- ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యలు
- బదిలీ అయిన తర్వాత విలేకరుల సమావేశంలో ఏడీజీపీ ఆర్‌పీ శర్మ
బెంగళూరు : అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూములు అనర్హులకు కట్టబెట్టారని ఆరోపిస్తు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌పై కేసు నమోదైందని, అయితే ఆయనను అరెస్టు చేయడం లేదని బీఎంటీఎఫ్ (బెంగళూరు మెట్రో పాలిటన్ టాస్క్ ఫోర్స్) చీఫ్, ఏడీజీపీ ఆర్.పీ. శర్మ తెలిపారు. బీఎంటీఎఫ్ చీఫ్ స్థానం నుంచి ఆర్‌పీ శర్మను బదిలీ చేస్తూ గురువారం పోద్దుపోయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు నమోదైన వారందరినీ అరెస్టు చేయాలని నిబంధనలు లేవన్నారు. దర్యాప్తు పూర్తి చేయడానికి ఆరు నెలల సమయం ఉంటుందని చెప్పారు. అన్ని వివరాలు పరిశీలించి ఆధారాలు సేకరించి తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నారు. బెంగళూరు నగరంలో మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి (పోరంబోకు భూములు) అనర్హులకు కట్టబెట్టారని గుర్తు చేశారు.
బెంగళూరు దక్షిణ, ఉత్తర విభాగాలలో 1999 నుంచి 2003 సంవత్సరాల మధ్య ఈ అక్రమాలు జరిగాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారి పేర్లు చెప్పడం తనకు ఇష్టం లేదని, దర్యాప్తు చేసి నివేదిక సమర్పించినట్లు చెప్పారు. అక్రమంగా భూములు ఎవరు మంజూరు చేశారు అని విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వ భూములను కేటాయించే కమిటీ అధ్యక్షుడిగా స్థానిక శాసన సభ్యుడు ఉంటారని గుర్తు చేశారు.
బెంగళూరు ఉత్తర నియోజక వర్గం (అప్పుట్లో, ప్రస్తుతం ఆర్. అశోక్ పద్మనాభనగర నియోజక వర్గం శాసన సభ్యుడు) శాసన సభ్యుడిగా, డిప్యూటి సీఎంగా ఉన్న ఆర్. అశోక్ అక్రమంగా భూములు అనర్హులకు కట్టబెట్టారని పరోక్షంగా చెప్పి విలేకరుల సమావేశం ముగించిన ఆర్‌పీ శర్మ అక్కడి నుండి వెళ్లిపోయారు.