empty places
-
స్థలాలకు అద్దె వల.. రూ.3 లక్షలు పెడితే 6 లక్షలు.. 'రియల్' దగా..
‘‘మా ఫామ్‌ల్యాండ్‌లో రూ. 3 లక్షలుపెట్టి రెండు గుంటలు (242 గజాలు) కొంటే ప్రతి నెలా రూ. 15 వేల అద్దె చొప్పున 20 నెలల తర్వాత రూ. 3 లక్షల అసలు సహా మొత్తం రూ. 6 లక్షలు చెల్లిస్తాం. 4 గుంటల స్థలానికి రూ. 6 లక్షలు చెల్లిస్తే ప్రతి నెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ. 12 లక్షలు ఇస్తాం. 8 గుంటలకు రూ. 12 లక్షలు కడితే నెలకు రూ. 24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తాం’’ హైదరాబాద్‌కు 140 కి.మీ. దూరంలోని నారాయణ్‌ఖేడ్‌లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్‌ల్యాండ్ వెంచర్ పేరిట వినియోగదారులను ఆకర్షించేందుకు జోరుగా సాగిస్తున్న ప్రచారం ఇది. ప్రీలాంచ్ పేరిట గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో కొందరు బిల్డర్లు వేలాది మంది మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను కల్లలు చేసి సొమ్ము చేసుకుంటుంటే తాజాగా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాళీ స్థలాలను వెంచర్ల పేరు చెప్పి బై బ్యాక్, రెంటల్ ఇన్‌కం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి కొత్త పేర్లతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏడాదిలో అద్దె సహా కట్టిన సొమ్మును వాపసు చేస్తామంటూ నమ్మించి ఫామ్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ. 5 వేలు కూడా పలకని ప్రాంతంలో గజం రూ. 10 వేలకుపైనే విక్రయించి ముందే డబ్బు వసూలు చేసుకుంటున్నారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు, రెరాలో నమోదు చేసుకోకుండానే వెంచర్లలో ప్లాట్లను విక్రయిస్తున్నారు. నమ్మకస్తులే మధ్యవర్తులుగా.. గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతి నెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు. అసలుకు రెట్టింపు ఆశ చూపి... చట్ట నిబంధనల ప్రకారం ఫామ్‌ల్యాండ్ వెంచర్లను రియల్ ఎస్టేట్ సంస్థలు కనీసం అర ఎకరం, ఆపై మొత్తాల్లోనే విక్రయించాలి. అయితే అంత విస్తీర్ణంలోని భూముల ధరలు రూ. పదుల లక్షలు, ఆపైనే ఉంటాయి కాబట్టి సామాన్యులు అంత డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఆయా సంస్థలు ఫామ్‌ల్యాండ్ వెంచర్లను గజాలు లేదా గుంటల లెక్కన విక్రయిస్తున్నాయి. నిరీ్ణత కాలం తర్వాత అసలుకు రెట్టింపు డబ్బు ఇస్తామని ఆశ చూపుతూ వినియోగదారులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల మాత్రం అధికారులకు లంచాలు ఇచ్చి ఆ స్థలాలను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఒకవేళ అగ్రిమెంట్ గడువు తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమై సంస్థ డబ్బు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోయినా లేదా కంపెనీ బోర్డు తిప్పేసినా కొనుగోలుదారులే మోసపోతున్నారు. తమకు కొసరు ఇవ్వకపోయినా పరవాలేదు అసలు సొమ్ము ఇస్తే చాలంటూ సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనిపై చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకాడుతున్నారు. అలా చేస్తే తమ పేర్లు బయటపడటంతోపాటు ఆయా సంస్థలు కోర్టులోనే తేల్చుకోమంటాయేమోనని భయపడుతున్నారు. ఈ పట్టణాల్లో కుప్పలుతెప్పలుగా... సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి హైదరాబాద్ నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్టులు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నాయి. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్ఫ్రాకాన్, జయ గ్రూప్, ఫార్చ్యూన్ 99 తదితర సంస్థలు ఈ మోసాలకు పాల్పడుతున్నాయి. బై బ్యాక్ పేరుతో మోసపోయా... జనగాం జిల్లాలోని పెంబర్తిలో 11 ఎకరాలలో ఓ సంస్థ వేసిన వెంచర్లో బై బ్యాక్ స్కీమ్ కింద రూ. 20 లక్షలకు 183.33 గజాల స్థలం కొన్నా. 12 నెలల తర్వాత లాభం రూ. 10 లక్షలు, మొదట్లో నేను కట్టిన రూ. 20 లక్షలు కలిపి మొత్తం రూ. 30 లక్షలు తిరిగి చెల్లిస్తామని సంస్థ నాతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఏడాది దాటినా సొమ్ము చెల్లించడం లేదు. – ఓ బాధితుడి ఆవేదన. స్కీమ్‌లలో తీసుకొని మోసపోవద్దు... ప్రీలాంచ్, బై బ్యాక్, రెంటల్ గ్యారంటీ అంటూ రకరకాల పేర్లతో సామాన్యులను కొందరు వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. టీఎస్–రెరా, నిర్మాణ అనుమతులు లేని ఏ ప్రాజెక్ట్‌లలోనూ ప్రజలు స్థలాలు కొనుగోలు చేయకూడదు. రెరా రిజి్రస్టేషన్ లేని మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదు. –విద్యాధర్, సెక్రటరీ, టీఎస్–రెరా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి... రియల్టీ మార్కెట్‌ను స్కీమ్‌ల పేరుతో కొందరు బిల్డర్లు చెడగొడుతున్నారు. స్థలం కొనుక్కోవాలనుకొనే సామాన్యుల ఆశలను ఆసరా చేసుకొని మోసం చేస్తున్నారు. స్కీమ్‌ల పేరుతో విక్రయించే స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సునీల్ చంద్రారెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ చదవండి: బీఆర్ఎస్.. బందిపోట్ల రాక్షసుల సమితి -
ఖాళీ స్థలాలు..ఇక బ్యూటీ స్పాట్స్!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖాళీ స్థలాలు ఇక బ్యూటీ స్పాట్లుగా మారనున్నాయి. ఇవి చెత్త డంప్‌లుగా మారకుండా సర్వాంగ సుందరంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు ఖాళీ స్థలాల్లో సైతం చెత్తను వేయకుండా కట్టడి చేసేందుకు ఒక బృహృత్తర ప్రణాళిక రూపొందించింది. ముందుగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు వాటి చుట్టూ కీపాండ్ వాల్స్ నిర్మాణం చేపట్టి అందమైన పూల మొక్కలు, షో చెట్లు పెంచాలని నిర్ణయించింది. ఇందులో స్థానికుల సహాయ సహకారాలు, భాగస్వామ్యం ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. దీంతో విలువైన స్థలాలను పరిరక్షించడంతో పాటు వీటిని ఆట స్థలాలు, పార్కులుగా అభివృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు వీలవుతుందని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఈమేరకు ఆయా స్థలాల సుందరీకరణపై నెలరోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చాలా ప్రాంతాఆల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో చెత్తను వేయడం ద్వారా అవి మురికి, చెత్త డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. ఫలితంగా దోమల ఉత్పత్తికి కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ ఖాళీ స్థలాలో వేసే డంపింగ్ పై నగర వాసుల నుంచి పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందడం సర్వసాధారణంగా మారాయి. నేటి నుంచి సుందరీకరణ మాసం నగరంలోని ఖాళీ స్థలాల సుందరీకరణ కోసం ఒక నెల రోజులు ప్రత్యేకంగా కేటాయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఖాళీ స్థలాల సుందరీకరణ మాసంగా పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి డిప్యూటి, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నగరంలోని తమ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని, వాటిలో జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలు అయితే వెంటనే ప్రహారీ గోడలను తగు అనుమతితో నిర్మించి మొక్కలను నాటించడం, మంచి ప్లే గ్రౌండ్లుగా మార్చాలని ఆదేశించారు. ఖాళీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి అయితే ఆ స్థలం యజమానులను పొరుగువారితో కలిసి గుర్తించనున్నారు. ఆయా గుర్తించిన ఖాళీ స్థలాల్లో తిరిగి చెత్త వేయకుండా బోర్డులను ప్రదర్శిస్తారు. ఖాళీ స్థలాల ఇంటి యజమానులతో ప్రహరీ గోడలను నిర్మించే విధంగా చర్యలు చేపట్టి తిరిగి ఎవ్వరు కూడా చెత్తను వేయకుండా పొరుగు ఇంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ప్రతి ఖాళీ స్థలాలను ఒక జవాను లేదా ఎస్.ఎఫ్.ఏ లేదా ఇతర కార్మికుడిని ఇన్చార్జిగా నియమిస్తారు. ఎవ్వరూ కూడా చెత్త వేయకుండా నిరోధిస్తారు. అదేవిధంగా ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం వల్ల అధికంగా సమస్యలు ఎదుర్కొనే వారిని గుర్తించి వారిని స్వచ్ఛ రాయబారిగా నియమించనున్నారు. ఈ ఖాళీ స్థలాలు పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటే పార్కింగ్ ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. -
ముళ్లపొదల తొలగింపు
గద్వాల క్రైం : నివాసగృహాల మధ్య ఖాళీ ప్లాట్లు.. అందులో పిచ్చి మొక్కలు.. దట్టంగా ముళ్లపొదలు.. ఇలా గృహనివాసాల మధ్య ఏపుగా పెరిగిన చెట్లతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ప్లాటు యజమానికి చెప్పినా పట్టించుకోపోవడంతో పట్టణంలో హౌసింగ్ బోర్డు, రెండో రైల్వే గేట్, బీసీ కాలనీ, గంజిపేట, చింతలపేట తదితర కాలనీలో ఖాళీ ప్లాట్లలో ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. ∙ప్రజల రక్షణ, శాంతిభద్రతల నిమిత్తం గద్వాల పోలీసులు వినూత్నంగా వివిధ కాలనీలో ఖాళీ స్థలం, ప్లాట్లలో మొలిచిన ముళ్లపొదల తొలగింపుపై దృష్టిసారించారు. వివిధ కాలనీల్లో ఖాళీ ప్లాట్లు ఉన్న వివరాలు సేకరించి ముళ్లపొదలు తొలగించాల్సిందిగా యా జమానులకు తెలియజేస్తున్నారు. వారు చెప్పినా.. యాజమానులు తొలగించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. జేసీబీల సాయంతో పట్టణంలోని అన్నికాలనీల్లో ముళ్లపొదల తొలగింపు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా ఆ ప్లాట్లలో ముళ్లపొదలు తొలగించని వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కాలనీ ప్రజల శ్రేయస్సు దిశగా.. పట్టణంలో వివిధ కాలనీలో ముళ్లపొదలను తొలగించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా గద్వాల మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు తెలియజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పట్టణంలో ఎటు చూసినా చెత్తచెదారం, ముళ్లపొదలతో నిండిపోయింది. నోటీసులు జారీ చేస్తున్నాం పట్టణంలోని ఖాళీ స్థలాల్లో ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఉండటంతో అనుకోని సంఘటనలు జరిగిన సందర్భంలో ముళ్లపొదలలో దాగి తప్పించుకునే వీలుంటుంది. ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉంటున్నాయి. పలు సమస్యలు ఉత్పన్నమయే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఖాళీ స్థలాల్లో ఏర్పడిన ముళ్లపొదలు తొలగిస్తున్నాం. ఇప్పటికే పలువురు యజమానులకు నోటీసులు జారీ చేశాం. ఆదేశాలను బేకాతరు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ -
