- ఆక్రమణలను అరికట్టాలి
- ఆర్డీవోకు కలెక్టర్ ఆదేశం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పద్మాక్ష్మి గుట్ట స్థలం ఆక్రమణ కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.కిషన్ వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావును ఆదేశించారు. పద్మాక్షి గుట్ట, గుట్టకు సమీపంలోని ప్రభుత్వ భూముల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ‘బతుకమ్మ ఆటకు స్థలం లేదు’ శీర్షికతో సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు.
బతుకమ్మ ఉత్సవాలు జరిగే పద్మాక్షి గుట్ట కబ్జా కాకుండా నిరోధించాలని అధికారులకు చెప్పారు. ఆర్డీవో వెంకటమాధవరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘పద్మాక్షి గుట్ట ఆక్రమణలపై కలెక్టర్ ఆదేశించారని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కాగా, గుట్ట స్థలం కబ్జాపై హన్మకొండ తహసీల్దార్ చెన్నయ్య మాత్రం నిర్లక్ష్యంగా స్పందించారు. కలెక్టర్ దగ్గరి నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదన్నారు.
తన పరిధిలోని భూములను పర్యవేక్షించాల్సిన అధికారి అయి ఉండి.. ఈ విషయం పట్టనట్లుగా వ్యవహరించారు. పాత ఆక్రమణలే ఉన్నాయి గానీ, కొత్తగా ఎలాంటి లేవు అని సిబ్బంది తహసీల్దార్‌కు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తహసీల్దారు కార్యాలయం నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే... పద్మాక్షి గుట్ట ఆక్రమణల విషయం ఇక్కడి అధికారులకు, సిబ్బందికి తెలిసే జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.