రాజధాని భూములతో రియల్ వ్యాపారమా: అంబటి
హైదరాబాద్: రాజధాని భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ పరిణామం ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను రాబట్టుకోలేక ప్రభుత్వం రైతుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజధాని కోసం వేల ఎకరాల భూసమీకరణ కేవలం టీడీపీ అనుయాయుల రియల్ వ్యాపారం కోసమేనని అంబటి వ్యాఖ్యానించారు. రైతుల ప్రస్తుత దారుణ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే పునరాలోచించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. రాజధాని కోసం భూములిచ్చేందుకు కూడా ఇదేవిధంగా కోట్లు చెల్లిస్తారా అని అంబటి ప్రభుత్వాన్ని ప్రశ్చించారు.