కబ్జా కోరల్లో ఖాళీ స్థలాలు
– బాలసముద్రం లే ఔట్లో రిజిస్ట్రేషన్‌పై అనుమానాలు – సుబేదారి పోలీసుస్టేçÙన్లో ఐదుగురిపై బల్దియా ఫిర్యాదు – ఇంకా వెలుగులోకి రాని రూ.వందల కోట్ల విలువైన స్థలాలు వరంగల్ అర్బన్l: వరంగల్ మహా నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు పాగా వేస్తున్నారు. అయితే, ఇందులో ప్రైవేట్ స్థలాలు ఉంటే వాటి యజమానులు కేసులు పెట్టి న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. మరి ప్రభుత్వ భూములైతే కాపాడుకోవాల్సిన బల్దియా అధికారులకు మాత్రం ఇదేమీ పట్టడం లేదు. ట్రై సిటీలో లే ఔట్ ఖాళీ స్థలాలు అనాదిగా ఆక్రమణకు గురవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా బాలసముద్రంలోని లే ఔట్ స్థలం ఆక్రమణపై బల్దియా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆక్రమణలపై ఎప్పటికప్పుడు మేల్కొనపోతే మరికొన్ని స్థలాలు కబ్జాకోరల్లో చిక్కుకోవడం ఖాయమనే వాదనలు వినవస్తున్నాయి. డీజీఐఎస్ ద్వారా గుర్తింపు బల్దియాకు సంబంధించి లే ఔట్ స్థలాలను డిజిటల్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(డీజీఐఎస్) సిస్టమ్ ద్వారా గుర్తించాలని ఏడాది క్రితం కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను అదేశించారు. అంతేకాకుండా 1947 నుంచి 2014 చివరి నాటికి ట్రైసిటీ పరిధిలోని లే ఔట్ స్థలాల మ్యాపులు, వివరాలను హైదరాబాద్‌లోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ నుంచి తెప్పించారు. మ్యాపులను స్కాన్ చేసి, డీజీఐఎస్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తున్నారు. దీంతో మొత్తం 657 లే ఔట్ ఖాళీ స్థలాలు ఉన్నట్లు లెక్క తేలింది. అయితే, బల్దియా రికార్డుల్లో కేవలం 163 లే ఐట్ ఖాలీ స్థలాల వివరాలే ఉండడం గమనార్హం. ఈ మేరకు మిగిలిన 493 స్థలాలను గుర్తించి నివేదిక రూపంలో సమర్పించాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ అదేశించారు. అలాగే, విలీన గ్రామాల్లోని లే ఔట్ స్థలాలు, భవనాలు, ఖాళీ స్థలాలు, కార్యాలయాల వివరాలను సేకరించాలని ఆదేశించడంతో రెండు నెలల ఆస్తుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. వివాదాల్లో విలువైన స్థలాలు బల్దియా పరిధిలోని పలు కాలనీల్లో ఉన్న స్థలాలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి. బల్దియా పరిధిలోని ట్రైసిటీలో 40 నుంచి 60 స్థలాలపై కబ్జాదారులు కన్నేసినట్లు సమాచారం. బాలసముద్రంలోని 15 స్థలాలు ఉండగా, అందులో చాలా మేరకు కబ్జాకు గురయ్యాయి. ఎక్సైజ్ కాలనీలో 10 లే ఔట్ ఖాళీ స్థలాలు ఉండగా.. ఇందులో ఆరు నుంచి ఏడు స్థలాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. బల్దియా, ‘కుడా’ అధికారుల సమన్వయ లోపంగా కారణంగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి బల్దియా స్థలాలు చేరాయి. అదే విధంగా సుబేదారి జేసీ క్యాంపు కార్యాలయం వెనుకాల రూ.