గద్వాల క్రైం : నివాసగృహాల మధ్య ఖాళీ ప్లాట్లు.. అందులో పిచ్చి మొక్కలు.. దట్టంగా ముళ్లపొదలు.. ఇలా గృహనివాసాల మధ్య ఏపుగా పెరిగిన చెట్లతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ప్లాటు యజమానికి చెప్పినా పట్టించుకోపోవడంతో పట్టణంలో హౌసింగ్ బోర్డు, రెండో రైల్వే గేట్, బీసీ కాలనీ, గంజిపేట, చింతలపేట తదితర కాలనీలో ఖాళీ ప్లాట్లలో ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి.
∙ప్రజల రక్షణ, శాంతిభద్రతల నిమిత్తం గద్వాల పోలీసులు వినూత్నంగా వివిధ కాలనీలో ఖాళీ స్థలం, ప్లాట్లలో మొలిచిన ముళ్లపొదల తొలగింపుపై దృష్టిసారించారు. వివిధ కాలనీల్లో ఖాళీ ప్లాట్లు ఉన్న వివరాలు సేకరించి ముళ్లపొదలు తొలగించాల్సిందిగా యా జమానులకు తెలియజేస్తున్నారు. వారు చెప్పినా.. యాజమానులు తొలగించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. జేసీబీల సాయంతో పట్టణంలోని అన్నికాలనీల్లో ముళ్లపొదల తొలగింపు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా ఆ ప్లాట్లలో ముళ్లపొదలు తొలగించని వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
కాలనీ ప్రజల శ్రేయస్సు దిశగా..
పట్టణంలో వివిధ కాలనీలో ముళ్లపొదలను తొలగించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా గద్వాల మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు తెలియజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పట్టణంలో ఎటు చూసినా చెత్తచెదారం, ముళ్లపొదలతో నిండిపోయింది.
నోటీసులు జారీ చేస్తున్నాం
పట్టణంలోని ఖాళీ స్థలాల్లో ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఉండటంతో అనుకోని సంఘటనలు జరిగిన సందర్భంలో ముళ్లపొదలలో దాగి తప్పించుకునే వీలుంటుంది. ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉంటున్నాయి. పలు సమస్యలు ఉత్పన్నమయే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఖాళీ స్థలాల్లో ఏర్పడిన ముళ్లపొదలు తొలగిస్తున్నాం. ఇప్పటికే పలువురు యజమానులకు నోటీసులు జారీ చేశాం. ఆదేశాలను బేకాతరు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వర్లు, పట్టణ ట్రాఫిక్ ఎస్‌ఐ
Comments
Please login to add a commentAdd a comment