ఫుల్‌ స్పీడ్‌తో ఇళ్లు | CM YS Jagan Mandate Officials On Housing Scheme Poor People | Sakshi
Sakshi News home page

ఫుల్‌ స్పీడ్‌తో ఇళ్లు

Published Tue, Aug 2 2022 2:45 AM | Last Updated on Tue, Aug 2 2022 3:22 PM

CM YS Jagan Mandate Officials On Housing Scheme Poor People - Sakshi

రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించి అందచేసే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ నిధులు సక్రమంగా విడుదల చేస్తున్నాం. పేదల గృహ నిర్మాణ పనులను వేగంగా కొనసాగించాలి. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాల్లో వేగం మరింత పెరగాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. విశాఖలో ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఇచ్చిన నేపథ్యంలో గృహ నిర్మాణాలను త్వరగా చేపట్టాలని నిర్దేశించారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో కనీస సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..

అర్హులందరికీ ఇవ్వాల్సిందే..
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇటీవలే విశాఖలో 1.24 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. ఈ ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలి. ఇళ్ల నిర్మాణంతోపాటు వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో సమాంతరంగా కనీస సదుపాయాల కల్పన పనులపై దృష్టి పెట్టాలి. డ్రైనేజీ, నీరు, విద్యుత్తు లాంటి కనీస సదుపాయాలు కల్పించాలి. ప్రతి దశలోనూ నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు.

కాలనీల్లో ఇంకా ఎక్కడైనా ల్యాండ్‌ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులు మిగిలిపోతే వేగంగా పూర్తి చేయాలి. ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లు లేఅవుట్లలో ఇటుకల తయారీ యూనిట్లు, ఇతర ఏర్పాట్లు చేసుకున్నారో లేదో పర్యవేక్షించాలి. లబ్ధిదారుల సహాయార్థం టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలి. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు కేటాయించిన స్థలాన్ని నిర్దిష్టంగా చూపించి పట్టా, సంబంధిత డాక్యుమెంట్లన్నీ అందచేయాలి. ఇళ్ల పట్టాల మంజూరులో ఎలాంటి జాప్యం జరగటానికి వీల్లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం మంజూరు కావాల్సిందే.
సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సర్వ సదుపాయాలతో టిడ్కో ఇళ్లు
పట్టణ పేదల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను పూర్తి సదుపాయాలతో లబ్ధిదారులకు అందించాలి. లబ్ధిదారుల పేర్లతో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇప్పటికే 75 వేల ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మరో 73 వేల ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలి. మొత్తం 1.48 లక్షల ఇళ్లను లబ్ధిదారుల పేర్లతో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి.

లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి. నిర్మాణాల్లో పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేస్తాం. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలి. టిడ్కో ఇళ్ల నిర్వహణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. నిర్వహణ మెరుగ్గా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలి.

వేగంగా ఆప్షన్‌ 3 ఇళ్ల నిర్మాణం
విశాఖలో పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అక్టోబరు చివరి నాటికి మొదలవుతాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో పనుల ప్రగతిపై సమీక్ష, సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని అక్కడ నుంచే కల్పించినట్లు తెలిపారు. 15 నుంచి 20 రోజుల్లోగా 1.4 లక్షల టిడ్కో ఇళ్లు అన్ని సదుపాయాలతో సిద్ధమవుతాయని వెల్లడించారు. ఇళ్ల స్థలాల కోసం అందిన దరఖాస్తులను పరిష్కరించి 2,03,920 మందిని అర్హులుగా నిర్ణయించి ఇప్పటికే లక్ష మందికి పట్టాలు అందచేసినట్లు వెల్లడించారు.

మిగతా వారికీ ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ దొరబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్షి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్‌ గుప్తా,  సీసీఎల్‌ఏ కార్యదర్శి ఏ.బాబు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement