సాక్షి, అమరావతి: నిర్దేశించుకున్న సమయంలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గూడు లేని లక్షలాది మంది నిరుపేదలకు గృహ యోగం కల్పించాలనే గొప్ప సంకల్పంతో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన ఈ పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో ఇప్పటి వరకు 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, 17.77 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేసినట్టు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోందన్నారు. వైఎస్సార్– జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వసతుల కల్పనకు ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం చేశామని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఏమన్నారంటే..
నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ పథకం కోసం రూ.5,655 కోట్లు ఖర్చు చేశాం. ఇళ్ల నిర్మాణ ప్రగతిపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. సమీక్షించాలి. లేఅవుట్‌లలో పర్యటించాలి. ఇలా చేయడం ద్వారా మరింత వేగంగా నిర్మాణాలు చేపట్టడానికి చర్యలు తీసుకోవచ్చు.
► లేఅవుట్‌లను సందర్శించినట్టుగా అధికారులు ఫొటోలను హౌసింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రతి శనివారం హౌసింగ్ డే గా నిర్వహిస్తున్నారు. ఈ ఒరవడిని అలాగే కొనసాగించాలి. వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. హౌసింగ్ డే రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లేఅవుట్‌లకు వెళ్లాలి. వీటితో పాటు పేదలకు ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్న ఆప్షన్–3 ఇళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి.
నాణ్యతలో రాజీపడొద్దు
► ఇళ్ల నిర్మాణ నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దు. ప్రతి దశలోనూ నాణ్యత నిర్ధారణ పరీక్షలు చేపట్టండి. నాణ్యత ప్రమాణాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) పాటిస్తూ ముందుకు వెళ్లండి. వార్డు, గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలను గృహ నిర్మాణ పథకం కోసం విస్తృతంగా వాడుకోవాలి. నాణ్యత ప్రమాణాలు పాటించే అంశంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ భాగస్వామ్యం ఉండాలి.
► లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సమయానికి విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. అనంతరం మిగిలిన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ముందుకు వెళ్లాలి. ఈ క్రమంలో లేఅవుట్‌ల వారీగా ప్రాధాన్యత పనులు గుర్తించండి. వాటిని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయండి.
► ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి ఇంతియాజ్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, గృహ నిర్మాణ సంస్థ జేఎండీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిర్దేశించిన గడువులోగా ఇళ్ల నిర్మాణం
Published Fri, Nov 25 2022 3:38 AM | Last Updated on Fri, Nov 25 2022 3:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment