీయంగా బతుకు బస్టాండ్ అవ్వడం ఖాయమైపోవడంతో ఉన్న పనులను చేపట్టేందుకు ఎమ్మెల్యేలంతా దాదాపు ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రెండుచేతులతో ఎడాపెడా చేసుకుపోతోన్న శంకుస్థాపనలు గ్రామాల్లో జాతరలను తలపిస్తున్నాయి. ఈ పనుల జాతరతో వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని వీరు ఆరాటపడుతున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎంపీ లాడ్స్, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు...ఇలా పలు శాఖల ద్వారా సుమారుగా రూ.100 కోట్ల విలువైన పనుల పందేరం జరుగుతోంది.
తుని నియోజకవర్గంలో పలు గ్రాంటుల నుంచి అత్యధికంగా సుమారు రూ.10 కోట్ల విలువైన పనులు చేపట్టాలనుకున్నారు. వాటిలో కోటనందూరు, తొండంగి, తుని రూరల్ మండలాల్లో ఎమ్మెల్యే అశోక్‌బాబు రెండు రోజుల క్రితం రూ.7 కోట్ల విలువైన పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేశారు. మరో రూ.3 కోట్ల పనులకు శనివారం శంకుస్థాపనలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా మరో రూ. కోటి మంజూరు కావడం విశేషం. పిఠాపురం నియోజకవర్గంలో ఒకే రోజు రూ.1.77 కోట్లతో ఇబ్బడిముబ్బడిగా పనులకు శంకుస్థాపనలు చేశారు. గొల్లప్రోలు నగర పంచాయతీ, తహశీల్దార్ కార్యాలయం, విష్ణాలయం పునర్నిర్మాణం వంటి పనులకు హడావుడిగా శంకుస్థాపనలు కానిచ్చేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి పలు పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ముహూర్తాన్ని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రూ.13.85 కోట్లతో నిర్మించే వంద పడకల ఆస్పత్రికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని పనులు ఉన్నాయి.
రాజమండ్రి సిటీ నియోజకవర్గం పరిధిలో కార్పొరేషన్‌కు చెందిన రూ.27 కోట్ల జనరల్ ఫండ్‌తో చేపట్టే పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో కొన్ని చోట్ల చేసినచోటే మరోసారి రహదారి పనులు చేపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ ఎమ్మెల్యే నిధుల నుంచి కార్పొరేషన్ పరిధిలో కోటి రూపాయల పనులు ప్రారంభించారు. సిటీ పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రూ.కోటి, అప్పటి ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సిఫారసు మేరకు మరో రూ.కోటి విలువైన పనులను చేపడుతున్నారు.
జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.19.84 కోట్లు విడుదలయ్యాయి. దీనిలో జనరల్ ఫండ్స్ రూ.15.50 కోట్లు కాగా, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.4.34 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 10న జీఓ ఆర్‌టి నంబర్ 170ను విడుదల చేసింది. వీటిలో అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రూ.3 కోట్లు సాధించుకున్నారు. వాటితో పనులు మొదలుపెట్టేపనిలో ఉన్నారు. కాగా, ఇంకా పూర్తి కాని బోడసకుర్రు వంతెన ప్రారంభోత్సవానికి ఎంపీ తొందరపడుతున్నారు. 80 శాతం పనులు మాత్రమే అక్కడ పూర్తి కాగా, ఈ నెల 26న ఎట్టి పరిస్థితుల్లోను ప్రారంభింపచేయాలని అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.
సుమారు రూ.70 కోట్లతో చేపట్టిన ఈ వంతెన నిర్మాణం జాప్యం జరుగుతున్నా పట్టించుకోని ఎంపీ హర్షకుమార్ ఇప్పుడు హడావుడిగా ప్రారంభోత్సవానికి సిద్ధపడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా నిధుల వరద పారిస్తున్నారు. మంత్రి తోట నరసింహం ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేట నియోజకవర్గానికి రూ.2.24 కోట్లు, రాజానగరం నియోజకవర్గానికి రూ.2.70 కోట్లు, కొత్తపేట నియోజకవర్గానికి రూ.1.60 కోట్లు, రామచంద్రపురం, రాజోలు, తుని, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాలకు రూ.1 కోటి వంతున ప్రత్యేక నిధులు కేటాయించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి మాత్రం రూ.30 లక్షలు మాత్రమే తెచ్చుకోగలిగారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మాత్రమే అభివృద్ధి పనులు గుర్తుకువచ్చాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పనుల వల్ల నేతలు భారీగానే ప్రయోజనం పొందుతున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.