భూదాహం..
- రూ.3 వేల కోట్ల విలువైన భూములపై పెద్దల కన్ను
- కారుచౌకగా కాజేసేందుకు యత్నాలు
- అధికారులపై ఒత్తిళ్లు
విశాఖ రూరల్: జిల్లాలో ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి. వందల ఎకరాల వరకు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇప్పటికే పరదేశిపాలెంలో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూధాన భూముల అక్రమ కేటాయింపులు వెలుగులోకి రాగా.. తాజాగా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన స్థలాలపై పెద్దల కన్ను పడింది. రూ.3 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కారుచౌకగా కొట్టేయడానికి ఫైలు సిద్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ) కోసం 8 ఏళ్ల క్రితం చేసిన జీవోను అడ్డుపెట్టుకొని 316 ఎకరాలను కేవలం రూ.158 కోట్లకే కొట్టేయడానికి కొంత మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి తెరవెనుక మంత్రాంగాన్ని నడుపుతున్నట్లు భోగట్టా. ఇందుకోసం అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్టు సమాచారం.
ఎపీఎఫ్‌డీసీకి 316 ఎకరాలు
విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం భూములు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 2005లో ప్రభుత్వాన్ని కోరింది. దీంతో జిల్లా అధికారులు భీమిలిలో అన్నవరం సర్వే నంబర్ 101లో 80 ఎకరాలు, కుమ్మరిపాలెం సర్వే నంబర్ 87లో 80 ఎకరాలు, కొత్తవలస సర్వే నంబర్ 73లో 154 ఎకరాలు కొండ పోరంబోకు భూములను గుర్తించారు. అన్నవరం భూములకు ఎకరాకు రూ.4 లక్షలు, కొత్తవలసలో ఎకరాకు రూ.8 లక్ష లు, కుమ్మరిపాలెంలో ఎకరాకు రూ.10 లక్షలు చొప్పున ప్రతిపాదనలు రూపొందించారు.
భూ పరిపాలన ముఖ్య కమిషనర్ మాత్రం ప్రాంతం తో సంబంధం లేకుండా ఎకరాకు రూ.50 లక్షలు చొప్పున ధర నిర్ణయించారు. 316 ఎకరాలకు మొత్తం రూ.158 కోట్లు చెల్లించాలంటూ 2006, నవంబర్ 10న జీవో నెంబర్ 1650 విడుదల చేశారు. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాత్రం ఇప్పటి వరకు ఆ భూములను కొనుగోలు చేయలేదు.
అందరి కళ్లు ఆ భూముల పైనే..
రాష్ట్ర విభజన తర్వాత అందరి చూపు విశాఖపైనే పడింది. హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విశాఖలో భూముల ధరలు విపరీతంగా ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో భవిష్యత్తు అభివృద్ధి విశాఖపైనే కేంద్రీకృతమై ఉంది. దీంతో ఇక్కడ భూములపై పెద్దల కళ్లు పడ్డాయి. ప్రభుత్వ భూములను కారు చౌకగా కొట్టేయడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించిన స్థలాన్ని కొట్టేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి.
ఆ సంస్థ కోసం చేసిన జోవోను ఆధారంగా చేసుకొని ఎకరా రూ.10 కోట్లు విలువ చేసే ఆ భూములను 2006లో ప్రతిపాదిత ధర రూ.50 లక్షలకే చేజిక్కించుకోడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అండదండలతో వ్యవహారాన్ని నడుపుతున్నట్టు సమాచారం. రెండేళ్ల క్రితం ఒక ప్రముఖ హీరో భీమిలిలో స్టూడియో నిర్మాణానికి స్థలాన్వేషణ చేశారు. అధికారులు సైతం అత్యంత రహస్యంగా భూములను గుర్తించే పనిని చేపట్టారు. అప్పట్లో ఏపీఎఫ్‌డీసీ భూములను కూడా పరిశీలించారు. కానీ స్టూడియో ఏర్పాటు నిర్ణయం జరగలేదు.
అధికారులపై ఒత్తిళ్లు
తాజాగా రూ.3 వేల కోట్లు విలువ చేసే ఆ భూములను 2006లో నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసేందుకు ఫైలు సిద్ధమవుతోంది. ఈ విషయంలో ఒక ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ స్థాయిలో ఈ నిర్ణయం జరగాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ భూములను ఇతర ప్రాజెక్టులకు గుర్తించకుండా ఉండాలంటూ సదరు ప్రజాప్రతినిధి అధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది.
సాధారణంగా ఒక ప్రాజెక్టు కోసం కేటాయించిన స్థలాన్ని సదరు సంస్థ కొనుగోలు చేయని పక్షంలో లేదా కొనుగోలు చేసినా నిర్ణీత సమయంలో నిర్మాణాలను చేపట్టని పక్షంలో ఆ భూములను వెనక్కు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆ భూముల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా జిల్లాలో విద్యా సంస్థలు, ఇతర ప్రాజెక్టు కోసం రెవెన్యూ అధికారులు జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నారు.
ఇందులో ఏపీఎఫ్‌డీసీకి కేటాయించిన భూములను చేర్చకూడదంటూ అధికారులపై ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేటాయింపుల నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో జరగాల్సి ఉంటుందని, ఇందులో తమ పాత్ర నామమాత్రమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.