ప్రభుత్వ భూములు, కాల్వలు ఆక్రమిస్తే చర్యలు మంత్రి మహేందర్‌రెడ్డి | Government land, lakes, streams occupay actions should be taken | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూములు, కాల్వలు ఆక్రమిస్తే చర్యలు మంత్రి మహేందర్‌రెడ్డి

Published Mon, Apr 27 2015 12:47 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Government land, lakes, streams occupay actions should be taken

 ఆదిబట్ల: ప్రభుత్వ భూములను, కాల్వలను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం మం డల పరిధిలోని మంగల్‌పల్లి రెవెన్యూ పరిధిలోని కుమ్మరికుంటపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి మహేందర్‌రెడ్డి ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక తహసీల్దార్ లేకపోవడంతో అక్కడే ఉన్న ఆర్‌ఐ బాలకృష్ణ నుంచి వివరాలు సేకరించారు.

మంత్రి తహసీల్దార్‌తోపాటు ఆర్డీవోను సంఘటన స్థలానికి పిలిపించారు. రెవెన్యూ అధికారులు శనివారం నిర్మాణాలను కూల్చివేస్తుండగా మధ్యలో మంత్రి పేషీ నుంచి ఫోన్ వచ్చిందని కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) వచ్చిన వార్తలో వాస్తవం లేదని మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడి భూమిని రెవెన్యూ అధికారులు పట్టా భూమిగా చూపుతుండగా, ఇరిగేషన్ అధికారులు మాత్రం కుంట ఉన్నట్లు చూపుతున్నారు.

ఏది వాస్తవం అనే విషయం తెలుసుకోవడానికి వచ్చినట్లు మంత్రి వివరించారు. మొత్తం 6 ఎకరాల 9 గుంటల భూమిని పట్టా భూమి అని రెవెన్యూ అధికారులు మంత్రికి తెలిపారు. కాగా ఇరిగేషన్ అధికారులు కుంట ఉందని పత్రాల్లో పేర్కొన్నారు. రెండు శాఖల సమన్వయ లేమితో సమస్యలు వస్తాయన్నారు. తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో యాదగిరిరెడ్డిని వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ భూమి అయితే వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు.

తప్పుడు వార్తలు రాసిన
పత్రికపై చర్యలు తీసుకోవాలి..

తప్పుడు వార్తలు రాసిన సదరు పత్రికపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  ఒకవేళ రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లుయితే బాధ్యులను వెంటనే సస్పెండ్ చేస్తామని మంత్రి తెలిపారు. చేతిలో కలం ఉంది కదా అని ఆధారాలు లేకుండా వార్తలు రాయొద్దని ఓ విలేకరికి మంత్రి సూచించారు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో చెరువులను నీటితో నింపి రైతన్నల బాధలను దూరం చేసేందుకు తీవ్రంగా కృషిచేస్తుందని చెప్పారు.

ముందస్తు జాగ్రత్తగా ఏసీపీ నారాయణ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, యాచారం జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, ఎంపీపీ జ్యోతినాయక్, రాందాస్‌పల్లి, మంగల్‌పల్లి, తుర్కగూడ, గ్రామాల సర్పంచ్‌లు ఏనుగుశ్రీనివాస్‌రెడ్డి, కందాళ ప్రభాకర్‌రెడ్డి, కిలుకత్తి అశోక్‌గౌడ్, ఎంపీటీసీలు కొప్పు జంగయ్య, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement