అందుబాటు గృహాలకు ఇదీ మార్గం! | way to own house | Sakshi
Sakshi News home page

అందుబాటు గృహాలకు ఇదీ మార్గం!

Published Sat, Mar 8 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

అందుబాటు గృహాలకు ఇదీ మార్గం!

అందుబాటు గృహాలకు ఇదీ మార్గం!

 సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ, ఆ కల సాకారం కావాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. మరి సామాన్య, మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్‌లో సొంతిల్లు  కొనుక్కోవటం కష్టమా? పోనీ.. అందుబాటు గృహాలను అందించేందుకు ముందుకొచ్చే నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందా అంటే అదీ ఉండదంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇంకా ఏమంటున్నారంటే..
  కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ లెక్కల ప్రకారం.. మన దేశంలో దాదాపు 2.65 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2020 నాటికి ఇది మూడు కోట్లకు చేరుకునే అవకాశముందని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. దశాబ్దం నుంచి పెరిగే జనాభా కారణంగా నగరాల్లో స్థల లభ్యత దారుణంగా తగ్గింది. ఫలి తంగా ఇళ్ల కొరత రోజురోజుకూ పెరుగుతోంది. మంచినీరు, విద్యు త్తు, ఖాళీ స్థలాలూ లేని మురికివాడలు అధికంగా వెలుస్తున్నాయి.

  ఆర్థిక నియంత్రణ, నగరీకరణ వంటి అంశాల్లో ఎదురయ్యే అవాంతరాలతో.. చౌక గృహాల నిర్మాణం పుంజుకోవట్లేదు. ఒకవైపు భూముల ధరలు ఆకాశాన్నంటాయి. మరోవైపు నిర్మాణ వ్యయమూ  పెరిగింది. ఈ రెండింటి ప్రభావం అందుబాటు గృహాల నిర్మాణం మీద పడుతోంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించడానికీ ముందుకు రావట్లేదు. శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకే ఫ్లాట్లను అందించాలని మొదలుపెట్టినవారూ అయిష్టంగానే ధరలు పెంచాల్సిన దుస్థితి నెలకొంది.

  సామాన్యులకు బ్యాంకు ఖాతాలుండవు. ఒకవేళ ఉన్నా క్రమం తప్పకుండా లావాదేవీలను నిర్వహించరు. కొందరికేమో పాన్ కార్డులుండవు. చిన్నాచితకా ఉద్యోగాలు చేయడంతో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయరు. దీంతో బ్యాంకులు గృహరుణాల్ని మంజూరు చేయవు. కాబట్టి ఆర్‌బీఐ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరముంద ని నిపుణులు సూచిస్తున్నారు.
  మనకంటే చిన్నదేశాలైన సింగపూర్, హాంకాంగ్, మలేసియా వంటివి ముందంజలో ఉన్నాయి. స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ తదితర దేశాలు అందుబాటు గృహాల్ని నిర్మించడంలో స్పష్టమైన ప్రణాళికల్ని పాటిస్తున్నాయి.

అక్కడి నిర్మాణ సంస్థల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త విధానాల్ని రూపొందిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలకు మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. అదే మన దేశంలో చూస్తే.. ‘ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి’ అన్న చందంగా ఉంది. దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర సంస్థలకు స్థలాలున్నాయి. మరి, ఈ సంస్థలేం చేస్తున్నాయంటే.. వేలం ద్వారా ఆయా స్థలాల్ని విక్రయిస్తున్నాయి. మార్కెట్లో కృత్రిమ గిరాకీని సృష్టిస్తున్నాయి.

  అందుబాటు గృహాల విస్తీర్ణం తక్కువుండేలా చూడటం, క్రాస్ సబ్సిడీలను అందించడం, ప్రోత్సాహకాల్ని ప్రకటించడం, ఇళ్ల సరఫరా, గిరాకీకి అనుగుణంగా రాయితీల్ని ఇవ్వడం వంటి పథకాల్ని ప్రకటించాలి. అప్పుడే నిర్మాణ సంస్థలు ముందుకొస్తాయి. ప్రభుత్వ స్థలాల్లో అందుబాటు గృహాల్ని నిర్మించి నామమాత్రపు ధరకే విక్రయిస్తే సామాన్యులెందరో కొనుగోలు చేస్తారు. కనీసం ఇలాగైనా ఇళ్ల కొరత తీరుతుందని నిపుణులంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement