బద్దలైన సమైక్య సంకెళ్లు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే తేదీలతో సహా నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా. తెలంగాణ రాష్ట్రంలో తిరిగొస్తా. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు సంకెళ్లు బద్దలైనాయి’ అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనే జరుగుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చివరిరోజు అయిపోయిందన్నారు. బిల్లు వ్యవహారం చూస్తున్న ఢిల్లీ ముఖ్యులతో మాట్లాడి వస్తున్నానని, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాతే పార్టీ విలీనం గురించి మాట్లాడుతామని స్పష్టం చేశారు. సీమాంధ్ర నేతలు ఎన్ని కుట్రలు చేసినా సోనియాగాంధీ దయవల్లనే తెలంగాణ వస్తున్నదని, దానికి తెలంగాణ ప్రజలంతా కృతజ్ఞులై ఉంటారని అన్నారు. టీ బిల్లు, ఇతర అంశాల గురించి ఆయన మాటల్లో ...
- ఏదో జరిగిందని తలాతోక లేని ప్రచారం చేస్తున్నరు. అసెంబ్లీలో జరగాల్సిందే జరిగిపోయింది. నిపుణులతో మాట్లాడి వస్తున్నా. తెలంగాణ బిల్లు 100 శాతం ఆమోదం పొందుతుంది.
- సీమాంధ్ర నేతల తీరు అత్యంత విషాదకరం. లంకలో పుట్టినవారంతా రాక్షసులే అని 14 ఏళ్లుగా చెబుతున్నా, అదే మరోసారి రుజువైంది.
- సీఎం స్థాయికి తగినట్టు కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరించలేదు. సీఎం, ప్రతిపక్షనాయకునితో సహా సంకుచిత బుద్ధినే చూపించారు.
- సమైక్య సింహం అంటూ సీఎం కిరణ్‌ను కొన్ని చానళ్లు చూపిస్తున్నయి. ఏం సింహం? తెలంగాణను ఆపుతడా? రాజ్యాంగం ఏం చదివిండు? బిల్లులు ఎక్కడన్నా రెండు ఉంటయా? పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాతనే బిల్లు అయితది. అప్పటిదాకా పూర్తిచేసుకునే అన్ని దశల్లోనూ ముసాయిదా బిల్లుగానే పరిగణిస్తరు. సీఎం కిరణ్‌కు స్క్రూ లూజు అంతే.
- బిల్లులోని కొన్ని అంశాలపై నాకూ వ్యతిరేకత ఉంది. పార్లమెంటులో వాటిని సవరించకుంటే స్వయంగా నేనే సవరణలకోసం పట్టుబడతా.
- శాసనసభకు స్వయం ప్రతిపత్తి ఉందని, రాష్ట్రపతితో సహా ఎవరికీ అధికారం లేదని చంద్రబాబు మాట్లాడినాడట. రాష్ట్రపతి అనుకుంటే ఉఫ్‌మని అసెంబ్లీని రద్దు చేయవచ్చు. లోక్‌సత్తా జేపీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నడు.
- కిరణ్ కిరికిరి, చంద్రబాబు యాగీ పెట్టినా తెలంగాణ బిల్లు ఢిల్లీకి పోయింది. పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ముందుగానే కేంద్ర న్యాయశాఖ, రాష్ట్రపతి భవన్‌లో న్యాయ విభాగం రాజ్యాంగపరమైన అంశాలను చూసుకుంటాయి.
- మెజారిటీ ప్రకారమే జరగాలంటే కొత్త రాష్ట్రాలే రావు. విభజన అధికారం రాష్ట్రాలకే ఉంటే చిన్న ప్రాంతాలకు పెద్ద ప్రాంతాలు అన్యాయం చేస్తూనే ఉంటాయి. విభజనకు మెజారిటీ కావాలంటే మూర్ఖుడు తప్ప సరైనవాడు కాదు.
- సీఎం, రాజ్యాంగబద్దమైన పదవి కావాలని చెప్పలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా నాతో ఉన్నవారంతా ఏం చెబితే అది చేస్తా.
- ఢిల్లీ చాలా స్థిరంగా ఉంది. 15 రోజుల్లో తెలంగాణ వస్తది.
- రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు పెంచేలా బిల్లులో పొందుపరుస్తారు. దీనికి మద్దతిస్తున్నా. 2014 ఎన్నికల తర్వాతే అవి అమల్లోకి వస్తాయి.
- బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలోనే తీర్మానం చేసింది. మాట మార్చడానికి వాళ్లేమన్నా ఆంధ్రా నాయకులా? బీజేపీ మద్దతివ్వదంటున్నవారు శునకానందం పొందుతున్నారు.
- తెలంగాణ అమరవీరులకే రాష్ట్ర ఏర్పాటు అంకితం. వారి ఇంటికో 10 లక్షల పరిహారం ఇస్తా. అర్హులుంటే ఉద్యోగం కల్పిస్తాం.
- 14 ఏళ్లలో మానసికంగా, ఎన్నో రకాలుగా వేధించారు. తట్టుకుని తెలంగాణకోసం నిలబడ్డా. సాధించినా. నాకు జీవిత సాఫల్యం ఇది.
- తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీఆర్‌ఎస్‌కు బలం లేదు. ఆ తరువాత కాంబినేషన్లు ఎలా ఉంటాయో ఇప్పుడెట్లా చెప్పగలను. రాజకీయంగా నా పాత్ర ఏమిటనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది.
నేడు ఢిల్లీకి కేసీఆర్
కేసీఆర్ శుక్రవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పటికే.. ప్రధానితో పాటు పలువురు ఏఐసీసీ ముఖ్యుల అప్పాయింట్‌మెంటును కోరారు. ఫిబ్రవరి 2 లేదా 3న ప్రధాని అపాయింట్‌మెంట్ దొరికే అవకాశముందని భావిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్‌ను కూడా కేసీఆర్ కలువనున్నారు.