కోట్ల విలువైన లే ఔట్ స్థలంపై ప్రైవేట్ వ్యక్తులు కన్నేశారు. కొందరు అధికారులు అండదండలతో ఆ స్థలంలో కొంతభాగం కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. ఫారెస్టు ఆఫీస్ సమీపంలోని 500 గజాల స్థలానికి సంబంధించి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రియల్ వ్యాపారుల చేతిలోకి వెళ్లినట్లు సమాచారం. ఇక వరంగల్ ఉర్సు సుభాష్ నగర్, రంగశాయిపేటల్లో పార్కు స్థలాన్ని కొంత మంది అక్రమించుకోగా, కరీంనగర్ ప్రధాన రహదారి సమీపంలోని ఒక నాయకుడు.. బల్దియా లే ఔట్‌కు సంబంధించి ఆరు ఖాళీ స్థలాలను విక్రయించారని తెలుస్తోంది. 1066 సర్వేనంబర్‌లో రిజిస్ట్రేషన్లు హన్మకొండ బాలసముద్రంలో ఐదు దశాబ్దాల క్రితం లే ఔట్ చేశారు. దీనికి సంబంధించి 1066 సర్వే నంబర్లో 15 ఖాళీ స్థలాలు ఉన్నాయి. 2010–11 సంవత్సరంలో బల్దియా బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా కరుణాకర్ ఉన్న సమయంలో 200 గజాల చొప్పున నలుగురి పేరిట 800 గజాల స్థలం రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు బల్దియాలో కనిపించడం లేదు. తాజాగా ఈ విషయం బయట పడడంతో మేయర్ నన్నపునేని నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలతో బల్దియా టౌన్ ప్లానింగ్ ఇన్చార్జ్ సీపీ కోదండరాంరెడ్డి, ఏసీపీ శైలజలు సుబేదారి పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. కొనుగోలుదారులుగా భావిస్తున్న నలుగురితో పాటు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా గతంలో ఏకశిలా పార్కు సమీపంలోని 500, నుంచి 600 గజాల ఖాళీ స్థలాన్ని బల్దియా అధికారులు విక్రయించారు. ఇది వివాదస్పదంగా మారింది. రెండేళ్ల కిందట బదిలీ అయిన కమిషనర్ అధ్వర్యంలో అప్పటి సిటీ ప్లానర్ నేతృత్వంలో రూ.10కోట్ల విలువైన భూములు అప్పన్నంగా అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అనేక స్థలాలకు సంబంధించి వివాదాలు కొనసాగుతుండగా.. మరికొన్ని స్థలాలు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఈ మేరకు బల్దియా పాలకవర్గం, అధికారులు స్పందించి బల్దియా ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించకపోతే రూ.కోట్ల విలువైన స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ఖాయమనే చెప్పాలి. -
గడువు తొమ్మిది రోజులే
ముకరంపుర: ఖాళీ స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇంటి నిర్మాణాల క్రమబద్ధీకరణకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీ స్థలాలకు సంబంధం లేకుండా ఇళ్లు నిర్మించుకున్న పేద వారికే ఈ అవకాశం పరిమితం చేసింది. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం జీవో నెం.58, 59ల జారీ ద్వారా అవకాశం కల్పించింది. జీవోలను డిసెంబర్ 30 న విడుదల చేసినప్పటికీ రెండు రోజుల క్రితమే మార్గదర్శకాలను జారీ చేసింది. జిల్లాలో ఇంతవ రకూ ఒక్క దరఖాస్తు కూడా నమోదు కాలేదు. ఈ నెల 19 వరకు తుది గడువుండగా ఆక్రమణలపై.. నిర్మాణాలపై ఎవరూ ముందుకు రాలేదు. