బేస్తవారిపేట: ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు పాగాకు మేం సిద్ధమంటూ ముందుకురుకుతున్నారు ఆక్రమణదారులు. అడ్డుకోవల్సిన సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడంతో వీరి భూదాహానికి అంతులేకుండా పోతోంది. బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లె బస్టాండ్ సమీపాన ఒంగోలు-నంద్యాల హైవే రోడ్డుకు పక్కనే ఉన్న విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. మోక్షగుండం, పందిళ్లపల్లె, పూసలపాడు గ్రామాలకు చెందిన పశువుల మేతకు ఉపయోగపడే అసైన్డ్ భూముల్లో రెండు నెలలుగా గిద్దలూరుకు చెందిన ఓ వ్యక్తి యంత్రాలతో రూ.3 కోట్ల విలువైన 25 ఎకరాల అసైన్డ్ భూమిలో చెట్ల తొలగించారు. కొండ మీదున్న వ్యాఘ్ర మల్లేశ్వర దేవస్థానానికి వెళ్లే రోడ్డును ఆక్రమించుకున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో మూడు గ్రామాలకు చెందిన రైతులు పశువుల మేతకోసం పశుగ్రాసం పెంచుకుంటున్నారు. ఈ భూమిని కూడా
వదలకుండా ఆక్రమించేయడంతో పందిళ్లపల్లె సర్పంచి కర్నాటి మోహన్‌రెడ్డి, మోక్షగుండం సర్పంచి కొండసాని గోవిందమ్మలు రెండు నెలల కిందటే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని గతంలో సర్పంచి గోవిందమ్మ రెవెన్యూ కార్యాలయం ఎదుట పశుపోషకులతో కలిసి ధర్నా కూడా చేశారు. అప్పట్లో స్పందించిన రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని చెబూతూ ఆ స్థలంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటు చేసిన మరుసటి రోజు గుర్తు తెలియని వ్యక్తులు బోర్డును పీకేశారు. అక్కడితో ఆగకుండా ఆక్రమణదారులు యంత్రాలతో కొండపైనున్న చెట్లను తొలగించి పొలంలోనే కాల్చి ... ట్రాక్టర్లతో దున్ని నేలను చదును చేసి సవాల్ విసిరినా చర్యలు తీసుకోవల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమించిన 25 ఎకరాల్లో తాజాగా కంచెను ఏర్పాటు చేసేందుకు కూలీలను పెట్టి రాళ్లు పాతిస్తున్నాడు.
మండల సమావేశంలో ప్రస్తావించినా...
అసైన్డ్ భూముల ఆక్రమణల విషయంలో ముగ్గురు సర్పంచులు లిఖిత పూర్వకంగా రెండు నెలల క్రితం చేసిన ఫిర్యాదునూ పట్టించుకోలేదు ... మండల సర్వసభ్య సమావేశంలో అన్యాక్రాంతంపై రెవెన్యూ అధికారులను నిలదీసినా స్పందన లేకపోవడం వెనుక ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలో ఉన్న భూమి రిజస్ట్రేషన్ కార్యాలయం వెబ్‌ల్యాండ్‌లో, రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూములుగా నమోదై ఉంది. ఈ వివరాలతో కోర్టుకు త్వరలోనే వెళ్లనున్నట్లు సర్పంచులు తెలిపారు.
ప్రభుత్వ జాగా వేసెయ్ పాగా
Published Sat, Dec 6 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement