సాక్షి, కాకినాడ :జిల్లాలో బుధవారం జరుగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలతో పద్దెనిమిది నియోజకవర్గాల్లోను, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం సాయంత్రం అయిదు గంటలకు పోలింగు ముగియనుంది. జిల్లాలో అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంటు స్థానాలకు, పందొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రతినిధులను ఎన్నుకునే ఓటర్లు 37 లక్షల 74 వేల 147 మంది వున్నారు. వీరిలో పురుషులు 18 లక్షల 82 వేల 162, మహిళలు 18 లక్షల 91 వేల 727, ఇతరులు 258 మంది ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి పురుష ఓటర్లు అధికంగా ఉండడం విశేషం. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచీ అంటే గత జనవరి నెల నుంచీ అధికార యంత్రాంగం ఓటర్ల నమోదులో తలమునకలై మొత్తంగా ఒక లక్షా యాభైనాలుగు వేల నూట పదిహేడు మంది కొత్త ఓటర్లను చేర్పించింది.
జిల్లాలో 2268 ప్రాంతాల్లో 4056 పోలింగు స్టేషన్లు నెలకొల్పి 354 రూట్లుగా విభజించారు. అందులో సమస్యాత్మకం, అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 2750 పోలింగు స్టేషన్లలో వెబ్‌కాస్టింగు నిర్వహిస్తున్నారు. దీనివల్ల పోలింగు ప్రక్రియలో సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ఎలాంటి అవరోధాలు చోటు చేసుకున్నా క్షణాల్లో భద్రతా బలగాలు తరలివచ్చి పరిస్థితి చక్కదిద్దేందుకు వీలవుతుంది. వెబ్‌కాస్టింగ్ నిర్వహణకు దాదాపు మూడు వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నారు. మంగళవారం మధ్యాహ్నానికే ఓటరు స్లిప్పుల పంపిణీ, ఎపిక్ కార్డుల పంపిణీ 90 శాతం పూర్తయినట్టు జిల్లా కేంద్రానికి వర్తమానం అందింది. భద్ర తకు రాజమండ్రి అర్బన్ నుంచి 2126 మందిని, జిల్లా పోలీసు(కాకినాడ)నుంచి 7337 మంది పోలీసులను వినియోగిస్తుండగా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 5 కంపెనీలను రాజమండ్రికి, 28 కంపెనీలను జిల్లాకు వినియోగిస్తున్నారు. 33 వేల 740 మంది
పోలింగు సిబ్బంది
ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు ఎలక్ట్రానిక్ ఓటింగు మెషీన్లకు సంబంధించి 11 వేల 207 బ్యాలట్ యూనిట్లు, 8515 కంట్రోల్ యూనిట్లు అన్ని నియోజకవర్గాల రిటర్నింగు అధికార్లకు పంపిణీ కాగా అక్కడి నుంచి గ్రామాలకు పోలింగు నిమిత్తం వెళ్లే పోలింగు సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా అందజేసే ప్రక్రియ సైతం పూర్తయింది. ఈవీఎంలు ఎక్కడ పేచీపెట్టినా తక్షణం అందుబాటులో వుండేలా రిజర్వులో వుండే ఈవీఎంలను ఆయా సెక్టోరల్ అధికార్లకు అప్పగించారు.
పోలింగు నిమిత్తం ప్రత్యేకించి నేరుగా 28 వేల 885 మందిని, మైక్రో అబ్జర్వర్లుగా 519, సెక్టోరల్ ఆఫీసర్లు 354, బూత్ లెవెల్ అధికార్లు 3982 మందిని వినియోగించారు. వీరందరి కోసం 815 చిన్నా పెద్దా వాహనాలను వినియోగిస్తున్నారు. వీరుకాక ఓటర్ల క్యూ లైన్లను పర్యవేక్షించేందుకు 2358 మంది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లతో సహా 4581 మందిని సహాయంగా తీసుకున్నారు. మొత్తం పోలింగు కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బంది పడకుండా మంచినీటి సదుపాయం, ప్రథమ చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగు స్టేషన్లలో బాత్రూమ్, లెట్రిన్ సౌకర్యాలతో పాటు వికలాంగులు ఓటేసేందుకు వచ్చేలా ర్యాంపుల నిర్మాణం పూర్తిచేశారు. పోలింగు కేంద్రం వద్దకు వికలాంగులను తీసుకొచ్చే వాహనాలను తప్ప మరి ఏ ఇతర వాహనాన్ని అనుమతించవద్దని జిల్లా ఎన్నికల అధికారి నీతూప్రసాద్ ఆదేశాలిచ్చారు. ఇప్పటికే జిల్లా అంతటా ఏర్పాటయిన 197 మందితో కూడిన ఫ్లైయింగు స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్సు బృందాలు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు బృందాలు మంగళవారం వరకూ నగదు రూపంలో రూ.9.46 కోట్లు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో పోలీసు శాఖ ద్వారా రూ. అయిదు కోట్లు పట్టుకున్నామని జిల్లా ఎస్పీ విజయకుమార్ పేర్కొన్నారు.
అనుకున్న స్థాయిలో పోలింగు శాతం వుండేనా..
ఎన్నికల్లో సగటున నూటికి 75 మంది మాత్రమే ఓటేస్తున్నారు. ఈ శాతాన్ని 85 శాతంకు అవసరమైతే నూరు శాతానికయినా పెంచాలని ఎన్నికల కమిషన్ కంకణం కట్టుకుని స్వీప్ ప్రణాళిక ద్వారా జిల్లాలో పలు రకాల ప్రచారాలు నిర్వహించింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పోలింగు శాతం 77.42 కాగా పురుషులు 79.04, మహిళలు 75.83 శాతం ఓట్లేశారు. విడివిడిగా చూస్తే కాకినాడ, రాజమండ్రి సిటీల్లోనే కాదు పలు నియోజకవర్గాల్లో పోలింగు శాతం బాగా వెనుకబడి వుంది. ఇటీవల తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో 83 శాతం, మండల, జడ్‌పీ ఎన్నికల్లో 79 శాతం నమోదయింది. ఇదే ఒరవడి జరగనున్న ఎన్నికల్లో వుంటుందా లేక కమిషన్ తీసుకున్న చర్యలతో పోలింగు శాతం పెరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది.
సర్వం సిద్ధం
Published Wed, May 7 2014 12:46 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement
Advertisement