గత నవంబర్‌లో జీఈఎస్ సదస్సు నేపథ్యంలో మాదాపూర్‌లో ఇలా సుందరీకరణ చేశారు...(ఫైల్)
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖాళీ స్థలాలు ఇక బ్యూటీ స్పాట్‌లుగా మారనున్నాయి. ఇవి చెత్త డంప్‌లుగా మారకుండా సర్వాంగ సుందరంగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు ఖాళీ స్థలాల్లో సైతం చెత్తను వేయకుండా కట్టడి చేసేందుకు ఒక బృహృత్తర ప్రణాళిక రూపొందించింది. ముందుగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు వాటి చుట్టూ కీపాండ్ వాల్స్ నిర్మాణం చేపట్టి అందమైన పూల మొక్కలు, షో చెట్లు పెంచాలని నిర్ణయించింది. ఇందులో స్థానికుల సహాయ సహకారాలు, భాగస్వామ్యం ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. దీంతో విలువైన స్థలాలను పరిరక్షించడంతో పాటు వీటిని ఆట స్థలాలు, పార్కులుగా అభివృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు వీలవుతుందని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఈమేరకు ఆయా స్థలాల సుందరీకరణపై నెలరోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది.
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చాలా ప్రాంతాఆల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో చెత్తను వేయడం ద్వారా అవి మురికి, చెత్త డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. ఫలితంగా దోమల ఉత్పత్తికి కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ ఖాళీ స్థలాలో వేసే డంపింగ్ పై నగర వాసుల నుంచి పెద్ద ఎత్తున జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు అందడం సర్వసాధారణంగా మారాయి.
నేటి నుంచి సుందరీకరణ మాసం
నగరంలోని ఖాళీ స్థలాల సుందరీకరణ కోసం ఒక నెల రోజులు ప్రత్యేకంగా కేటాయించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఖాళీ స్థలాల సుందరీకరణ మాసంగా పాటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి డిప్యూటి, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నగరంలోని తమ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని, వాటిలో జీహెచ్‌ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలు అయితే వెంటనే ప్రహారీ గోడలను తగు అనుమతితో నిర్మించి మొక్కలను నాటించడం, మంచి ప్లే గ్రౌండ్‌లుగా మార్చాలని ఆదేశించారు. ఖాళీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి అయితే ఆ స్థలం యజమానులను పొరుగువారితో కలిసి గుర్తించనున్నారు.
ఆయా గుర్తించిన ఖాళీ స్థలాల్లో తిరిగి చెత్త వేయకుండా బోర్డులను ప్రదర్శిస్తారు. ఖాళీ స్థలాల ఇంటి యజమానులతో ప్రహరీ గోడలను నిర్మించే విధంగా చర్యలు చేపట్టి తిరిగి ఎవ్వరు కూడా చెత్తను వేయకుండా పొరుగు ఇంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ప్రతి ఖాళీ స్థలాలను ఒక జవాను లేదా ఎస్.ఎఫ్.ఏ లేదా ఇతర కార్మికుడిని ఇన్‌చార్జిగా నియమిస్తారు. ఎవ్వరూ కూడా చెత్త వేయకుండా నిరోధిస్తారు. అదేవిధంగా ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం వల్ల అధికంగా సమస్యలు ఎదుర్కొనే వారిని గుర్తించి వారిని స్వచ్ఛ రాయబారిగా నియమించనున్నారు. ఈ ఖాళీ స్థలాలు పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటే పార్కింగ్ ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment