సాక్షి, నెట్‌వర్క్: రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల వాగులు పొంగి ప్రవహించాయి. ఇటీవలి కాలంలో ఈ స్థాయి వర్షాలు పడటం ఇదే మొదటిసారి. కాగా వేడి వాతావరణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు తాజా వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. దాదాపు నెల రోజుల తర్వాత పడిన వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు ఆరుతడి పంటలకు మేలు చేస్తాయని చెబుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు మోస్తరు వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో 38.4 మిల్లీ మీటర్లు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 18.9 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లాలో 10.1 మిల్లీమీటర్లు చొప్పున సగటు వర్షపాతం నమోదయ్యింది. అధికారులు కుమురంభీం ప్రాజెక్టు ఐదో గేటు ఎత్తారు. కడెం ప్రాజెక్టుకు 41,245 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో మూడు వరద గేట్లను ఎత్తి 36,079 క్యూస్కెకుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ఒక్కసారిగా వరద పెరిగి..
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడా–బి గ్రామ సమీపంలోని 353 బి జాతీయ రహదారిపై ఆరు నెలల క్రితం బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో బ్రిడ్జి కింద వాగుపై కొద్ది రోజులుగా తాత్కాలిక వంతెన పనులు కొనసాగుతున్నాయి. ఆదివారం కూలీలు పనులు చేస్తుండగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన ఎనుగందుల రాజలింగు, ధోని సంతోష్ వాగు మధ్యలో చిక్కుకుపోయారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో వారిని బయటకు తెచ్చారు.
పిడుగుపాటుకు గురై యువకుడి మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో అత్యధికంగా 112 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా సిరిసిల్లలో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన పడిగె సతీశ్ (32) పిడుగుపాటుకు గురై మరణించాడు.
మరోవైపు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామ శివారులోని చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం డిస్క్ ఫిల్టర్ పిడుగు పడటంతో దెబ్బతింది. తోకలపల్లి గ్రామానికి శనివారం రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం లైన్ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య, ఏఎల్‌ఎంలు వెంకటేశ్, పరమేశ్‌లు చెరువులో ఈత కొట్టుకుంటూ వెళ్లి డిస్క్ ఫిల్టర్‌ను మార్చి విద్యుత్‌ను పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment