ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వెల్లడి
మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు.. తీర్పు రిజర్వ్
బయటకు వెళ్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు: ఈడీ న్యాయవాది
కుమారుడికి పరీక్షలు.. తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: కవిత న్యాయవాది
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. ఈనెల 8వ తేదీ సోమవారం తీర్పు వెలువరిస్తామన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపారు.
కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్, బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింíఘ్వీ, ఈడీ తరఫున జొహెబ్ హొస్సేన్‌లు వాదనలు వినిపించారు.
తల్లి పర్యవేక్షణ అవసరం: సింఘ్వీ
కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, 16 ఏళ్ల కుమారుడికి తల్లి పర్యవేక్షణ, భావోద్వేగ మద్దతు ఈ సమయంలో ఎంతో అవసరమని సింఘ్వీ పేర్కొన్నారు. తల్లి అరెస్టుతో కుమారుడు ఎంతో దిగ్భ్రాంతి చెందిన పరిస్థితిని మనం చూడాలన్నారు. కవిత కుమారుడు పరీక్షలు రాసే సబ్జెక్టులు ప్రస్తావిస్తూ.. తల్లి స్థానాన్ని తండ్రి లేదా సోదరుడు భర్తీ చేయలేరని, మానసిక ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పారు. తల్లి దగ్గర ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపారు.
కవితకు బెయిల్ ఇచ్చినా ఈడీకి వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆమెను తిరిగి సుల భంగానే అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. తండ్రి ఢిల్లీలో ఉండి న్యాయపోరాటం చేస్తున్నారని కుమారుడు తెలంగాణలో ఉన్నారని సింఘ్వీ తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో ప్రధాని ఆల్ ఇండియా రేడియోలో ఉపన్యాసాలు ఇస్తున్నారని, ఆ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఊహకు మించి ఉంటుందని వ్యాఖ్యానించారు.
అన్నీ చూసి కోర్టు నిర్ణయం తీసుకోవాలి: హొస్సేన్
సెక్షన్ 45 నిబంధనలు సింఘ్వీ నొక్కి చెబుతున్నారని, అయితే ప్రజా జీవితంలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకురాలికి అవి వర్తించవని ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ అన్నారు. ఈ కేసులో లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలున్న ప్రధాన వ్యక్తుల్లో ఒక మహిళను ప్రశ్నిస్తున్నామని, ప్రాక్సీల ద్వారా ఆమె లబ్ధి పొందారని వాదించారు. కేవలం ఇతర నిందితుల స్టేట్‌మెంట్ల ఆధారంగానే ఈ విషయం చెప్పడం లేదని, సంబంధిత పత్రాలు, వాట్సాప్ చాట్‌లు కూడా ఉన్నాయని చెప్పారు.
ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలు చూసి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తన దగ్గర ఉన్న ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక సాక్ష్యాలు ఎలా నాశనం చేశారో నిరూపిస్తుందన్నారు. కవిత పలు ఫోన్ల నుంచి సమాచారం డిలీట్ చేశారని, మొత్తంగా 100 కంటే ఎక్కువ ఫోన్లు నాశనం చేశారని ఆరోపించారు. ఈ కేసులో చాలా పెద్ద పురోగతి సాధించే దశలో ఉన్నామని, తాత్కాలిక ఉపశమనం కల్పిస్తే దర్యాప్తు పక్కకు వెళ్లే అవకాశం ఉందన్నారు.
కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని, ప్రజలను కూడా ఆమె ప్రభావితం చేస్తారన్నారు. సాక్షుల్ని పిలిచి వారి వారి వాంగ్మూలాలు మార్చుకోవాలని బెదిరించే అవకాశం ఉందంటూ హొస్సేన్ వాదించారు. ఈ దశలో కవిత న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరోసారి జోక్యం చేసుకొని కవిత కుమారుడికి 12 పేపర్లలో ఏడు పూర్తయ్యాయని భారతీయతలో తల్లి ఒకరే తగిన సాన్నిహిత్యాన్ని అందించగలరని తెలిపారు. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment