నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్ చెక్కును అందజేస్తున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ సాహసించని రీతిలో అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఇంటి స్థలం, ఇల్లు రూపంలో ప్రతి నిరుపేద అక్కచెల్లెమ్మకు రూ.20 లక్షల వరకు విలువైన ఆస్తిని ఇవ్వగలిగే గొప్ప అవకాశాన్ని దేవుడు తనకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద 4,07,323 మంది లబ్ధిదారులకు బ్యాంకు రుణాలపై వడ్డీని రీయింబర్స్ చేస్తూ రూ.46.90 కోట్ల మొత్తాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు.
అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ..
దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులైన 12,77,373 మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.35 వేలు చొప్పున పావలా వడ్డీకే రుణాలిప్పించాం. వాటికి సంబంధించి తొలి దఫాలో 4,07,323 మందికి పావలా వడ్డీ కింద ఇవాళ సుమారు రూ.47 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ఈ కార్యక్రమం చేపడతాం. గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు విడుదల చేసినప్పుడు 5,43,140 మందికి దాదాపు రూ.54 కోట్లు విడుదల చేశాం.
ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేస్తూ పావలా వడ్డీకే రూ.35 వేలు రుణం అందించడం ద్వారా ఇళ్ల నిర్మాణం పురోగతిని వేగవంతం చేస్తున్నాం. బ్యాంకుల దగ్గర నుంచి పొందిన రుణాలను 9 నుంచి 11 శాతం వరకు వడ్డీతో తిరిగి చెల్లించే కార్యక్రమం అక్కచెల్లెమ్మలు సక్రమంగా చేయాలి. అది వారి బాధ్యత. అలా అక్కచెల్లెమ్మలు కట్టిన వడ్డీ సొమ్మును తిరిగి వారికి అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ క్రమంలో అక్కచెల్లెమ్మలకు నికరంగా రూ.35 వేలపై పావలా వడ్డీ మాత్రమే పడుతుంది.
విలువైన స్థిరాస్తి..
రాష్ట్రంలో ఇప్పటికే 22.25 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎక్కడా, ఎప్పుడూ చూడని విధంగా చేపడుతున్నాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.2.70 లక్షలు ఖర్చవుతుంది. మరో రూ.లక్ష మౌలిక సదుపాయాల కోసం అదనంగా ఖర్చవుతుంది. ఇంటి నిర్మాణం, మౌలిక వసతుల కోసం దాదాపు రూ.3.70 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1.80 లక్షలు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. మరో రూ.35 వేలు పావలా వడ్డీకి రుణాలను అందుబాటులోకి తెచ్చాం. దాదాపు రూ.15 వేలు ఖరీదు చేసే ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నాం.
సిమెంట్, మెటల్ ఫ్రేమ్స్ లాంటి వివిధ రకాల నాణ్యమైన వస్తువులను మార్కెట్ ధర కన్నా తక్కువకు సబ్సిడీపై అందించడం ద్వారా రూ.40 వేల దాకా ప్రయోజనం చేకూరుస్తున్నాం. మనం ఇచ్చిన ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి కొన్ని జిల్లాల్లో రూ.15 లక్షల పైచిలుకు ఉంది. ఈ విలువ మీద ఇళ్లు, మౌలిక సదుపాయాల విలువలను కలిపితే ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఆస్తిని తోబుట్టువుగా సమకూరుస్తున్నాం.
► కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ షర్మిలారెడ్డి, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, ప్రత్యేక కార్యదర్శి బి.ఎండీ.దీవాన్ మైదిన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్ లక్ష్మీ షా, సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కోటిమంది.. జయహో జగనన్నా
పిల్లాపాపలతో కలిపి సుమారు కోటిమంది అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా కల్పిస్తున్న గొప్ప యజ్ఞం జగనన్న ఇళ్ల నిర్మాణం. ఒక గ్రామం ఏర్పడాలంటే సుమారు 50 నుంచి 100 సంవత్సరాలు పడుతుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రెండున్నర ఏళ్లలో 17 వేల జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లను నిర్మించడం ఇదే ప్రథమం. ఇది దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
సీఎం జగన్‌కు మినహా మరెవరికీ ఇది సాధ్యం కాదు. ప్రభుత్వం 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటికే 9 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తై నిరుపేద మహిళలు పిల్లాపాపలతో సంతోషంగా జీవిస్తున్నారు. కోటిమంది జయహో జగనన్నా అని నినదిస్తున్నారు. పేదలకు పక్కా గూడు కల్పించే ఈ మహా యజ్ఞం ఎంత మంది మారీచులు అడ్డుపడినా ఆగదు.
– జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖా మంత్రి
ఓ ఆడబిడ్డకు ఇంకేం కావాలి?
ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఇంటి కోసం తిరిగి తిరిగి అలిసిపోయా. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకోగానే స్థలం మంజూరైంది. వెంటనే పట్టా ఇచ్చారు. విశాఖలో అడుగు భూమి లేని నాకు ఈ రోజు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన స్ధలాన్ని, ఇంటిని కూడా అందించారు. ఇదంతా నమ్మలేకపోతున్నా.
మాకిచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎన్నో విధాలుగా అండగా నిలిచారు. బ్యాంకు ద్వారా పొందిన రుణానికి వడ్డీ కూడా మీరే కడుతున్నారు. కాలనీలో రోడ్లు, కరెంట్, నీళ్లు అన్నీ ఇచ్చారు. ఒక ఆడపిల్లకు అన్నగా మీరు (సీఎం జగన్) చేయాల్సిందంతా చేశారు. ఇంతకంటే ఏం కావాలి? మా పాపకు అమ్మ ఒడి వస్తోంది. నేను పొదుపు సంఘం ద్వారా లబ్ధి పొందా. కరోనా సమయంలో ఎంతో ఆందుకున్నారు. మళ్లీ మీరే మాకు సీఎంగా రావాలి.
– హైమావతి, లబ్ధిదారు, విశాఖపట్నం
ద్వారకను తలపించేలా కాలనీలు
మేం తమిళనాడు నుంచి ఇక్కడ స్థిరపడ్డాం. గుంటూరు జిల్లా పేరేచర్ల జగనన్న కాలనీలో నాకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం విలువ రూ.10 లక్షలు ఉంటుంది. దానికి తోడు ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేశారు. ఎన్ని జన్మలెత్తినా మీ (సీఎం జగన్) రుణం తీర్చుకోలేం. కాలనీలో కరెంటు, రోడ్లు, వాటర్ అన్ని సౌకర్యాలున్నాయి. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇచ్చారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నా. మా కాలనీలో లైటింగ్, ఆర్చ్ గేట్ కట్టారు. లైటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. అప్పట్లో శ్రీకృష్ణుడు ద్వారక కట్టిస్తే అన్ని కులాలు కలిసి బతికేవారట.
ఇప్పుడు జగనన్న కాలనీలు కూడా ద్వారక లాంటివే. తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు మాకు జీవితమిచ్చారు. మీలాంటి సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదు. మా పిల్లలను స్కూల్‌కు పంపితే అన్నీ ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్‌లో చదివిస్తున్నానని గర్వంగా చెబుతున్నా. మా ఇంట్లో రేషన్ బియ్యం తింటాం. రేషన్ బండి ఇంటి ముందుకే వస్తోంది. ఏ ప్రయాస లేకుండా సరుకులు తీసుకుంటున్నాం. మిమ్మల్ని మళ్లీ గెలిపించుకుంటాం జగనన్నా.
– పగడాల స్వర్ణ సింధూర, లబ్ధిదారు, గుంటూరు
మీ సంకల్పం గట్టిది
పదేళ్లు అద్దె ఇంట్లో ఉన్నాం. కిరాయి కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాం. మీరు తెచ్చిన సచివాలయాల వ్యవస్థతో రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటి స్థలం ఇచ్చారు. సొంతిల్లు కట్టుకునేందుకు రూ.35 వేలు బ్యాంకు రుణం అందించారు. ఆ వడ్డీ భారం మాపై పడకుండా మీరు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్. నా ఇంటి స్థలం ఇప్పుడు రూ. 5 లక్షలు ఉంది. భవిష్యత్‌లో రూ.10 లక్షలు కూడా కావచ్చు. ఈ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు కూడా మంజూరైంది.
ఏ పథకం కావాలన్నా సులభంగా అందుతోంది. మా పాపకు అమ్మ ఒడి వస్తోంది. మా అత్తయ్య చేయూత డబ్బులతో చీరల వ్యాపారం చేస్తోంది. మామకు వృద్ధాప్య పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నారు. గతంలో పింఛన్ కోసం ఎంతో ప్రయాసలు పడ్డాం. పేద మహిళ లక్షాధికారి కావాలన్న మీ (సీఎం జగన్) సంకల్పం గొప్పది. మీ ద్వారా నా కుటుంబం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లబ్ధి పొందింది.
– వహిదా ఖానం, లబ్ధిదారు, కడప
Comments
Please login to add a commentAdd a comment