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో ఆక్రమిత నిర్మాణాలున్నప్పటికీ ఇప్పటికీ వరకు స్పందన లేకపోవడంపై అధికారులు సమాలోచన చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్. మీనా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించాలని ఆదేశించారు. దరఖాస్తు ఫారాలను అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అర్బన్ ప్రాంతాలే కీలకం.. పేదల ఆక్రమిత నివాస స్థలాల్లోని ఇండ్ల రెగ్యులరైజేషన్‌లో అర్బన్ ప్రాంతాలే కీలకం కానున్నాయి. జిల్లాలోని 11 పట్టణ ప్రాంతాల్లోనే రెగ్యులరైజేషన్‌కు దరకాస్తులు వచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలో ఆక్రమిత భూముల వివరాలు ప్రజలు దరఖాస్తు ద్వారానే తెలుసుకునే పరిస్థితి రావడం జిల్లా యంత్రాంగం పనితీరుకు అద్దం పడుతోంది. అయితే ఆక్రమిత నిర్మాణం చేసి తప్పు చేసిన భావనతోనే దరఖాస్తులకు ముందుకు రాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. రెగ్యులరైజేషన్ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించదని జీవో స్పష్టం చేస్తోంది. క్రమబద్ధీకరణకు ఆర్డీవోలు, తహశీల్దార్లనే బాధ్యులు చేశారు. దరఖాస్తులు చేసుకున్న 90 రోజుల్లో ఆ ఇంటికి సంబంధించి మహిళ పేరున పట్టాజారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు. ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలు, శిఖం, నాలాలు, కుంటలు, చెరువులు, పూర్తి నీటి మట్టం పరిధిలోనివి, నీటి ట్యాంకులు, నీటి శుద్ధి ప్రాంతాలు, శ్మశానాలు, మోడల్ టౌన్షిప్లకు ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాలు, కాలిబాటలు, అత్యంత విలువైన స్థలాలు, నీటి శుద్ధిప్లాంట్లు, గ్రీన్‌బెల్ట్ స్థలాలు, బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలను మినహాయించారు. చారిత్రాత్మక వారసత్వ భవనాలు, కట్టడాలు ఉన్న ప్రాంతాల్లోని వాటిని క్రమబద్ధీకరించడం జరిగిందని ప్రభుత్వం నిబంధనల్లో స్పష్టంగా పేరొన్నారు. ఇదీ టారిఫ్.. 125 గజాల స్థలం వరకు ఉచితంగా, 250 గజాలలోపు ఉన్న స్థలానికి బేసిక్ వాల్యూ ప్రకారం 50 శాతం కట్టించుకుని క్రమబద్ధీకరించనున్నారు. 500 గజాల స్థలం వరకు నిబంధనల 75 శాతం డీడీ తీసి దరఖాస్తుతో పాటు జతపర్చాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2వ తేదీ 2014 వరకు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉన్న వారికే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ఈ పథకంలో లబ్ధిపొందాలంటే పట్టణాల్లో రూ.2 లక్షలు, పల్లెల్లో రూ.1.5 లక్షల ఆదాయం లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. ఇంకా భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, కరెంటుబిల్లు, నల్లా బిల్లు, ఇంటి పర్మిషన్ పత్రం వీటిలో ఏదో ఒకటి జతచేసి తహశీల్దార్ కార్యాలయంలో అందించాల్సి వుంటుంది. గడువు పెంచండి.. ఆక్రమిత నివాసస్థలాలోని ఇండ్ల రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువు మరింత పెంచాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. శుక్రవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్మీనాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మిగిలిన కలెక్టర్లు కూడా ఇదే సమస్యను విన్నవించారు. ఈ నెల 19 లోపు సెలవులు అధికంగా ఉన్నాయని.. మరింత గడువు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు బీఆర్ మీనా మాట్లాడుతూ జిల్లాలోని సింగరేణి తదితర సంస్థలకు ప్రభుత్వం కేటాయించిన భూములలో నివాసం ఉంటున్న వారి క్రమబద్ధీకరణ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. -
అందుబాటు గృహాలకు ఇదీ మార్గం!
సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ, ఆ కల సాకారం కావాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. మరి సామాన్య, మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్‌లో సొంతిల్లు కొనుక్కోవటం కష్టమా? పోనీ.. అందుబాటు గృహాలను అందించేందుకు ముందుకొచ్చే నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందా అంటే అదీ ఉండదంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏమంటున్నారంటే.. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ లెక్కల ప్రకారం.. మన దేశంలో దాదాపు 2.65 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2020 నాటికి ఇది మూడు కోట్లకు చేరుకునే అవకాశముందని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. దశాబ్దం నుంచి పెరిగే జనాభా కారణంగా నగరాల్లో స్థల లభ్యత దారుణంగా తగ్గింది. ఫలి తంగా ఇళ్ల కొరత రోజురోజుకూ పెరుగుతోంది. మంచినీరు, విద్యు త్తు, ఖాళీ స్థలాలూ లేని మురికివాడలు అధికంగా వెలుస్తున్నాయి. ఆర్థిక నియంత్రణ, నగరీకరణ వంటి అంశాల్లో ఎదురయ్యే అవాంతరాలతో.. చౌక గృహాల నిర్మాణం పుంజుకోవట్లేదు. ఒకవైపు భూముల ధరలు ఆకాశాన్నంటాయి. మరోవైపు నిర్మాణ వ్యయమూ పెరిగింది. ఈ రెండింటి ప్రభావం అందుబాటు గృహాల నిర్మాణం మీద పడుతోంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించడానికీ ముందుకు రావట్లేదు. శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకే ఫ్లాట్లను అందించాలని మొదలుపెట్టినవారూ అయిష్టంగానే ధరలు పెంచాల్సిన దుస్థితి నెలకొంది. సామాన్యులకు బ్యాంకు ఖాతాలుండవు. ఒకవేళ ఉన్నా క్రమం తప్పకుండా లావాదేవీలను నిర్వహించరు. కొందరికేమో పాన్ కార్డులుండవు. చిన్నాచితకా ఉద్యోగాలు చేయడంతో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయరు. దీంతో బ్యాంకులు గృహరుణాల్ని మంజూరు చేయవు. కాబట్టి ఆర్బీఐ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరముంద ని నిపుణులు సూచిస్తున్నారు. మనకంటే చిన్నదేశాలైన సింగపూర్, హాంకాంగ్, మలేసియా వంటివి ముందంజలో ఉన్నాయి. స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ తదితర దేశాలు అందుబాటు గృహాల్ని నిర్మించడంలో స్పష్టమైన ప్రణాళికల్ని పాటిస్తున్నాయి. అక్కడి నిర్మాణ సంస్థల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త విధానాల్ని రూపొందిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలకు మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. అదే మన దేశంలో చూస్తే.. ‘ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి’ అన్న చందంగా ఉంది. దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర సంస్థలకు స్థలాలున్నాయి. మరి, ఈ సంస్థలేం చేస్తున్నాయంటే.. వేలం ద్వారా ఆయా స్థలాల్ని విక్రయిస్తున్నాయి. మార్కెట్లో కృత్రిమ గిరాకీని సృష్టిస్తున్నాయి. అందుబాటు గృహాల విస్తీర్ణం తక్కువుండేలా చూడటం, క్రాస్ సబ్సిడీలను అందించడం, ప్రోత్సాహకాల్ని ప్రకటించడం, ఇళ్ల సరఫరా, గిరాకీకి అనుగుణంగా రాయితీల్ని ఇవ్వడం వంటి పథకాల్ని ప్రకటించాలి. అప్పుడే నిర్మాణ సంస్థలు ముందుకొస్తాయి. ప్రభుత్వ స్థలాల్లో అందుబాటు గృహాల్ని నిర్మించి నామమాత్రపు ధరకే విక్రయిస్తే సామాన్యులెందరో కొనుగోలు చేస్తారు. కనీసం ఇలాగైనా ఇళ్ల కొరత తీరుతుందని నిపుణులంటున్నారు.