Bathukamma festivities
-
ఉద్రిక్తతకు దారి తీసిన బతుకమ్మ ఉత్సవం
ఏపీ ఎన్జీవోస్లో టీ, ఆంధ్రా ఉద్యోగుల వాగ్వాదం హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బుధవారం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఏపీఎన్జీవోస్ కార్యాలయానికి వచ్చారు. వారిని గేట్ లోపలికి రానివ్వకుండా ఆంధ్రా ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. సమాచారం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో తెలంగాణ ఉద్యోగులు గేటు బయట రోడ్డుపైనే బతుకమ్మ ఆడారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని పోలీసులు భాగ్యనగర్ టీఎన్జీవోస్ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణగౌడ్, కార్యదర్శి పి. బలరామ్, అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.ప్రభాకర్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్‌రావు, విద్యానంద్, రమాదేవి తదితరులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. సాయంత్రంవారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో ఇంకా ఆంధ్రా అధికారుల ఆగడాలకు అంతులేకుండా పోతోందన్నారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. -
ఘనంగా బంగారు బతుకమ్మ
బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కవిత ► ‘జాగృతి’తో బతుకమ్మకు జీవం: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ►వేలాదిగా తరలి వచ్చిన మహిళలు ►కిక్కిరిసి పోయిన కలెక్టరేట్ మైదానం నిజామాబాద్ అర్బన్: జిల్లాకేంద్రంలోని క్రీడా అథారిటీ మైదానంలో సోమవారం అధికారికంగా నిర్వహించిన ‘బంగారు బతుకమ్మ’ వేడుకలు అంబరాన్నంటాయి. వేలాది మంది మహిళలు బతుకమ్మలతో పాల్గొన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు,అధికారులు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ అద్దం పడుతుందని అన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడానికి తనకు జిల్లా ప్రజలు ప్లాట్‌ఫాం ఇచ్చారని, వారి రుణం తీర్చుకోలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమం బతుకమ్మకు ప్రాణ ం పోసిందన్నారు. అందరూ పుట్టింటిలో బతుకమ్మ ఆడితే తాను అత్తగారింటిలో బతుకమ్మ ఆడుతున్నానని చమత్కరించారు. నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా రూపొందిస్తామని పేర్కొన్నారు. ‘జాగృతి’తో బతుకమ్మకు జీవం: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ‘తెలంగాణ జాగృతి’ని ఏర్పాటు చేసి బతుకమ్మ పండుగకు ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రాణం పోశారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సమైక్యరాష్ట్రంలో బతుకమ్మకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంగా ఈ కార్యక్రమం చేపట్టడంతో తెలంగాణలో ఆడపడుచులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, జడ్పీ వైస్ చైర్మన్ గడ్డం సుమనరెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత,ఎమ్మెల్యేలు, ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. ఉత్సవాలు సక్సెస్... మహిళలు, యువతులు, చిన్నారులు, ఉద్యోగినులతో కలెక్టరేట్ మైదానమంతా నిండిపోయింది. సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు ఉత్సవాలు జరిగాయి. ఎంపీ కవిత తోటి మహిళలలో బతుకమ్మ ఆడి జోష్‌ను నింపారు. ప్రతి గ్రూపు వద్దకు వెళ్లి వారి మధ్యలో బతుకమ్మ ఆటపాటలాడారు. బతుకమ్మ ఆడిన అనంతరం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన తొట్టెలో ఎంపీతో పాటు మహిళలందరూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దఫేదర్‌రాజు, ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, రవీందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి , అధికారులు పాల్గొన్నారు. -
ఇద్దరక్కచెల్లెళ్లు ఉయ్యాలో..
చిన్నశంకరంపేట: ఇద్దరక్క చెల్లెళ్లు ...ఉయ్యాలో ఒక్కూరికిచ్చినారు...ఉయ్యాలో..ఒక్కడే మాఅన్న...ఉయ్యాలో..వచ్చన్నపోడే ఉయ్యాలో అంటూ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తనకిష్టమైన బతుకమ్మ పాటను పాడి మహిళలతో కలిసి పోయారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మన సంప్రదాయలు, సంస్కృతులకు సమైక్య రాష్ట్రంలో సరైన గౌరవం దక్కలేదని అందుకే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన గౌరవం కల్పించారన్నారు. ఇది తెలంగాణ మహిళలకు దక్కిన అరుదైన గౌరవమన్నారు. మన సంస్కృతి, మన సంప్రదాయాలను మన ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట ఎంపీపీ అధ్యక్షురాలు కృపావతి, జెడ్పీటీసీ స్వరూప, ఉపాధ్యక్షురాలు బుజ్జి,మాజీ సర్పంచ్ విజయలక్ష్మి, సర్పంచ్‌లు కుమార్‌గౌడ్,ే హమలత, మాధవి,శోభ, ప్రియా నాయక్, రంగారావు,సత్యనారాయణ,మూర్తి పెద్దులు, అంజయ్య, ఎంపీడీఓ రాణి, తహశీల్దార్ నిర్మల, ఐకేపీ ఏపీఎం ఇందిర, టీఆర్ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి,ర ామ్రెడ్డి, రాజు,నరేందర్,రమేష్‌గౌడ్ పాల్గొన్నారు. శుద్ధమైన నీటితోనే ఆరోగ్యం మెదక్‌రూరల్: శుద్ధి చేసిన నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బ్యాతోల్ గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరందించేందుకు బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సోమవారం డిప్యూటీ స్పీకర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలవికాస్ సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామ ప్రజలకు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి తాగునీటిని అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల వల్ల డయేరియా, కలరా తదితర వ్యాధులు దరిచేరవని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మీ కిష్టయ్య, బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సువర్ణ నారంరెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, నాయకులు జయరాంరెడ్డి, అంజాగౌడ్, కిష్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పద్మాక్షి గుట్టను పరిశీలించండి
ఆక్రమణలను అరికట్టాలి ఆర్డీవోకు కలెక్టర్ ఆదేశం సాక్షి ప్రతినిధి, వరంగల్ : పద్మాక్ష్మి గుట్ట స్థలం ఆక్రమణ కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.కిషన్ వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావును ఆదేశించారు. పద్మాక్షి గుట్ట, గుట్టకు సమీపంలోని ప్రభుత్వ భూముల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ‘బతుకమ్మ ఆటకు స్థలం లేదు’ శీర్షికతో సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. బతుకమ్మ ఉత్సవాలు జరిగే పద్మాక్షి గుట్ట కబ్జా కాకుండా నిరోధించాలని అధికారులకు చెప్పారు. ఆర్డీవో వెంకటమాధవరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘పద్మాక్షి గుట్ట ఆక్రమణలపై కలెక్టర్ ఆదేశించారని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కాగా, గుట్ట స్థలం కబ్జాపై హన్మకొండ తహసీల్దార్ చెన్నయ్య మాత్రం నిర్లక్ష్యంగా స్పందించారు. కలెక్టర్ దగ్గరి నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదన్నారు. తన పరిధిలోని భూములను పర్యవేక్షించాల్సిన అధికారి అయి ఉండి.. ఈ విషయం పట్టనట్లుగా వ్యవహరించారు. పాత ఆక్రమణలే ఉన్నాయి గానీ, కొత్తగా ఎలాంటి లేవు అని సిబ్బంది తహసీల్దార్‌కు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తహసీల్దారు కార్యాలయం నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే... పద్మాక్షి గుట్ట ఆక్రమణల విషయం ఇక్కడి అధికారులకు, సిబ్బందికి తెలిసే జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.