‘‘మా ఫామ్‌ల్యాండ్‌లో రూ. 3 లక్షలుపెట్టి రెండు గుంటలు (242 గజాలు) కొంటే ప్రతి నెలా రూ. 15 వేల అద్దె చొప్పున 20 నెలల తర్వాత రూ. 3 లక్షల అసలు సహా మొత్తం రూ. 6 లక్షలు చెల్లిస్తాం. 4 గుంటల స్థలానికి రూ. 6 లక్షలు చెల్లిస్తే ప్రతి నెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ. 12 లక్షలు ఇస్తాం. 8 గుంటలకు రూ. 12 లక్షలు కడితే నెలకు రూ. 24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తాం’’ హైదరాబాద్‌కు 140 కి.మీ. దూరంలోని నారాయణ్‌ఖేడ్‌లో ఓ రియల్ ఎస్టేట్
సంస్థ ఫామ్‌ల్యాండ్ వెంచర్ పేరిట వినియోగదారులను ఆకర్షించేందుకు జోరుగా సాగిస్తున్న ప్రచారం ఇది.
ప్రీలాంచ్ పేరిట గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో కొందరు బిల్డర్లు వేలాది మంది మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను కల్లలు చేసి సొమ్ము చేసుకుంటుంటే తాజాగా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాళీ స్థలాలను వెంచర్ల పేరు చెప్పి బై బ్యాక్, రెంటల్ ఇన్‌కం, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి కొత్త పేర్లతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏడాదిలో అద్దె సహా కట్టిన సొమ్మును వాపసు చేస్తామంటూ నమ్మించి ఫామ్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ. 5 వేలు కూడా పలకని ప్రాంతంలో గజం రూ. 10 వేలకుపైనే విక్రయించి ముందే డబ్బు వసూలు చేసుకుంటున్నారు. డీటీసీపీ, హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు, రెరాలో నమోదు చేసుకోకుండానే వెంచర్లలో ప్లాట్లను విక్రయిస్తున్నారు.
నమ్మకస్తులే మధ్యవర్తులుగా..
గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతి నెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు.
అసలుకు రెట్టింపు ఆశ చూపి...
చట్ట నిబంధనల ప్రకారం ఫామ్‌ల్యాండ్ వెంచర్‌లను రియల్ ఎస్టేట్ సంస్థలు కనీసం అర ఎకరం, ఆపై మొత్తాల్లోనే విక్రయించాలి. అయితే అంత విస్తీర్ణంలోని భూముల ధరలు రూ. పదుల లక్షలు, ఆపైనే ఉంటాయి కాబట్టి సామాన్యులు అంత డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఆయా సంస్థలు ఫామ్‌ల్యాండ్ వెంచర్‌లను గజాలు లేదా గుంటల లెక్కన విక్రయిస్తున్నాయి. నిరీ్ణత కాలం తర్వాత అసలుకు రెట్టింపు డబ్బు ఇస్తామని ఆశ చూపుతూ వినియోగదారులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి.
కొన్ని చోట్ల మాత్రం అధికారులకు లంచాలు ఇచ్చి ఆ స్థలాలను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఒకవేళ అగ్రిమెంట్ గడువు తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమై సంస్థ డబ్బు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోయినా లేదా కంపెనీ బోర్డు తిప్పేసినా కొనుగోలుదారులే మోసపోతున్నారు. తమకు కొసరు ఇవ్వకపోయినా పరవాలేదు అసలు సొమ్ము ఇస్తే చాలంటూ సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనిపై చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకాడుతున్నారు. అలా చేస్తే తమ పేర్లు బయటపడటంతోపాటు ఆయా సంస్థలు కోర్టులోనే తేల్చుకోమంటాయేమోనని భయపడుతున్నారు.
ఈ పట్టణాల్లో కుప్పలుతెప్పలుగా...
సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి హైదరాబాద్ నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్టులు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నాయి. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్‌ఫ్రాకాన్, జయ గ్రూప్, ఫార్చ్యూన్ 99 తదితర సంస్థలు ఈ మోసాలకు పాల్పడుతున్నాయి.
బై బ్యాక్ పేరుతో మోసపోయా...
జనగాం జిల్లాలోని పెంబర్తిలో 11 ఎకరాలలో ఓ సంస్థ వేసిన వెంచర్‌లో బై బ్యాక్ స్కీమ్ కింద రూ. 20 లక్షలకు 183.33 గజాల స్థలం కొన్నా. 12 నెలల తర్వాత లాభం రూ. 10 లక్షలు, మొదట్లో నేను కట్టిన రూ. 20 లక్షలు కలిపి మొత్తం రూ. 30 లక్షలు తిరిగి చెల్లిస్తామని సంస్థ నాతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఏడాది దాటినా సొమ్ము చెల్లించడం లేదు. – ఓ బాధితుడి ఆవేదన.
స్కీమ్‌లలో తీసుకొని మోసపోవద్దు...
ప్రీలాంచ్, బై బ్యాక్, రెంటల్ గ్యారంటీ అంటూ రకరకాల పేర్లతో సామాన్యులను కొందరు వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. టీఎస్–రెరా, నిర్మాణ అనుమతులు లేని ఏ ప్రాజెక్ట్‌లలోనూ ప్రజలు స్థలాలు కొనుగోలు చేయకూడదు. రెరా రిజి్రస్టేషన్ లేని మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదు.
–విద్యాధర్, సెక్రటరీ, టీఎస్–రెరా
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి...
రియల్టీ మార్కెట్‌ను స్కీమ్‌ల పేరుతో కొందరు బిల్డర్లు చెడగొడుతున్నారు. స్థలం కొనుక్కోవాలనుకొనే సామాన్యుల ఆశలను ఆసరా చేసుకొని మోసం చేస్తున్నారు. స్కీమ్‌ల పేరుతో విక్రయించే స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– సునీల్ చంద్రారెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ
చదవండి: బీఆర్‌ఎస్.. బందిపోట్ల రాక్షసుల సమితి
Comments
Please login to add a commentAdd a comment