
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లోని కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వి.మమత బదిలీని మున్సిపల్ పరిపాలన శాఖ ఒక్కరోజులోనే నిలిపివేసింది. ఆమెను ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వకార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెతోపాటు మరో నలుగురు జీహెచ్‌ఎంసీ పరిధిలోని జోనల్/అదనపు కమిషనర్లను కూడా బదిలీ చేశారు.
అయితే విధుల్లో చేరకముందే బుధవారం సాయంత్రానికల్లా మమత బదిలీని నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా బదిలీ అయిన జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ పంకజను తాజాగా ఎల్.బి.నగర్‌కు మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న స్పెషల్, సెలక్షన్ గ్రేడ్, అదనపు డైరెక్టర్, అదనపు కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయించింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని నగర శివారు జోన్ల కమిషనర్లను తొలుత బదిలీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్‌ను ఖైరతాబాద్‌కు, ప్రధాన కార్యాలయంలో ఉన్న అదనపు కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రియాంకను శేరిలింగంపల్లికి బదిలీ చేశారు. ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌ను నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీచేశారు.
త్వరలోనే మరిన్ని బదిలీలు
రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, ఏ గ్రేడ్ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్ల పనితీరు ఆధారంగా త్వరలో బదిలీల ప్రక్రియ సాగనుందని సమాచారం. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సత్సంబంధాలు కొనసాగించనివారిపై కూడా బదిలీ వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీతోపాటు శివార్లలో కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా స్థానభ్రంశం చెందనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆమోదం కోసం సర్కారుకు ఫైల్ పంపించినట్లు సమాచారం.