ఉద్యోగులు చేస్తున్న పనికి కేవలం జీతం ఇచ్చి ఇంటికి పంపించకుండా వారికి మౌలికసదుపాయాలు కల్పించడంపై ప్రముఖ కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్ తన ఉద్యోగులకు ఏకంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈమేరకు ఇండస్ట్రీయల్ హౌజింగ్ మోడల్స్ పేరుతో ఇప్పటికే చైనా, వియత్నాం వంటి దేశాల్లో అమలులో ఉన్న ఈ విధానాన్ని భారత్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు అధికారులు తెలిపారు.
గడిచిన రెండున్నరేళ్లలో ఇండియాలో 1.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు యాపిల్ వర్గాలు తెలిపాయి. వీరికి ఇళ్లు నిర్మించేలా కంపెనీ చర్యలు తీసుకోబోతున్నట్లు అధికారులు చెప్పారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, సాల్‌కాంప్ వంటి సంస్థలు తమ ఉద్యోగుల కోసం గృహాలను నిర్మించే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘యాపిల్ ఆవాస్ యోజన’ పేరుతో గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వార్తాకథనాల ద్వారా తెలిసింది. ఈ పథకం కింద దాదాపు 78,000 యూనిట్లు ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అందులో గరిష్ఠంగా తమిళనాడులోనే 58,000 యూనిట్ల ఇళ్ల కేటాయింపులు జరగనున్నాయి. స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు (సిప్‌కాట్) సహకారంతో ఆ రాష్ట్రంలో ఇళ్లు నిర్మిస్తారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. టాటా గ్రూప్‌తోపాటు ఎస్‌పీఆర్ ఇండియా నుంచి ఈ పథకానికి సహకారం అందనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 10-15% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రానున్నాయి. మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించనున్నట్లు తెలిసింది.
మార్చి 31, 2025లోపు గృహాల నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకంతో ముఖ్యంగా మహిళలకు అధికంగా లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం అద్దె గృహాల్లో నివసిస్తున్నారు. వారు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి చాలాసేపు ప్రయాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కంపెనీ ఉత్పాదకతతోపాటు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు.
భారత్‌లో ప్రధాన ఐఫోన్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ తన 41,000 మంది ఉద్యోగుల కోసం 35,000 ఇళ్లను నిర్మించనుంది. వీరిలో 75శాతం మహిళలే ఉండడం గమనార్హం. టాటా ఎలక్ట్రానిక్స్ తన ఉద్యోగుల కోసం హోసూర్ ఫెసిలిటీలో 11,500 ఇళ్లను నిర్మిస్తుంది. యాపిల్ కోసం పవర్ అడాప్టర్‌లు, ఎన్‌క్లోజర్‌లను ఉత్పత్తి చేసే సాల్‌కాంప్ 3,969 యూనిట్‌లను ఏర్పాటు చేయనుంది.
ఇదీ చదవండి: పుష్పరాజ్.. బ్రాండింగ్‌లో తగ్గేదేలే..
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకంలో భాగంగా స్థానిక కంపెనీలతో కలిసి టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఉత్పత్తులను భారత్‌లో తయారుచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment