ఉద్రిక్తతకు దారి తీసిన బతుకమ్మ ఉత్సవం
ఏపీ ఎన్జీవోస్‌లో టీ, ఆంధ్రా ఉద్యోగుల వాగ్వాదం
హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బుధవారం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఏపీఎన్జీవోస్ కార్యాలయానికి వచ్చారు. వారిని గేట్ లోపలికి రానివ్వకుండా ఆంధ్రా ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది.
సమాచారం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో తెలంగాణ ఉద్యోగులు గేటు బయట రోడ్డుపైనే బతుకమ్మ ఆడారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని పోలీసులు భాగ్యనగర్ టీఎన్జీవోస్ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణగౌడ్, కార్యదర్శి పి. బలరామ్, అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.ప్రభాకర్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్‌రావు, విద్యానంద్, రమాదేవి తదితరులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
సాయంత్రంవారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో ఇంకా ఆంధ్రా అధికారుల ఆగడాలకు అంతులేకుండా పోతోందన్నారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.