సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు జట్టుకట్టడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కుదిరితే పొత్తు, లేకుంటే విలీనంతోనే ఎన్నికలకు వెళ్లేందుకు ఇరుపార్టీల పెద్దల మధ్య ఒక మౌఖిక అంగీకారం కుదిరినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ దోస్తీ జిల్లాలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. మెదక్ జిల్లాలో ఆరు అసెంబ్లీ సీట్ల కోసం టీఆర్‌ఎస్ పట్టుబడుతుండగా, ఇందులో నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ వారే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు అత్యంత నమ్మదగిన వ్యక్తుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది.
కొలిక్కివచ్చిన కసరత్తు!
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పార్టీలు వచ్చే సాధారణ ఎన్నికల్లో కలిసే పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయటం, లేదా పొత్తు పెట్టుకోవడం అనే అంశంపై ఇరుపార్టీల నేతల మధ్య వారం రోజులుగా నెలకొన్న హై‘డ్రామా’ ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. వీలైనన్ని ఎక్కువ సీట్లు, రాష్ట్రంలో ‘ముఖ్య’మైన బాధ్యతలు అప్పగించాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. పార్టీని విలీనం చేయమని ఒత్తిడి చేయడం తప్ప.. టీఆర్‌ఎస్ లేవదీసిన అభ్యంతరాలపై కాంగ్రెస్‌నేతలు సమాధానం చెప్పడం లేదు. దీంతో ఆగ్రహంగా ఉన్న టీఆర్‌ఎస్ అధినాయకత్వం బీజేపీతో పొత్తు పెట్టుకుంటామనే బెదిరింపు సంకేతాలను ఇప్పటికే కాంగ్రెస్‌కు పంపింది. దీంతో కలవరపడ్డ కాంగ్రెస్ నేతలు గులాబీ ముఖ్యనేతతో మాట్లాడినట్టు సమాచారం.
శత్రుశేషం లేకుండా చూసుకునేందుకు..
తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా పేరుగాంచిన మెదక్ జిల్లాపైనే కేసీఆర్ ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పైగా ఆయన సొంత జిల్లా కూడా ఇదే కావడంతో టీఆర్‌ఎస్‌కు బలమైన పునాదులు వేసుకోవడంతో పాటు శత్రుశేషం లేకుండా చేసుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందులోభాగంగానే సిద్దిపేట, మెదక్, దుబ్బాక, సంగారెడ్డి, జోగిపేట, గజ్వేల్, అసెంబ్లీ సీట్లు కావాలని కేసీఆర్ డిమాండ్ చేసినట్లు సమాచారం. వీటిలో సిద్దిపేట, మెదక్ మినహా మిగిలిన నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ ఆరు స్థానాలను కోరడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉన్నట్లు సమాచారం.
టీఆర్‌ఎస్ బహిష్కృత నేత, మెదక్ ఎంపీ విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్ల సమాచారం. సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతల మధ్య రాజకీయ శతృత్వం ఉంది. వీలుచిక్కినప్పుడు కేసీఆర్‌పై, ఆయన కుటుంబసభ్యులపై విమర్శల వర్షం కురిపించడంతో పాటు అవసరమైతే కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ఇప్పటికే జగ్గారెడ్డి ప్రకటించారు. అందువల్లే అటు విజయశాంతికి, ఇటు జగ్గారెడ్డికి చెక్ పెట్టాలనే ఆలోచనతోనే మెదక్, సంగారెడ్డి సీట్ల కోసం టీఆర్‌ఎస్ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
దామోదర సీటుకూ గండం
కేసీఆర్ కోరుతున్న టికెట్లలో దామోదర రాజనర్సింహ సీటు కూడా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ తొలి సీఎం దళితుడే ఉంటాడని ప్రకటించిన కేసీఆర్, ఆ ఛాన్స్ దామోదర రాజనర్సింహకు ఇచ్చేందుకు మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే డిప్యూటీ సీఎంగా ఉన్న దామోదర రాజనర్సింహ సీఎం అయ్యేందుకు ప్రయత్నించినా రాష్ట్రపతి పాలనతో ఆ కోరిక నెరవేరలేదు. కానీ రేపొద్దున ఆయన గెలిచి ముఖ్యమంత్రి పదవికోసం దళితకోటాను తెరపైకి వస్తే ప్రమాదముంటుందని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. అందువల్లే, కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటూ టీడీపీ తరఫున అందోల్ టికెట్ ఆశిస్తున్న మాజీమంత్రి, టీడీపీ నేత బాబూమోహన్‌ను టీఆర్‌ఎస్ నుంచి రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం. ఇక సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి సహజ సిద్ధంగానే బలమైన పార్టీ కేడబ్ ఉంది. కాబట్టి ఈ మూడు సీట్లు కూడా తమకే కావాలని గులాబీ నేతలు అడుగుతున్నట్లు సమాచారం.
సిట్టింగులకు ఫిట్టింగ్!
Published Sun, Mar 2 2014 12:13 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement