ఘనంగా బంగారు బతుకమ్మ
బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కవిత
► ‘జాగృతి’తో బతుకమ్మకు జీవం: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
►వేలాదిగా తరలి వచ్చిన మహిళలు
►కిక్కిరిసి పోయిన కలెక్టరేట్ మైదానం
నిజామాబాద్ అర్బన్: జిల్లాకేంద్రంలోని క్రీడా అథారిటీ మైదానంలో సోమవారం అధికారికంగా నిర్వహించిన ‘బంగారు బతుకమ్మ’ వేడుకలు అంబరాన్నంటాయి. వేలాది మంది మహిళలు బతుకమ్మలతో పాల్గొన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు,అధికారులు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ అద్దం పడుతుందని అన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడానికి తనకు జిల్లా ప్రజలు ప్లాట్‌ఫాం ఇచ్చారని, వారి రుణం తీర్చుకోలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమం బతుకమ్మకు ప్రాణ ం పోసిందన్నారు. అందరూ పుట్టింటిలో బతుకమ్మ ఆడితే తాను అత్తగారింటిలో బతుకమ్మ ఆడుతున్నానని చమత్కరించారు. నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా రూపొందిస్తామని పేర్కొన్నారు.
‘జాగృతి’తో బతుకమ్మకు జీవం: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
‘తెలంగాణ జాగృతి’ని ఏర్పాటు చేసి బతుకమ్మ పండుగకు ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రాణం పోశారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సమైక్యరాష్ట్రంలో బతుకమ్మకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంగా ఈ కార్యక్రమం చేపట్టడంతో తెలంగాణలో ఆడపడుచులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, జడ్పీ వైస్ చైర్మన్ గడ్డం సుమనరెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత,ఎమ్మెల్యేలు, ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు.
ఉత్సవాలు సక్సెస్...
మహిళలు, యువతులు, చిన్నారులు, ఉద్యోగినులతో కలెక్టరేట్ మైదానమంతా నిండిపోయింది. సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు ఉత్సవాలు జరిగాయి. ఎంపీ కవిత తోటి మహిళలలో బతుకమ్మ ఆడి జోష్‌ను నింపారు. ప్రతి గ్రూపు వద్దకు వెళ్లి వారి మధ్యలో బతుకమ్మ ఆటపాటలాడారు. బతుకమ్మ ఆడిన అనంతరం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన తొట్టెలో ఎంపీతో పాటు మహిళలందరూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దఫేదర్‌రాజు, ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, రవీందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి , అధికారులు పాల్గొన్నారు.