గడువు తొమ్మిది రోజులే
ముకరంపుర: ఖాళీ స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇంటి నిర్మాణాల క్రమబద్ధీకరణకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీ స్థలాలకు సంబంధం లేకుండా ఇళ్లు నిర్మించుకున్న పేద వారికే ఈ అవకాశం పరిమితం చేసింది. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం జీవో నెం.58, 59ల జారీ ద్వారా అవకాశం కల్పించింది. జీవోలను డిసెంబర్ 30 న విడుదల చేసినప్పటికీ రెండు రోజుల క్రితమే మార్గదర్శకాలను జారీ చేసింది.
జిల్లాలో ఇంతవ రకూ ఒక్క దరఖాస్తు కూడా నమోదు కాలేదు. ఈ నెల 19 వరకు తుది గడువుండగా ఆక్రమణలపై.. నిర్మాణాలపై ఎవరూ ముందుకు రాలేదు. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో ఆక్రమిత నిర్మాణాలున్నప్పటికీ ఇప్పటికీ వరకు స్పందన లేకపోవడంపై అధికారులు సమాలోచన చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్. మీనా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించాలని ఆదేశించారు. దరఖాస్తు ఫారాలను అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
అర్బన్ ప్రాంతాలే కీలకం..
పేదల ఆక్రమిత నివాస స్థలాల్లోని ఇండ్ల రెగ్యులరైజేషన్‌లో అర్బన్ ప్రాంతాలే కీలకం కానున్నాయి. జిల్లాలోని 11 పట్టణ ప్రాంతాల్లోనే రెగ్యులరైజేషన్‌కు దరకాస్తులు వచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలో ఆక్రమిత భూముల వివరాలు ప్రజలు దరఖాస్తు ద్వారానే తెలుసుకునే పరిస్థితి రావడం జిల్లా యంత్రాంగం పనితీరుకు అద్దం పడుతోంది. అయితే ఆక్రమిత నిర్మాణం చేసి తప్పు చేసిన భావనతోనే దరఖాస్తులకు ముందుకు రాకపోవడానికి కారణంగా తెలుస్తోంది.
రెగ్యులరైజేషన్ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించదని జీవో స్పష్టం చేస్తోంది. క్రమబద్ధీకరణకు ఆర్డీవోలు, తహశీల్దార్లనే బాధ్యులు చేశారు. దరఖాస్తులు చేసుకున్న 90 రోజుల్లో ఆ ఇంటికి సంబంధించి మహిళ పేరున పట్టాజారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు. ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలు, శిఖం, నాలాలు, కుంటలు, చెరువులు, పూర్తి నీటి మట్టం పరిధిలోనివి, నీటి ట్యాంకులు, నీటి శుద్ధి ప్రాంతాలు, శ్మశానాలు, మోడల్ టౌన్‌షిప్‌లకు ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాలు, కాలిబాటలు, అత్యంత విలువైన స్థలాలు, నీటి శుద్ధిప్లాంట్లు, గ్రీన్‌బెల్ట్ స్థలాలు, బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలను మినహాయించారు. చారిత్రాత్మక వారసత్వ భవనాలు, కట్టడాలు ఉన్న ప్రాంతాల్లోని వాటిని క్రమబద్ధీకరించడం జరిగిందని ప్రభుత్వం నిబంధనల్లో స్పష్టంగా పేరొన్నారు.
ఇదీ టారిఫ్..
125 గజాల స్థలం వరకు ఉచితంగా, 250 గజాలలోపు ఉన్న స్థలానికి బేసిక్ వాల్యూ ప్రకారం 50 శాతం కట్టించుకుని క్రమబద్ధీకరించనున్నారు. 500 గజాల స్థలం వరకు నిబంధనల 75 శాతం డీడీ తీసి దరఖాస్తుతో పాటు జతపర్చాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2వ తేదీ 2014 వరకు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉన్న వారికే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ఈ పథకంలో లబ్ధిపొందాలంటే పట్టణాల్లో రూ.2 లక్షలు, పల్లెల్లో రూ.1.5 లక్షల ఆదాయం లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. ఇంకా భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, కరెంటుబిల్లు, నల్లా బిల్లు, ఇంటి పర్మిషన్ పత్రం వీటిలో ఏదో ఒకటి జతచేసి తహశీల్దార్ కార్యాలయంలో అందించాల్సి వుంటుంది.
గడువు పెంచండి..
ఆక్రమిత నివాసస్థలాలోని ఇండ్ల రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువు మరింత పెంచాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. శుక్రవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్‌మీనాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మిగిలిన కలెక్టర్లు కూడా ఇదే సమస్యను విన్నవించారు. ఈ నెల 19 లోపు సెలవులు అధికంగా ఉన్నాయని.. మరింత గడువు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు బీఆర్ మీనా మాట్లాడుతూ జిల్లాలోని సింగరేణి తదితర సంస్థలకు ప్రభుత్వం కేటాయించిన భూములలో నివాసం ఉంటున్న వారి క్రమబద్ధీకరణ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.